Published : Nov 10, 2025, 11:23 PM ISTUpdated : Nov 10, 2025, 11:34 PM IST
Delhi Blast : ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుతో 13 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. హోం మంత్రి అమిత్ షా సమగ్ర విచారణకు ఆదేశించారు. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.
ఢిల్లీ పేలుడు: హోం మంత్రి అమిత్ షా సమగ్ర విచారణకు ఆదేశాలు
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద నిలిపివున్న హ్యుందాయ్ ఐ20 కారులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఘటనా స్థలంలో మృతుల సంఖ్య 13కు చేరింది, ఇంకా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణమే స్పందించారు. ఆయన సమగ్ర విచారణకు ఆదేశించి, బాధితులను స్వయంగా పరామర్శించారు.
26
ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన అమిత్ షా
పేలుడు సమాచారం అందుకున్న వెంటనే అమిత్ షా లోక్ నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన నేరుగా ఎర్రకోట సమీపంలోని ఘటనా స్థలానికి వెళ్లి, అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ఆయనతోపాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గుల్చా, ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ, ఫోరెన్సిక్ అధికారులు ఉన్నారు.
అమిత్ షా మాట్లాడుతూ.. “పేలుడు గురించి అన్ని కోణాల్లో విచారణ జరుగుతోంది. సీసీటీవీ ఫుటేజ్, సాక్ష్యాలు, వాహన నంబర్ రికార్డులు అన్నీ పరిశీలనలో ఉన్నాయి. ప్రజలకు పూర్తి వివరాలు విచారణ పూర్తయ్యాక వెల్లడిస్తాం” అని చెప్పారు.
36
హ్యుందాయ్ ఐ20లో భారీ పేలుడు
సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద సాయంత్రం 6:52 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలిచిన కారు అకస్మాత్తుగా పేలిపోయింది. వాహనం చుట్టుపక్కల నిలిచిన పలు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. పోలీసుల ప్రకారం, పేలుడు సమయంలో కారులో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. కారు హర్యానా రాష్ట్రానికి చెందిన నదీమ్ ఖాన్ పేరుతో HR267674 నంబర్‌పై రిజిష్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఎన్ఐఏ బృందం ప్రాథమిక విచారణలో సీసీటీవీ ఫుటేజ్‌లో కొన్ని అనుమానాస్పద కదలికలను గమనించింది. పేలుడు కారణంగా పక్కనున్న వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఈ దారుణ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా “ఢిల్లీ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పూర్తి సాయం అందిస్తుంది” అని తెలిపారు. హోం మంత్రి అమిత్ షా, సంబంధిత అధికారులతో మాట్లాడి, పరిస్థితిని సమీక్షించారు.
56
దేశవ్యాప్తంగా హై అలర్ట్
పేలుడు తర్వాత ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రాష్ట్రవ్యాప్తంగా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అన్ని ఎస్పీలకు ఆదేశించారు. మాల్స్, హోటల్స్, రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు పెంచారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనబడితే వెంటనే 112కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
66
దర్యాప్తు వేగవంతం.. అనుమానితుల అరెస్ట్
ఢిల్లీ పోలీసులు ఈ పేలుడుకు సంబంధించి అనుమానితులను అరెస్టు చేశారు. వీరిని ప్రత్యేక బృందం విచారణకు తరలించింది. పేలుడు ఉద్దేశపూర్వకమా లేక ప్రమాదవశాత్తా జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఫోరెన్సిక్ నివేదికలు వచ్చే వరకు కారణాలను వెల్లడించలేమని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై ఎన్ఐఏ, ఎన్‌ఎస్‌జీ, ఐబీ బృందాలు సంయుక్తంగా పని చేస్తున్నాయి. పేలుడుకు కారణంగా అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.