మరొక ప్రత్యక్ష సాక్షి పేలుడు తర్వాత కనిపించిన దృశ్యాల గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. “మొదట పేలుడు ప్రాంతం దగ్గరికి వెళ్లి చూశాం. అక్కడ ఒక చేతి భాగం రోడ్డుపై పడిఉంది. అది చూసి పూర్తిగా షాక్ అయ్యాం. వెంటనే SHOకి సమాచారం ఇచ్చాం” అని చెప్పారు.
పేలుడు తీవ్రతకు పరిసర ప్రాంతాల్లోని గోడలు, తలుపులు, కిటికీలు కంపించాయి. భయంతో ప్రజలు రోడ్డుపైకి పరుగులు తీశారు. కొంతమంది పిల్లలు, వృద్ధులు కింద పడిపోయారని సాక్షులు తెలిపారు.
పోలీసు, అగ్నిమాపక సిబ్బంది చర్యలు
పేలుడు చోటుచేసుకున్న వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చి దగ్ధమైన కార్లను పక్కకు తరలించారు. పేలుడు కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, అధికారులు ఫోరెన్సిక్ పరిశోధనలు ప్రారంభించారు.
ఢిల్లీ పోలీసు అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాంతం మొత్తాన్ని సెక్యూరిటీ కార్డన్ చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కూడా పరిశీలనలో పాల్గొంటున్నాయి.
చారిత్రక ప్రదేశం సమీపంలో భద్రతా ఆందోళన
ఈ ఘటనా ప్రాంతం ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన రెడ్ ఫోర్ట్, జామా మసీదు సమీపంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భద్రతా వ్యవస్థలు మరింత కట్టుదిట్టం చేశారు. మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద జరిగిన ఈ పేలుడు తర్వాత మెట్రో సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇప్పటి వరకు లభించిన వివరాల ప్రకారం, పేలుడు ఉద్దేశ్యపూర్వకమా లేదా ప్రమాదవశాత్తుగా జరిగిందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అధికారులు తదుపరి దర్యాప్తు ఫలితాలు వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.