Maoist: దేశంలో మావోయిస్టులను నిర్మూలించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నో ఏళ్లుగా సాయుధ పోరాటం కొనసాగించిన మావోయిస్టు పార్టీ ఇప్పుడు కొత్త దిశలో అడుగులు వేస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపులకు, ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రుల అభ్యర్థనలకు స్పందిస్తూ చివరికి పార్టీ తమ ఆయుధాలను వదిలి శాంతి మార్గంలో నడవాలని నిర్ణయం తీసుకుంది.
25
పార్టీ తరఫున లేఖ – శాంతి చర్చలకు సిద్ధం
పార్టీ ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన లేఖలో ఈ కీలక నిర్ణయం స్పష్టం చేశారు. ఇకపై తుపాకీతో పోరాటం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ మార్గాలను ఆశ్రయిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం లేదా హోంశాఖ నియమించే ప్రతినిధులతో చర్చలకు సిద్ధమని కూడా తెలిపారు.
35
ఒక నెల గడువు – కాల్పుల విరమణ విజ్ఞప్తి
దేశవ్యాప్తంగా ఉన్న తమ సహచరులు, జైళ్లలో ఉన్న సభ్యులతో సంప్రదించడానికి ఒక నెల సమయం కావాలని మావోయిస్టులు కోరారు. ఈ సమయంలో తాత్కాలిక సీజ్‌ఫైర్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమని లేఖలో పేర్కొన్నారు.
పార్టీ సుప్రీం లీడర్ బసవరాజు మృతి తరువాత కొత్తగా తిప్పిరి తిరుపతి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా మొదటిసారిగా మావోయిస్టు నేత ఫొటోతో పాటు అధికారిక లేఖ విడుదల కావడం పెద్ద చర్చనీయాంశమైంది.
55
గతం నుంచి పాఠాలు
మావోయిస్టులు తమ లేఖలో గతంలో జరిగిన సైనిక దాడులు, నాయకుల మరణాలను ప్రస్తావిస్తూ ఇకపై రక్తపాతం కాకుండా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని సంకేతమిచ్చారు. గతంలో నిలిచిపోయిన శాంతి చర్చలను మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఇతర పార్టీలు, సంస్థలతో కలసి పనిచేస్తామని స్పష్టం చేశారు.