
అంతరిక్షం, ఒకప్పుడు శాస్త్రీయ అన్వేషణలు, ప్రయోగాలకు మాత్రమే పరిమితమైనదిగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆధునిక యుద్ధంలో అంతిమ క్షేత్రంగా మారింది. ఈ మాటలు కేవలం డ్రామా కోసం చెప్పినవి కావు. చైనా అంతరిక్ష సైనికీకరణలో సాధిస్తున్న అద్భుతమైన పురోగతికి భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద రక్షణ సవాలును ఇవి స్పష్టం చేస్తున్నాయి.
"అంతరిక్షం అనేది అంతిమ వ్యూహాత్మక స్థలం. దానిని రక్షించుకోకపోతే, మిగతా బలాలు అన్ని నిర్వీర్యం అవుతాయి" అని ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చెప్పిన మాటలు కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు.. ఇది భారత రక్షణ వ్యవస్థ ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాలుకు సూచనగా కూడా చూడవచ్చు.
చైనా గత పదేళ్లలో అంతరిక్షంలో కూడా గ్రేట్ వాల్ ను నిర్మించింది. అంటే ఈ దశాబ్ద కాలంలో భారీ స్థాయిలో అంతరిక్షంలో మిలిటరీ శక్తిని నిర్మించుకుంది. అదేలా అనుకుంటున్నారా? 2010లో కేవలం 36 శాటిలైట్‌లతో ప్రారంభమైన చైనా ప్రయాణం, ఇప్పుడు 1,000కి పైగా శాటిలైట్‌లకు చేరింది. వీటిలో 500కి పైగా శాటిలైట్‌లు ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, రీకనిసెన్స్ (ISR), ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో కూడి ఉన్నాయి.
చైనా యావోగన్, జియెస్ఎస్ (TJS), గాఓఫెన్ వంటి శాటిలైట్‌ల ద్వారా హై-రిసల్యూషన్ కెమెరాలు, సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR), ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో అంతరిక్షం నుంచి అద్భుతమైన నిఘా సామర్థ్యం సాధించింది.
ఇది ఇక్కడితో ఆగలేదు. చైనా తన మిలిటరీని పునర్నిర్మించి PLA ఏరోస్పేస్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇది ‘సాఫ్ట్ కిల్’ (సైబర్ యుద్ధం)తో పాటు ‘హార్డ్ కిల్’ (అంతరిక్ష క్షిపణులు, కో-ఆర్బిటల్ ఉపగ్రహాలు) పద్ధతులతో కూడిన ఒక సమగ్ర ‘కిల్ మెష్’ వ్యవస్థను రూపొందించింది. ఈ వ్యవస్థ ఉపగ్రహాలనుండి భూమి, నౌకా దళం, వైమానిక దళానికి నేరుగా సమాచారాన్ని చేర్చగలదు.
అంటే, చైనా ఇప్పుడు అంతరిక్షం నుండి భూమిపై జరిగే ప్రతి కదలికను పర్యవేక్షించడమే కాకుండా, శత్రు ఉపగ్రహాలను, ఇతర వ్యవస్థలను ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
2025 మేలో భారత్ పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించింది. ఈ సైనిక చర్యలో ఒక స్పష్టమైన లోపం బయటపడింది. అదే ఉపగ్రహాల ద్వారా తక్షణ సమాచారాన్ని సేకరించడంలో జాప్యం జరిగింది. దీనివల్ల నిఖార్సైన ఇంటెలిజెన్స్‌లో గ్యాప్ ఏర్పడింది.
ఇంకా తీవ్రమైన విషయం ఏంటంటే, ఆపరేషన్ అనంతరం పాకిస్తాన్ రక్షణ మంత్రి వెల్లడించిన ప్రకారం, చైనా ఆ సమయంలో పాక్‌కు ఉపగ్రహ సమాచారాన్ని అందించిందట. ఇది చైనా-పాక్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిరూపించగలిగింది. ఈ సంఘటన, అంతరిక్ష నిఘా వ్యవస్థ ఆవశ్యకతను భారతదేశానికి మరింత స్పష్టంగా తెలియజేసింది.
చైనా అంతరిక్ష ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం గట్టి సమాధానమే ఇస్తోంది. అదే స్పేస్-బేస్డ్ సర్వైలెన్స్ ఫేజ్-3 (SBS-3) ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ కింద భారత్ 2029 నాటికి 52 రక్షణ శాటిలైట్‌లను ప్రయోగించనుంది. మొదటి శాటిలైట్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి నింగిలోకి పంపే ప్రణాళిక ఉంది.
ఈ శాటిలైట్‌లలో LEO (లో ఎర్త్ ఆర్బిట్), GEO (జియో స్టేషనరీ ఆర్బిట్) శాటిలైట్‌లు ఉంటాయి. ఈ ఉపగ్రహాలు ఏఐ శక్తితో పగలు-రాత్రి తేడా లేకుండా, అన్ని వాతావరణ పరిస్థితులలో నిఘాను అందిస్తాయి. వీటి ప్రత్యేకతలు గమనిస్తే..
• SAR ద్వారా రాత్రి పగలు, వర్షం, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణంలోనూ స్పష్టమైన రియల్ టైమ్ చిత్రాలను అందిస్తాయి.
• థర్మల్ ఇమేజింగ్ ద్వారా మానవ కదలికలను గుర్తిస్తాయి. మరీ ముఖ్యంగా సైనిక చర్యలను వెంటనే గుర్తించే సామర్థ్యం ఉంటుంది.
• శాటిలైట్‌ల మధ్య స్వతంత్రంగా సమాచార మార్పిడి కూడా ఉంటుంది. అంటే ఒక శాటిలైట్ సందేహాస్పద కదలికను గమనిస్తే, మరో శాటిలైట్‌కి ఆ ప్రాంతాన్ని ఫోకస్ చేయమని సూచనలు చేస్తుంది.
దీని ద్వారా భారత దళాలకు రియల్ టైమ్ గూఢచార సమాచారం, భారీ మొత్తంలో డేటాను డౌన్‌లోడ్ చేసి, ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండా, తక్షణమే చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుంది. ఇది నిర్ణయం తీసుకోవడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
SBS-3 కార్యక్రమం కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది భారతదేశ విస్తృత వ్యూహాత్మక రక్షణ పుష్‌లో భాగంగా ఉంది. అందుకే SBS-3 ప్రోగ్రామ్‌కు 2023లో కేంద్రం ఆమోదం తెలిపింది. దీని కోసం సుమారు రూ.27,000 కోట్లు కేటాయించారు. ఇది భారత రక్షణ రంగం పెద్ద ఎత్తున అంతరిక్షాన్ని ఉపయోగించాలన్న దిశలో ముందడుగుగా చెప్పవచ్చు.
2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్ రక్షణ బడ్జెట్ రూ.6.8 లక్షల కోట్లను దాటి రికార్డు స్థాయికి చేరింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది రూ.7 లక్షల కోట్లను దాటి మరింత పెరిగే అవకాశం ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
2047 నాటికి రక్షణ ఖర్చులు ఐదింతలు పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుదలలో ఎక్కువగా అంతరిక్ష ఆధారిత నిఘా వ్యవస్థలపై పెట్టుబడుల రూపంలో ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ కొత్త ఉపగ్రహ వ్యవస్థ భారత సరిహద్దులతో పాటు, హిందూ మహాసముద్ర ప్రాంతంపై కూడా నిఘా ఉంచడానికి లక్ష్యంగా పెట్టుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మొత్తంగా చైనా అంతరిక్షాన్ని మరింతగా ఉపయోగించుకుంటూ సైనిక వ్యవస్థను మరింత బలంగా మార్చుకునే పనులను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే భారత్ SBS-3తో సమర్థవంతమైన, తన స్వతంత్ర అంతరిక్ష రక్షణ వ్యవస్థను నిర్మించుకుంటోంది. భూమిపై కాకుండా, భవిష్యత్తులో యుద్ధాలు ఆకాశంలో జరగనున్న నేపథ్యంలో ఇది ఒక వ్యూహాత్మక చర్యగా భావించవచ్చు.