UPSC Topper Shakti Dubey
UPSC Topper Shakti Dubey : పేరు చివర IAS, IPS అని ఉండాలనేది చాలామంది కోరిక. ఇందుకోసమే ఏటా లక్షలాదిమంది యువతీయువకులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే సివిల్ సర్విసెస్ పరీక్షలు రాస్తుంటారు... అయితే కేవలం వెయ్యిమంది మాత్రమే తమ కలను నిజం చేసుకుంటారు. అంటే లక్షలాదిమందిలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ అన్నింటిని దాటుకుని వచ్చి ఏటా సివిల్ సర్వెంట్ గా మారేది కేవలం వెయ్యిమంది మాత్రమే. దీన్నిబట్టే సివిల్ సర్విసెస్ లో ర్యాంక్ సాధించడం ఎంత కష్టతరమో అర్థమవుతోంది.
అయితే లక్షలాదిమందిని వెనక్కినెట్టి ఈసారి సివిల్స్ లో టాప్ లో నిలిచింది ఆడబిడ్డ శక్తి దూబే. ఆమెకు ఈ విజయం ఊరికే రాలేదు... ఏడేళ్ళ కష్టానికి ప్రతిఫలం ఈ టాప్ ర్యాంకు. ఇలా దేశంలోనే అత్యంత కఠినమైన సివిల్స్ ను క్లియర్ చేసి ఆలిండియా స్థాయిలో మొదటిర్యాంక్ సాధించిన శక్తి దూబే నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు. ఆమె ఇంతటి అద్భుత విజయం వెనక ఆకట్టుకునే ప్రస్తానం ఉంది... దాని గురించి తెలుసుకుందాం.
Shakti Dubey
సివిల్స్ టాపర్ శక్తి దూబే సక్సెస్ స్టోరీ :
యూపిఎస్సి సివిల్ సర్విసెస్ ఎగ్జామినేషన్ 2024 తుది ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22న) విడులయ్యాయి. ఇందులో మొత్తం 1,009 మంది సివిల్ సర్వెంట్స్ గా ఎంపికయ్యారు. ప్రిలిమినరీ, మెయిన్స్ తర్వాత 2,845 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచారు... వీరిలో వెయ్యిమందినే యూపిఎస్సి ఎంపికచేయింది. ఇందులో ఉత్తర ప్రదేశ్ కు చెందిన శక్తి దూబే ఆలిండియా టాపర్ గా నిలిచారు.
ప్రయాగరాజ్ ప్రాంతానికి చెందిన ఈమెకు యూపిఎస్సి ర్యాంక్ అంత ఈజీగా రాలేదు. దాదాపు ఎనిమిదేళ్లపాటు రాత్రనకా, పగలనకా కష్టపడి చదివితే ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. తన కలను సాకారం చేసుకునేందుకు ఆమె చాలా ఓపికగా ఎదురుచూసారు... పట్టుదలతో అనుకున్నది సాధించారు.
ప్రాథమిక విద్యాభ్యాసం ప్రయాగరాజ్ లోనే పూర్తిచేసారు శక్తి దూబే. ఉన్నత విద్యాభ్యాసం మాత్రం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేసారు. ఎంఎస్సి బయో కెమెస్ట్రీ పూర్తిచేసిన ఆమెకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కానీ సివిల్ సర్వెంట్ మారి దేశానికి సేవ చేయాలనుకుని యూపిఎస్సి ప్రిపరేషన్ ప్రారంభించారు.
ఓవైపు యూపిఎస్సికి ప్రిపేర్ అవుతూనే మరోవైపు టీచింగ్ కొనసాగించారు. ఇలా తన లక్ష్యాన్ని చేరుకునేందుకే టీచింగ్ ను ఉపయోగించుకున్నారు... ఇలా వివిధ సబ్జెక్ట్స్ పై మరింత పట్టు సాధించారు శక్తి దూబే. కొంతకాలం తర్వాత టీచింగ్ ను వదిలేసి యూపిఎస్సి పై పూర్తి దృష్టి పెట్టారు.
Shakti Dubey
2018 లో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభం...
బనారస్ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాక శక్తి దూబే సివిల్స్ వైపు అడుగులు వేసారు. 2018 లో ఆమె ప్రిపరేషన్ ప్రారంభించారు. అయితే ప్రారంభంలో కాస్త ఇబ్బందిపడినా తర్వాత మరింత పట్టుదలగా చదవడం ప్రారంభించారు. ఒకటి రెండు కాదు ఏకంగా ఏడెనిమిదేళ్లు తన కాలను సాకారం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా పోరాడారు. దీని ఫలితమే ఆమెకు ఆలిండియా టాప్ ర్యాక్.
శక్తి దూబే పొలిటికల్ సైన్స్ ఆండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ సబ్జెక్ట్ ను సివిల్స్ లో ఆప్షనల్ గా ఎంచుకున్నారు. సామాజిక అంశాలపై అమెకు పట్టు ఉండటంతో పరీక్ష, ఇంటర్వ్యూలో ఉపయోగపడ్డాయి. ఇలా ఆమె కష్టంతో పాటు అనేక అంశాలు ఈ ఆడబిడ్డకు తోడుగా నిలిచాయి... దీంతో సివిల్స్ లో ఆలిండియా ర్యాంక్ సాధించారు.
UPSC 2024 Results
టాప్ 10 సివిల్స్ ర్యాంకర్స్ వీరే :
యూపిఎస్సి నిర్వహించిన సివిల్ సర్విసెస్ ఎగ్జామ్ 2024 లో శక్తి దూబే ఆలిండియా 1 ర్యాంకు సాధించారు. ఆమె తర్వాత సెకండ్ ర్యాంక్ కూడా మరో ఆడబిడ్డదే... హర్షిత గోయెల్ AIR 2 ర్యాంక్ సాధించారు. ఇక డోంగ్రే అర్చిత్ పరాగ్, షా మార్గి చిరాగ్, ఆకాశ్ గార్గ్, కోమల్ పూనియా, ఆయుషి బన్సల్, రాజ్ కృష్ణ ఝా, ఆదిత్య విక్రమ్ అగర్వాల్, మయాంక్ త్రిపాఠి టాప్ 10 లో చోటు దక్కించుకున్నారు.
తెలుగువారి విషయానికి వస్తే టాప్ 10 లో ఎవరికీ చోటు దక్కలేదు. సాయిశివాని ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించింది. అలాగే బన్నా వెంకటేశ్ 15, అభిషేక్ శర్మ 38వ ర్యాంకు సాధించారు. రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్ కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ 68, ,చేతన్ రెడ్డి 110, శివగణేష్ రెడ్డి 119 ర్యాంకు సాధించారు.