ధర్మస్థల.. కర్ణాటక పశ్చిమ కనుమల మధ్యలో ఉన్న పవిత్ర ఆలయ ప్రాంతం. మంజునాథేశ్వర స్వామి ఆలయం గల ఈ తీర్థయాత్రా కేంద్రానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచింది. కానీ తాజాగా ఓ సంచలన ఆరోపణ ఈ ప్రాంతాన్ని తీవ్ర కలకలానికి గురిచేసింది. ఇక్కడ వందలాది హత్యలు జరిగాయన్న ఆరోపణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదుతో వెలుగులోకి
1995 నుంచి 2014 వరకు ధర్మస్థల ఆలయంలో శానిటేషన్ ఉద్యోగిగా పనిచేసిన ఓ వ్యక్తి, జులై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. తన సర్వీసు కాలంలో దాదాపు 100-300 మృతదేహాలను ఖననం చేశానని తెలిపాడు.
వీటిలో ఎంతో మంది మైనర్ బాలికలు, యువతులు ఉండేవారని, వారిపై లైంగిక దాడులు, యాసిడ్ దాడులు జరిగాయని స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ శవాలను నేత్రావతి నది ఒడ్డున, ఆలయం పక్కనున్న అడవుల్లో పాతిపెట్టినట్లు, కొన్ని సందర్భాల్లో నదిలో విసిరేశానని వివరించాడు. తన వాదనకు బలంగా కొన్ని ఫోటోలు, ఆధారాల్ని కూడా పోలీసులకు సమర్పించాడు.