ఇప్పటివరకు లొంగిపోయిన తెలుగు మావోయిస్ట్ అగ్రనాయకులు వీరే..
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, అగ్రనేత కిషన్ జీ భార్య పోతుల కల్పన అలియాస్ సుజాతక్క గతనెల సెప్టెంబర్ లో తెలంగాణ పోలీసులకు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. భర్త మరణం తర్వాత దాదాపు దశాబ్దానికి పైనే ఆమె మావోయిస్ట్ ఉద్యమంలో కొనసాగారు.. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె లొంగిపోయారు. సుజాతక్క తెలంగాణలోని గద్వాల ప్రాంతానికి చెందినవారు. ఈమెతో పాటే మరికొందరు మావోయిస్టులు కూడా పోలీసులకు లొంగిపోయారు.
సరిగ్గా నెలరోజుల తర్వాత అక్టోబర్ లో మరో మావోయిస్ట్ అగ్ర నాయకుడు కూడా లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి స్వయంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. ఈయన కూడా తెలంగాణకు చెందినవారే. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈయన మావోయిస్ట్ ఉద్యమంలో ప్రవేశించి అంచెలంచెలుగా టాప్ స్థానానికి చేరుకున్నారు. ఈయన తలపై రూ.6 కోట్ల రివార్డ్ ఉంది.
తాజాగా మరో మావోయిస్ట్ అగ్రనాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న చత్తీస్ ఘడ్ లో లొంగిపోయారు. కాంకేర్ జిల్లా పోలీసులకు సరెండర్ అయిన ఆశన్న రేపు(గురువారం) చత్తీస్ ఘడ్ సీఎం విష్ణుదేవ్ సాయికి ఆయుధాలను అప్పగించనున్నారు. ఆయన జనజీవన స్రవంతిలో కలిసిపోయినట్లు సీఎం ప్రకటించనున్నారు.
ఇలా ఇప్పటివరకు లొంగిపోయిన ముగ్గురు మావోయిస్ట్ పార్టీ కేంద్ర నాయకులు తెలుగువారే. వీరు ఉద్యమాబాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవడం మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ. వీరి బాటలోనే మిగిలిన మావోయిస్టులు నడిచి హింసను వీడాలని... ప్రజాస్వామ్య పాలనకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది.