
Journey Of Jagdeep Dhankhar: ఒక చిన్న గ్రామంలోని రైతు కుటుంబం నుంచి మొదలైన జగదీప్ ధన్‌ఖడ్ ప్రయాణం... భారత దేశ రెండవ అత్యున్నత పదవికి చేరుకునే వరకు సాగిన అసాధారణ జీవితం ఆయనది.. రాజస్థాన్‌లోని కిథానా అనే చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన ధన్‌ఖడ్.. చదువుల్లో టాప్.. న్యాయ, రాజకీయ రంగాల్లో ప్రావీణ్యంతో దేశ సర్వోన్నత స్థాయికి ఎదిగారు.
సైనిక్ స్కూల్‌లో పూర్తి స్కాలర్‌షిప్, సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వొకేట్‌గా ప్రాముఖ్యత, లోక్‌సభ సభ్యుడిగా ఎంపిక, గవర్నర్‌గా అనుభవం, చివరకు భారత ఉపరాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించడం.. ఇవన్నీ ఒక సాధారణ గ్రామం నుంచి వచ్చిన జగదీప్ ధన్‌ఖడ్ అసాధారణ ప్రయాణాన్ని చెబుతున్నాయి.
జగదీప్ ధన్‌ఖడ్ తాజాగా భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. రాజీనామా లేఖను భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కు ఆయన అందించారు.
జగదీప్ ధన్‌ఖడ్ 1951 మే 18న రాజస్థాన్ రాష్ట్రంలోని జుంఝును జిల్లాలోని కిథానా గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి గోకల్ చంద్ర్, తల్లి కేసరి దేవి. తన ప్రాథమిక విద్యను గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అభ్యసించారు. ఆ తర్వాత గ్రామానికి 4-5 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఘర్ధానా ప్రభుత్వ బడిలో చదువును కొనసాగించారు.
1962లో చిత్తౌర్‌గఢ్ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షను ఉత్తీర్ణులై, పూర్తి మెరిట్ స్కాలర్‌షిప్‌పై అడ్మిషన్ పొందారు. ఆ స్కూల్ నుంచి ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షను పూర్తి చేశారు. జగదీప్ ధన్‌ఖడ్ మహారాజా కాలేజీ, జైపూర్‌లో బీఎస్సీ (ఆనర్స్) ఫిజిక్స్ పూర్తి చేసి, రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి 1978–1979లో ఎల్‌ఎల్‌బీ చేశారు.
జగదీప్ ధన్‌ఖడ్ తన కెరీర్ ను న్యాయవాద వృత్తితో మొదలుపెట్టారు. 1979 నవంబర్ 10న రాజస్థాన్ బార్ కౌన్సిల్‌లో అడ్వొకేట్‌గా నమోదు అయ్యారు. 1990 మార్చి 27న రాజస్థాన్ హైకోర్టు లో సీనియర్ అడ్వొకేట్‌గా గుర్తింపు పొందారు. సుప్రీంకోర్టులో స్టీల్, కోల్, మైనింగ్, అంతర్జాతీయ వాణిజ్య ఆర్బిట్రేషన్ వంటి కేసుల్లో న్యాయవాదిగా గుర్తింపు పొందారు. భారతదేశంలోని అనేక హైకోర్టులలో కీలక కేసులను వాదించారు. 2019 జూలై 30న పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించే వరకు రాష్ట్రంలో అత్యంత అనుభవజ్ఞుడైన సీనియర్ అడ్వొకేట్‌గా ఉన్నారు.
జగదీప్ ధన్‌ఖడ్ జనతాదళ్ పార్టీ తో రాజకీయ జీవితం మొదలుపెట్టారు. 1989లో జుంఝును పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు కేంద్ర సహాయ మంత్రి గా పని చేశారు. 1993-1998 మధ్య అజ్మీర్ జిల్లా కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి రాజస్థాన్ శాసనసభకు ఎన్నికయ్యారు. లోక్‌సభ, శాసనసభ కమిటీలకు సభ్యుడిగా సేవలందించారు. అలాగే, యూరోపియన్ పార్లమెంట్‌కి వెళ్లిన పార్లమెంటరీ బృందానికి జగదీప్ ధన్‌ఖడ్ డిప్యూటీ లీడర్‌గా కూడా ఉన్నారు.
2022 జూలై 18న పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవి నుంచి దిగిన తర్వాత భారత ఉపరాష్ట్రపతిగా నియమితులయ్యారు. సోమవారం (21 జూలై 2025) తన పదవికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతిగా, ఢిల్లీ విశ్వవిద్యాలయం, పంజాబ్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా, మఖన్‌లాల్ చతుర్వేది విశ్వవిద్యాలయానికి విజిటర్‌గా సేవలందిస్తున్నారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (IIPA), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ICWA) వంటి సంస్థలకు అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రసార్ భారతి బోర్డు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఎంపిక కమిటీలకు కూడా అధ్యక్షత వహించారు.
జగదీప్ ధన్‌ఖడ్ 1979లో డాక్టర్ సుదేశ్ ధన్‌ఖడ్ ను వివాహం చేసుకున్నారు. ఆమె వనస్తలి విద్యాపీఠ్ నుండి ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. జగదీప్ ధన్‌ఖడ్ కుమార్తె అయిన కమ్నా.. కార్తికేయ వాజ్‌పేయిని వివాహం చేసుకున్నారు.
జగదీప్ ధన్‌ఖడ్ కు పుస్తకాలు చదవడం, క్రీడలు, సంగీతం అంటే ఇష్టం. రాజస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్, టెన్నిస్ అసోసియేషన్‌కు అధ్యక్షులుగా సేవలందించారు. ఆర్గానిక్ ఫార్మింగ్, బాలల విద్య, సామాజిక అభివృద్ధి వంటి రంగాల్లో భార్య సుదేశ్ ధన్‌ఖడ్ తో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.