
PM Narendra Modi Ghana Visit: భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా మొదటగా ఘనా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఘనా అధ్యక్షుడు, ఆయన భార్య, ఉపాధ్యక్షుడు, స్పీకర్ లకు భారత సంప్రదాయ కళలకు ప్రతీకలైన విలక్షణమైన బహుమతులు అందజేశారు. ఈ బహుమతులు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నిపుణుల చేత తయారైన ప్రత్యేక కళాఖండాలు కావడం విశేషం.
ప్రధాని మోడీ ఘనా అధ్యక్షుడు జాన్ మహామాకు బిద్రి కళాఖండంతో అలంకరించిన ఫూల్ వాస్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ కళాఖండం కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందినదిగా పేర్కొన్నారు. బిద్రి వర్క్ అనేది జింక్-కాపర్ మిశ్రమం పై వెండి తో ప్రత్యేక డిజైన్ చేయడంతో బిద్రి కళాఖండాలను తయారు చేస్తారు. దీని నల్లని మెరుగు, చక్కటి వెండి డిజైన్లు దీనిని ప్రత్యేకతగా ఉంచుతాయి.
ఈ వాసును శతాబ్దాలుగా వాడుతున్న పద్ధతుల ద్వారా చేతి పనితో తయారు చేశారు. బహుమతిగా ఇచ్చిన వాసుపై సంపదను సూచించే పుష్ప ఆకృతులు చెక్కారు. ఇది భారతీయ లోహ కళల సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది.
ఘనా అధ్యక్షుడి భార్య లార్డిన మహామకు ప్రధాని మోడీ ఒక అద్భుతమైన వెండి ఫిలిగ్రీ పనితో తయారైన హస్తకళారూపమైన పర్సు అందించారు. ఇది ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరానికి చెందిన ప్రముఖ ‘తారకాషీ’ కళారూపం. ఈ కళా రూపం 500 సంవత్సరాల పైగా చరిత్ర కలిగి ఉంది. దీనిలో సూక్ష్మమైన వెండి తీగలతో పుష్పాలు, వక్కలు వంటి డిజైన్‌లు వేయడం ఉంటుంది.
ఈ పర్సును నైపుణ్యం గల కళాకారులు పూర్తిగా చేతితో తయారు చేశారు. సంప్రదాయంగా ఆభరణాల తయారీలో ఉపయోగించే కటక్ ఫిలిగ్రీకి ఇప్పటి ఆధునిక వస్తువులైన అందమైన పర్సులు కూడా పోటీనివ్వలేవని చెప్పొచ్చు. ఇది భారతీయ సంప్రదాయాన్ని ఆధునికతతో మిళితం చేసిన ఒక అద్భుతమైన కళకు ఉదాహరణ.
ఘనా ఉపాధ్యక్షులు జేన్ నానా ఒపోకు-అగ్యేమాంగ్ కు ప్రధాని మోడీ కాశ్మీరీ పశ్మీనా షాల్‌ను బహుమతిగా అందించారు. ఈ షాల్ లద్దాఖ్ ప్రాంతంలోని చాంగ్‌థాంగ్ లో నివసించే చంగ్థంగి జాతికి చెందిన మేకల నుండి వచ్చే మృదువైన అండర్‌కోట్‌తో తయారు చేశారు.
ఈ షాల్‌లు అసాధారణమైన మృదుత్వం, వేడిని నిలుపుకోవడం, తేలికపాటుతనం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందాయి. ఇవి కాశ్మీరి కళాకారులు తయారు చేశారు. ఈ షాల్‌లు ప్రామాణికమైన గొప్ప భారతీయ చేతి పనికి గుర్తింపుగా ఉన్నాయి.
ఘనా స్పీకర్‌కు ప్రధానమంత్రి మోడీ లఘు హస్తి అంబారీ బహుమతిగా ఇచ్చారు. దీనిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కళాకారులు తయారు చేశారు. ఈ అంబారీ చిన్న మోడల్ రూపంలో ఉండి, రాచరిక సంప్రదాయానికి గుర్తుగా నిలుస్తుంది.
ఇది పాలిష్ చేసిన సింథటిక్ దంతంతో తయారు చేశారు. ఇది సహజ దంతానికి నైతికంగా, పర్యావరణ పరంగా ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఈ కళాఖండం భారతీయ రాజకీయం, సంప్రదాయాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ బహుమతుల ద్వారా ప్రధాని మోడీ భారతీయ కళల వైశిష్ట్యాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి చూపించారు. ప్రతి బహుమతిలోను భారత సంప్రదాయ నైపుణ్యం, సాంకేతికత, సాంస్కృతిక విలువలు ప్రతిబింబించాయి. ఈ కానుకలు ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త మలుపు తేనున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.