పర్యాటకానికి గట్టి దెబ్బ
పహల్గాం లోయలో జరిగిన ఉగ్రదాడి లోయలో పరిస్థితులు చాలావరకు సాధారణ స్థితికి చేరుకున్న సమయంలో జరిగింది. కశ్మీర్‌లో పర్యాటకం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోంది. కశ్మీర్ లోయలో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. అక్కడి అన్ని హోటళ్ళు, లాడ్జీలు, పర్యాటక ప్రదేశాలు కళకళలాడుతున్నాయి. అయితే, ఈ ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ లోయల్లో మళ్ళీ నిశ్శబ్దం ఆవరించే పరిస్థితేలు కనిపించనున్నాయి.
రికార్డు సంఖ్యలో పర్యాటకులు
జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ ప్రకారం, 2021లో 1.13 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. 2022లో ఈ సంఖ్య 1.88 కోట్లకు పెరిగింది. 2023లో 2.11 కోట్లకు చేరుకుంది. 2024లో జమ్మూ కాశ్మీర్‌కు రికార్డు స్థాయిలో 2.36 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు, వీరిలో 27 లక్షల మంది కేవలం కశ్మీర్‌ను సందర్శించడానికి వచ్చారు.
లక్షలాది కుటుంబాలు రోడ్డుపాలు
కశ్మీర్ లోయలో లక్షలాది కుటుంబాలు పర్యాటకం నుండి వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉన్నాయి. వారు షికారా నడిపేవారు, హోటళ్ళు, రెస్టారెంట్లు, గుర్రాల వ్యాపారులు, హస్తకళల వస్తువులు అమ్మేవారు కావచ్చు. కానీ ఇప్పుడు పర్యాటకుల సంఖ్య తగ్గడం వల్ల వారి వ్యాపారాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. పహల్గాం ఉగ్రదాడి కశ్మీరీలకు తీవ్ర నష్టం కలిగించనుంది.
ప్రభుత్వ లక్ష్యానికి గండి
2025 నాటికి జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రదేశంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కోసం ప్రతి సంవత్సరం 2000 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కశ్మీర్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం, కుంకుమపువ్వు పర్యాటకం, వారసత్వ, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించారు. కానీ కశ్మీర్‌లో జరిగిన ఈ ఉగ్రదాడి తర్వాత వీటన్నింటిపైనా ప్రభావం పడుతుంది.
రైతులపై ప్రభావం
లోయలో పర్యాటకం తగ్గడంతో పాటు పండ్ల వ్యాపారంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల కుప్వారా, బండిపోరా, బారాముల్లా, బడ్గాం వంటి జిల్లాలలోని వేలాది మంది రైతులు, కూలీల జీవనోపాధి దెబ్బతింటుంది. హిందూ యాత్రికులే లక్ష్యంగా తీవ్ర వాదులు ఒడిగట్టిన ఒక్క దుశ్చర్యం మొత్తం కశ్మీర్ ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేయనుంది అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.