క‌రూర్ బాధితుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. హైకోర్టు అడ్డుకోవ‌డంపై సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు

Published : Aug 14, 2026, 02:33 PM IST

Supreme Court: ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో క‌రూర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ప్ర‌మాణాలు కోల్పోయిన వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు క‌ల్పిస్తూ విజ‌య్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే మ‌ద్రాస్ హైకోర్టు ఈ నియామ‌కాలు చెల్ల‌వంటూ తీర్పునిచ్చింది

PREV
15
ఉద్యోగాలపై హైకోర్టు తీర్పుకు సుప్రీం బ్రేక్

కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు తమిళనాడు ప్రభుత్వం కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో విజయ్ సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బాధిత కుటుంబాలకు ఇచ్చిన నియామకాలు చెల్లవంటూ మద్రాసు హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పిటిషన్ దాఖలు చేసిన వారికి నోటీసులు జారీ చేసింది.

25
‘కుటుంబానికి అండగా నిలవకూడదా?’.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని సవాల్ చేయడంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబానికి ప్రధానంగా ఆదాయాన్ని అందించే వ్యక్తి ప్రమాదంలో మరణించినప్పుడు, ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా ప్రభుత్వం సహాయం చేయడం తప్పేమిటని ప్రశ్నించింది. పరిహారం అందించడం ద్వారా మాత్రమే కాకుండా, జీవనోపాధికి ఒక మార్గం చూపడం కూడా ప్రభుత్వ సహాయక చర్యల్లో భాగమే కదా అనే కోణంలో ధర్మాసనం స్పందించింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అలాంటి పరిస్థితుల్లో ఉపాధి కల్పించే చర్యను ఎందుకు తప్పుబట్టాలని పిటిషన్‌దారులను ప్రశ్నించింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలను సవాల్ చేసే విషయంలోనూ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు స‌మాచారం.

35
అసలేం జ‌రిగిందంటే.?

కరూర్ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులకు తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడాన్ని సవాల్ చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసును విచారించిన హైకోర్టు.. ప్రభుత్వ ఉద్యోగాలను ఇలా నేరుగా కేటాయించడం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు రాష్ట్రంలో ఎంతోమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని, నియామక ప్రక్రియలో నిర్దిష్ట నిబంధనలు, రాజ్యాంగపరమైన ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

45
మాట నిలబెట్టుకున్న విజయ్

గత ఏడాది సెప్టెంబరులో కరూర్‌లో జరిగిన విషాద ఘటన తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విష‌యం తెలిసిందే. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం నిర్వహించిన కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చిన సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయ్.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం ఆ హామీని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టింది. జులై 10న కరూర్‌లో పర్యటించిన విజయ్.. అర్హత ఉన్న బాధిత కుటుంబ సభ్యులకు స్వయంగా నియామక పత్రాలు అందజేశారు.

55
సుప్రీం తీర్పుపైనే ఇప్పుడు అందరి దృష్టి

హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడంతో బాధిత కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాల విషయంలో ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఉపశమనం లభించినట్లయింది. అయితే ఈ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది. బాధిత కుటుంబాల పునరావాసం, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాల చట్టబద్ధత, రాజ్యాంగ నిబంధనలు వంటి అంశాలపై తదుపరి విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో కరూర్ ఘటన బాధితులకు ఇచ్చిన ఉద్యోగాల వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు కీలకంగా మారనుంది.

Read more Photos on
click me!

Recommended Stories