EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)లో చేరేందుకు ప్రస్తుతం ఉన్న వేతన పరిమితిని పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
పీఎఫ్ వేతన పరిమితిలో మార్పు వచ్చి దాదాపు 12 సంవత్సరాలు అవుతోంది. 2014కు ముందు నెలకు రూ.6,500 వరకు ఉన్న వేతన పరిమితిని అప్పట్లో రూ.15 వేలకు పెంచారు. అప్పటి నుంచి అదే పరిమితి కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో ఉద్యోగుల వేతనాలు, జీవన వ్యయాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో పీఎఫ్ పరిమితిని కూడా సవరించాలనే డిమాండ్లు వినిపించాయి. ఉద్యోగ సంఘాలు కూడా ఈ అంశాన్ని పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. తాజాగా రూ.15 వేల పరిమితిని రూ.25 వేలకు పెంచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం లభించడంతో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మార్పుకు మార్గం సుగమమైంది.
24
51 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం
వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచడం వల్ల అదనంగా సుమారు 51 లక్షల మంది ఉద్యోగులు పీఎఫ్ ప్రయోజనాల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పు ద్వారా ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న, ఇప్పటివరకు పీఎఫ్ సామాజిక భద్రతకు పూర్తిస్థాయిలో అందుబాటులో లేని ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకం అమలుకు రూ.11,339 కోట్లను కేటాయించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. పీఎఫ్ అనేది ఉద్యోగి భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే దీర్ఘకాలిక పొదుపు సాధనం కావడంతో, మరింత మంది కార్మికులు ఈ వ్యవస్థలోకి రావడం ద్వారా వారి సామాజిక భద్రత పరిధి విస్తరించనుంది.
34
ఉద్యోగులకు అసలు లాభం ఏంటి?
వేతన పరిమితి పెరగడం వల్ల ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో ప్రతి నెల జమ అయ్యే మొత్తం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రూ.15 వేల పరిమితిని ప్రాతిపదికగా తీసుకుంటే ఉద్యోగి వాటా 12 శాతం గరిష్ఠంగా రూ.1,800 వరకు ఉంటుంది. కొత్త పరిమితి రూ.25 వేలకు అమల్లోకి వస్తే, అదే 12 శాతం లెక్కన ఉద్యోగి వాటా గరిష్ఠంగా రూ.3,000 వరకు ఉండొచ్చు. అంటే ప్రతి నెల పీఎఫ్ ఖాతాలో ఎక్కువ మొత్తంలో పొదుపు అవుతుంది. దీర్ఘకాలంలో ఈ మొత్తంపై వడ్డీతో పాటు పదవీ విరమణ సమయంలో ఉద్యోగికి పెద్ద మొత్తంలో నిధి సమకూరే అవకాశం ఉంటుంది. పీఎఫ్‌తో అనుసంధానమైన ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలు కూడా అర్హత నిబంధనలకు లోబడి మరింత మంది ఉద్యోగులకు అందుబాటులోకి రావచ్చు.
పీఎఫ్ పరిమితి పెంపుతో ఉద్యోగుల నెలవారీ చందా మాత్రమే కాకుండా యాజమాన్యాల వాటాపైనా ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిమితికి అనుగుణంగా ఉద్యోగి, సంస్థ తరఫున చెల్లించే పీఎఫ్ మొత్తాలు లెక్కిస్తారు. కొత్త పరిమితి అమల్లోకి వచ్చిన తర్వాత వర్తించే నిబంధనల ప్రకారం కంపెనీలు కూడా అధిక మొత్తాన్ని చెల్లించాల్సి రావచ్చు. దీంతో ఉద్యోగి భవిష్యత్ పొదుపు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, సంస్థలపై అదనపు ఆర్థిక బాధ్యత ఏర్పడుతుంది.