
కోట్లాది మంది భారతీయులు ఎన్నో ఏళ్లుగా కంటున్న అత్యాధునిక బుల్లెట్ రైలు కల ఇక ఎంతమాత్రం అందని ద్రాక్ష కాదు. భారతీయ రైల్వే చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయానికి ముహూర్తం ఖరారైంది. దేశ ప్రజలకు అత్యంత వేగవంతమైన, విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఇండియాలో మొట్టమొదటి బుల్లెట్ రైలు 2027, ఆగస్టు 15న అంటే మన 81వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు పట్టాలెక్కనుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. జపాన్‌కు చెందిన ప్రసిద్ధ షింకన్‌సేన్ సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వివరాలు, మన తెలుగు రాష్ట్రాలకు దీనివల్ల కలిగే ప్రయోజనాలు గమనిస్తే..
దేశంలోని ఆర్థిక రాజధాని ముంబై , వాణిజ్య నగరం అహ్మదాబాద్‌లను కలుపుతూ నిర్మిస్తున్న ఈ హై-స్పీడ్ రైల్ కారిడార్ మొత్తం పొడవు 508 కిలోమీటర్లు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి రైలులో 6 నుండి 8 గంటల సమయం పడుతోంది. కానీ, బుల్లెట్ రైలు గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీనివల్ల ప్రయాణ సమయం కేవలం 2 గంటలకు తగ్గిపోనుంది.
తొలి దశలో 2027 ఆగస్టు 15 నాటికి గుజరాత్‌లోని సూరత్ నుండి బిలిమోరా మధ్య తొలి బుల్లెట్ రైలు పరుగులు తీస్తుంది. ఆ తర్వాత వాపి-సూరత్, వాపి-అహ్మదాబాద్ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. చివరగా థానే-ముంబై అనుసంధానంతో ప్రాజెక్టు పూర్తవుతుంది. ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. సూరత్ స్టేషన్‌ను వజ్రాల నగరం ఖ్యాతిని ప్రతిబింబించేలా డైమండ్ ఆకృతిలో నిర్మిస్తుండటం విశేషం.
ఈ ప్రాజెక్టు కేవలం రైలు నడపడమే కాదు, సివిల్ ఇంజనీరింగ్ పరంగా ఒక అద్భుతమని చెప్పవచ్చు. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) పర్యవేక్షణలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో పశ్చిమ కనుమల గుండా 1.5 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగాన్ని కేవలం 10 నెలల్లో పూర్తి చేశారు. మొత్తం 7 పర్వత సొరంగాలు ఒక్క మహారాష్ట్రలోనే నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో అత్యంత ఆసక్తికరమైన అంశం 21 కిలోమీటర్ల పొడవైన భూగర్భ సొరంగం. ఇందులో 7 కిలోమీటర్ల మేర థానే క్రీక్ వద్ద సముద్రం అడుగున రైలు ప్రయాణిస్తుంది. ఇది ప్రయాణికులకు ఒక వింత అనుభూతిని ఇవ్వనుంది. ఈ రూట్‌లో ఉన్న 24 నదీ వంతెనలలో ఇప్పటికే 20కి పైగా నిర్మాణం పూర్తయింది.
గుజరాత్, మహారాష్ట్రల్లో బుల్లెట్ రైలు శరవేగంగా పూర్తవుతుండటంతో, మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ - బెంగళూరు కారిడార్ రానుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంపై కేంద్రం దృష్టి సారించింది.
దీనికి సంబంధించిన ప్రాథమిక సర్వేలు జరుగుతున్నాయి. ఇది కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ నుండి బెంగళూరుకు కేవలం 2.5 నుండి 3 గంటల్లోనే చేరుకోవచ్చు. భవిష్యత్తులో చెన్నై, విజయవాడ, విశాఖపట్నం నగరాలను కలుపుతూ హైస్పీడ్ కారిడార్ నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి.
అయితే, ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్టు పూర్తి విజయం సాధించిన తర్వాతే, 2030 నాటికి మన దగ్గర పనులు మొదలయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి హైదరాబాద్, అమరావతి ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో రావచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణ సౌలభ్యం కోసమే కాదు, దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. ఈ నిర్మాణ పనుల ద్వారా ఇప్పటికే దాదాపు లక్ష మందికి పైగా ఉపాధి లభిస్తోంది. రైలు అందుబాటులోకి వచ్చాక పర్యాటకం, వ్యాపార రంగాలు విస్తరించి మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. రోడ్డు, విమాన ప్రయాణాలతో పోలిస్తే, బుల్లెట్ రైలు వల్ల కర్బన ఉద్గారాలు భారీగా తగ్గుతాయి. ఇది పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని కూడా పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
బుల్లెట్ రైలు మన దాకా రావడానికి సమయం పడుతుంది కాబట్టి, ఈలోగా ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్రం వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెడుతోంది. విమాన తరహా సౌకర్యాలతో, రాత్రిపూట ప్రయాణాలకు అనుకూలంగా ఉండే ఈ రైళ్లు త్వరలోనే సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల నుండి పరుగులు తీయనున్నాయి.
ఇవి బుల్లెట్ రైలుకు ప్రత్యామ్నాయంగా, సామాన్యుడికి అందుబాటులో ఉండే విలాసవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. మొత్తానికి, 2027 ఆగస్టు 15న భారత్ రవాణా రంగంలో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోంది. ఆ వేగాన్ని, సౌకర్యాన్ని మన తెలుగు నేలపైన కూడా త్వరలోనే చూడవచ్చు.