Vehicle Horns : శబ్ద కాలుష్యాన్ని అరికట్టడానికి, రోడ్డు అనుభవాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దేశవ్యాప్తంగా వాహనాల హారన్స్ మార్పుకు సంబంధించి కొత్త చట్టాన్ని ప్రతిపాదించారు. కొత్త నిబంధన ప్రకారం సాధారణ కఠిన, బిగ్గర హారన్ శబ్దాలకు బదులుగా సంగీత వాయిద్యాల ధ్వనులను ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఇకపై వాహనాలకు హారన్ గా శ్రావ్యమైన ఫ్లూట్, తబలా, హార్మోనియం మరియు వయోలిన్ వంటి సాంప్రదాయ భారతీయ సంగీత వాయిద్యాల ధ్వనులను పెట్టుకోవచ్చు. తద్వారా భారతీయ రోడ్లపై వినిపించే కర్ణకఠోరమైన పాం.. పాం అనే శబ్దాలు తగ్గి నగరాలు, పట్టణాలకు మరింత ప్రశాంతంగా మారతాయి. ఇలా మన సంస్కృతిని కూడా ప్రదర్శించవచ్చనేదే హారన్స్ మార్పు వెనకున్న ఆలోచనగా గడ్కరీ పేర్కొన్నారు.
ప్రస్తుత ట్రాఫిక్ కారణంగా పట్టణ ప్రాంతాల్లో శబ్దకాలుష్యం విపరీతంగా పెరుగుతోందని గడ్కరీ పేర్కొన్నారు. ఇలా కఠువుగా ఉండే హారన్‌లను వాయిద్య ఆధారిత శబ్దాలతో భర్తీ చేయడం వల్ల సోనిక్ ప్రభావాన్ని మృదువుగా చేయడమే కాకుండా భారతదేశ సంగీత వారసత్వాన్ని వినూత్నంగా పునరుజ్జీవింపజేస్తుందని మంత్రి విశ్వసిస్తున్నారు. ట్రాఫిక్ జామ్‌లు లేదా ప్రయాణాల సమయంలో హారన్ మోగించడం ద్వారా చిరాకు కలగడానికి బదులుగా ఆహ్లాదం కలుగుతుంది. ఈ శబ్దాలను వినడం వల్ల కలిగే భావోద్వేగాలు, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా గడ్కరి హైలైట్ చేశారు.