
మేఘాలయలో సంచలనం రేపిన హనీమూన్ హత్య కేసు గురించి అందరికీ తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌కు చెందిన సోనమ్ పెళ్లి జరిగిన తొమ్మిది రోజులకే భర్త రాజా రఘువంశీని ప్రియుడితో కలిసి చంపేసింది. ఈ సంఘటన తర్వాత సోనమ్ కుటుంబం ఆమెతో సంబంధం తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సోనమ్ షిల్లాంగ్ జైలులో ఉంది. ములాఖత్‌కు అవకాశం ఉన్నా కుటుంబసభ్యులు ఆమెను కలవడానికి ఇష్టపడడం లేదు.
రాజస్థాన్‌లోని అల్వాల్‌లో జరిగిన సంఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భార్య తన ప్రియుడితో కలసి భర్తను హత్య చేసి, మృతదేహాన్ని డ్రమ్ములో దాచిపెట్టినట్లు బయటపడింది. ఈ రహస్యాన్ని 8 ఏళ్ల కుమారుడు అమాయకంగా పోలీసులకు వివరించడంతో నిజం బట్టబయలైంది. వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు మహిళతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడులో భయంకర ఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. వేలూరు జిల్లా కుప్పంపాళ్యానికి చెందిన భారత్ (36) ను అతని భార్య నందిని, ఆమె ప్రియుడు సంజయ్‌తో కలిసి హత్య చేయించింది. ఘటనాస్థలంలోనే భారత్ చనిపోయాడు. మూడు సంవత్సరాల చిన్న కుమార్తె అమాయకంగా చెప్పిన వివరాలతో నిజం వెలుగులోకి రావడంతో పోలీసులు నందిని, సంజయ్‌లను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
జోగుళాంబ గద్వాలలో జరిగిన తేజేశ్వర్ హత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏపీలోని కర్నూల్‌కి చెందిన ఐశ్వర్యతో తేజేశ్వర్‌కి ఈ ఏడాది మే18న వివాహం కాగా.. అప్పటికే తిరుమల్ రావు అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఐశ్వర్య.. భర్తను చంపేందుకు కుట్ర చేసింది. ఈక్రమంలోనే సుపారీ ఇచ్చిమరీ.. తేజేశ్వర్‌ను హత్య చేయించి కర్నూల్ జిల్లాలోని పిన్నాపురం చెరువులో పడేశారు. హత్యకు పాల్పడిన ముగ్గురితోపాటు ఐశ్వర్యను ఆమె తల్లి సుజాతను అరెస్టు చేశారు. తిరుమల్ రావు కొన్ని రోజులు పరారీలో ఉన్నా. చివరికి ఆయనని కూడా పోలీసులు పట్టుకున్నారు.
ప్రియుడి సహాయంతో భర్తలను హతమార్చిన సంఘటనలు ఈ ఏడాది ఎన్నో చోటు చేసుకున్నాయి. వెలుగులోకి వచ్చిన ఇలాంటి కొన్ని దారుణ సంఘటనలు.
* వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. ఆగస్టులో ఈ సంఘటన జరిగింది.
* వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన ఓ భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది కరీంనగర్‌కు చెందిన ఓ భార్య. భర్తకు మద్యం తాగించి.. ఆపై చెవుల్లో గడ్డి మందు పోసి కిరాతకంగా అంతమెుందించింది. ఈ సంఘటన ఆగస్టు 6న వెలుగులోకి వచ్చింది.
* ఈ ఏడాది జూలైలో ఇలాంటి ఓ విస్తుపోయే సంఘటన యూపీలో జరిగింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్న భార్య.. భర్త భర్త అడ్డుతొలగించుకుంది. ప్రియుడితో కలిసి భర్తకు రెండుసార్లు విషమిచ్చి భార్య హత్య చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మహిళ, ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ప్రతి దసరా రోజు మనం చెడుపై మంచి గెలిచినందుకు, రాముడు రావణాసురుడిని ఓడించినందుకు రావణ దహనం నిర్వహిస్తాం. రామ్‌లీలా ప్రదర్శనలు, రావణ బొమ్మ దహనం అనేవి అందరికీ సాంప్రదాయంగా తెలుసు. కానీ ఈ సారి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వినూత్న విధంగా దసరా జరుపుతున్నారు. రావణ కాదు, ఆయన సోదరి సూర్పనఖ బొమ్మను దహనం చేయనున్నారు.
పౌరుష్ అనే పురుష హక్కుల సంస్థ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అక్టోబర్ 2, దసరా రోజున నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా స్త్రీ దుష్టత్వానికి ప్రతీకగా సూర్పనఖ బొమ్మను దహనం చేస్తారు. సాంప్రదాయంగా పది తలల రావణ బొమ్మకు బదులుగా.. ఈ సారి స్త్రీ నేరాలకు ప్రతీకగా ప్రియుళ్లతో కలిసి భర్తలను హత్య చేసిన మహిళల 11 తలల ఫొటోలతో సూర్పనఖ బొమ్మను రూపొందించి దహనం చేయనున్నారు.
పౌరుష్ సంస్థ తెలిపిన విధంగా, దుష్టత్వానికి లింగ భేదం ఉండదు. మహిళలు చేసిన నేరాలను సమాజం ఖండించాలి అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు. సమాజంలో నమ్మకద్రోహం, నేరపూరిత ప్రవర్తన చూపే “ఆధునిక సూర్పనఖలు” చాలా మంది ఉన్నారని, అందుకే ఈసారి దసరాకు ఈ థీమ్‌ను ఎంచుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.