అంతా 24 గంటల్లోనే.. ఢిల్లీ పేలుడు - ఫరీదాబాద్‌కు లింక్‌ ఉందా?

Published : Nov 10, 2025, 10:56 PM IST

Delhi Blast Link to Faridabad Terror Module : ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు రేపింది. ఫరీదాబాద్‌లో వెలుగుచూసిన భారీ ఉగ్ర నెట్వర్క్‌తో ఈ ఘటనకు సంబంధం ఉందా? 24 గంటల్లో ఏం జరిగింది? నిఘా సంస్థలు ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి.

PREV
15
ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్ర లింక్ ఉందా?

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో చోటుచేసుకున్న బాంబు పేలుడు దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనలో 13 మందికి పైగా మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సుమారుగా రాత్రి 7 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించగా, చుట్టుపక్కల భవనాలు కంపించాయి. అగ్నిమాపక దళాలు, ఎన్‌ఎస్‌జీ, ఎన్‌ఐఏ, ఫోరెన్సిక్‌ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీతో తాజా పరిణామాలపై సమీక్ష జరిపారు. ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించగా, ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన తనిఖీలు ప్రారంభించారు. హైదరాబాద్ లో కూడా అలర్ట్ ప్రకటించారు. తనిఖీలు కొనసాగుతున్నాయి.

25
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద నేట్ వర్క్ గుర్తింపు

ఈ ఘటనకు రెండు రోజుల ముందే జమ్మూ కశ్మీర్‌ పోలీసులు అంతర్రాష్ట్ర ఉగ్ర నెట్వర్క్‌ను ఛేదించారు. జైష్-ఏ-మొహ్మద్‌, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్‌ వంటి నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు డాక్టర్లు ఉండటం సంచలనం రేపింది. ఈ నెట్వర్క్‌ సభ్యులు విద్యావంతులు, ప్రొఫెషనల్స్‌గా గుర్తించారు. వారు సామాజిక సంస్థల పేరుతో నిధులు సేకరించి ఉగ్ర కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

దర్యాప్తులో భాగంగా శ్రీనగర్‌, ఫరీదాబాద్‌, షోపియాన్‌, గందర్బాల్‌, సహరాన్‌పూర్‌లలో సంయుక్త సోదాలు జరిగాయి. ఫరీదాబాద్‌లో అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ముజమ్మిల్ అహ్మద్ గనై నివాసం నుండి 360 కిలోల అమ్మోనియం నైట్రేట్‌, రైఫిళ్లు స్వాధీనం చేసుకోవడం మరో కీలక మలుపుగా నిలిచింది.

35
ఫరీదాబాద్‌ నుంచి భారీ RDX స్వాధీనం

హర్యానా ఫరీదాబాద్‌లో 300 కిలోల RDX, AK-47 రైఫిల్‌ సీజ్‌ కావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఆపరేషన్‌ను జమ్మూ కశ్మీర్‌ పోలీసులు, హర్యానా పోలీసులతో కలిసి విజయవంతంగా పూర్తి చేశారు. దర్యాప్తు సంస్థలు పేర్కొన్న వివరాల ప్రకారం, అరెస్టయిన డాక్టర్‌ ఆదిల్ అహ్మద్ రాథర్‌ ఇచ్చిన సమాచారంతోనే ఈ ఆయుధాలు రికవరీ చేసినట్లు తేలింది.

ఈ సంఘటన ఫరీదాబాద్‌ – ఢిల్లీ మధ్య ఉగ్ర సంబంధం ఉందా? అనే అనుమానాలకు దారితీసింది. ఎందుకంటే ఫరీదాబాద్‌లో గుర్తించిన పేలుడు పదార్థాలు, ఢిల్లీలో పేలుడు మధ్య సాంకేతిక సారూప్యతలున్నట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.

45
గుజరాత్‌లో మరో ఉగ్ర కుట్ర భగ్నం

ఢిల్లీ పేలుడుకు ఘటనకు ముందు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS) మరో ఉగ్ర మాడ్యూల్‌ను ఛేదించింది. ముగ్గురు అనుమానితులను అరెస్టు చేయగా, వారికి పాకిస్థాన్‌ ఐఎస్‌ఐతో లింక్‌లు ఉన్నట్లు వెల్లడించారు. వారు దేశంలో వివిధ ప్రాంతాల్లో దాడులు చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు దర్యాప్తు అధికారుల నివేదిక చెబుతోంది. హైదరాబాద్‌కు చెందిన మొహియుద్దీన్‌ ఫ్రాన్స్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం అతని ఇంటి నుంచి రెండు గ్లాక్ పిస్టల్స్, 1 బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు.

ఇదే సమయంలో ఢిల్లీలో పేలుడు జరగడంతో దర్యాప్తు సంస్థలు ఈ మూడు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే దిశగా ఆరా తీస్తున్నాయి.

55
దర్యాప్తు దిశగా కొత్త కోణం

దిల్లీ బ్లాస్ట్‌ – ఫరీదాబాద్‌ – జమ్మూ కశ్మీర్‌ ఉగ్ర మాడ్యూల్‌ – గుజరాత్‌ అరెస్టులు… ఈ అన్ని ఘటనలు కొన్ని రోజుల వ్యవధిలో జరగడం యాదృచ్ఛికం కాదని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు ఈ కేసులను సమగ్రంగా పరిశీలిస్తున్నాయి.

భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం, దేశవ్యాప్తంగా ఉగ్ర మాడ్యూల్స్‌ ఒకే నెట్‌వర్క్‌ కింద పనిచేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న ఉగ్ర వర్గాలు ఫరీదాబాద్‌ లేదా కశ్మీర్‌ లింక్‌ కలిగి ఉండవచ్చని కూడా అనుమానిస్తున్నారు.

దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. ప్రధాన నగరాల్లో నిఘా మరింత బలపరిచారు. ఇక ఢిల్లీ బాంబు పేలుడుకు ఫరీదాబాద్‌ ఘటనతో సంబంధం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో దర్యాప్తు ఫలితాల్లో తేలనుంది.

Read more Photos on
click me!

Recommended Stories