
దీపావళి పండగ ముందు దేశ రాజధాని ప్రజలకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. దిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో హరిత బాణసంచా విక్రయం, కాల్చడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ అనుమతికి పలు షరతులు కూడా విధించింది. పర్యావరణం పరిరక్షణ, ప్రజారోగ్యం, సంప్రదాయాల మధ్య సమతుల్యత ఉండేలా తీర్పు ఇచ్చామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం పేర్కొంది.
కోర్టు తీర్పులో జీవించే హక్కు, వృత్తి స్వేచ్ఛ, మతపరమైన ఆచారాల సమన్వయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రజల ఆనందం, వాణిజ్య హక్కులు, పర్యావరణ పరిరక్షణ – ఈ మూడు మధ్య సమతుల్యత ఉండేలా తీర్పు ఇచ్చిందని ధర్మాసనం పేర్కొంది. గతంలో వాయు కాలుష్యం పెరగడంతో బాణసంచా విక్రయాలు, కాల్చడంపై పూర్తిగా నిషేధం విధించగా, ఈసారి పండుగ సందర్భాన సడలింపు ఇచ్చింది.
సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం.. అక్టోబర్ 18 నుంచి 21 వరకు మాత్రమే హరిత బాణసంచా విక్రయాలు జరగాలి. బాణసంచా కాల్చడానికి దీపావళి ముందు రోజు, పండగ నాడు పరిమిత సమయాలు నిర్ధారించారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల లోపు మాత్రమే బాణసంచా కాల్చడానికి అనుమతి ఇచ్చారు.
బాణసంచా అమ్మకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్ లేదా ఇ-కామర్స్ ద్వారా జరగకూడదని కోర్టు స్పష్టం చేసింది. కేవలం అధికారిక అనుమతితో ఉన్న స్థానిక విక్రేతలు మాత్రమే హరిత బాణసంచాను విక్రయించాలని తీర్పునిచ్చారు. ఈ అనుమతి పూర్తిగా తాత్కాలికం, ఈ దీపావళి పండుగకే పరిమితమని స్పష్టం చేసింది.
దీపావళి పండుగ వెలుగుల పండుగ మాత్రమే కాదు, శబ్దాల పండుగగా కూడా మారిపోయింది. కానీ ఈ ఆనందం వెనుక ఉన్న వాస్తవం పర్యావరణానికి పెద్ద ముప్పు. ప్రతి ఏడాది దీపావళి రాత్రి ఆకాశం రంగుల కాంతులతో మెరవగా, మరుసటి రోజుకే నగరాలు పొగతో కప్పుకుపోతాయి.
పటాకులు వెలిగించినప్పుడు సల్ఫర్, నైట్రేట్‌లు, లోహపు కణాలు గాలిలో కలుస్తాయి. ఇవి శ్వాసకోశ సమస్యలు, కంటి చికాకులు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. గాలి నాణ్యత సూచిక (AQI) తీవ్రంగా పడిపోతుంది. దీపావళి శీతాకాలానికి దగ్గరగా రావడం వల్ల వాతావరణంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. దీంతో పటాకుల పొగ గాలిలో ఎక్కువసేపు నిలిచి, పొగమంచు, పొగ కలిపి మరింత కాలుష్యానికి దారితీస్తాయి.
బాణసంచా తయారీలో యాంటిమోనీ సల్ఫైడ్, బేరియం నైట్రేట్, లిథియం, రాగి, స్ట్రోంటియం వంటి లోహాలు ఉపయోగిస్తారు. ఇవి మండినప్పుడు విషపూరిత వాయువులను విడుదల చేస్తాయి. ఈ వాయువులు కేవలం గాలినే కాదు, నేలపై, నీటిలోనూ కాలుష్యాన్ని పెంచుతాయి. పటాకుల నుంచి వచ్చే సూక్ష్మ కణాలు (PM 2.5, PM 10) ఊపిరితిత్తుల్లో చేరి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.
ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో దీపావళి సమయంలో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా పెరుగుతాయి. వాతావరణ శాఖలు, వైద్య నిపుణులు ప్రతీ ఏడాది హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, పటాకుల వినియోగం తగ్గడం లేదు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ కాలం అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. పక్షులు, పెంపుడు జంతువులు కూడా శబ్దం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి.
పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసిన “గ్రీన్ క్రాకర్స్” కాలుష్యాన్ని తగ్గించే మార్గంగా నిలుస్తున్నాయి. ఇవి సాధారణ పటాకుల మాదిరిగా హానికరమైన రసాయనాలు ఉండవు. బదులుగా తక్కువ ఉద్గార పదార్థాలను ఉపయోగిస్తాయి. గ్రీన్ క్రాకర్స్ శబ్దం తక్కువగా ఉత్పత్తి చేస్తాయి, పొగ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సాంప్రదాయ పటాకుల కంటే కొంచెం ఖరీదైనప్పటికీ, పర్యావరణం కోసం ఇవి మంచి ఎంపికగా చెప్పొచ్చు.
దీపావళి ఆనందం బాణసంచాలో కాకుండా వెలుగుల్లో ఉంది. తక్కువ శబ్దంతో, తక్కువ పొగతో పండుగ జరుపుకోవడం పర్యావరణానికి రక్షణ. కుటుంబంతో, స్నేహితులతో దీపాలను వెలిగించడం, పూలతో దీపాలను అలంకరించడం ద్వారా పండుగను మరింత ఆహ్లాదకరంగా చేసుకోవచ్చు. గ్రీన్ క్రాకర్స్ వాడటం లేదా పటాకులు పూర్తిగా మానేయడం.. ఇవే భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే నిజమైన బహుమతి, సందేశం కూడా.