
మరో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సమయం ఆసన్నమవుతోంది. 2025 ముగిసి, 2026లోకి అడుగుపెడుతున్న తరుణంలో, ప్రతి ఒక్కరూ ఈ సమయాన్ని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాలని కోరుకుంటారు. దైనందిన జీవితంలోని ఒత్తిళ్ల నుండి విరామం తీసుకోవడానికి, కొత్త ప్రాంతాలను సందర్శించడానికి, కొత్త ఆరంభాలకు స్వాగతం పలకడానికి న్యూ ఇయర్ ఒక సరైన సమయం.
మీరు 2026 నూతన సంవత్సర వేడుకల కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే భారతదేశంలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు మీకు స్వాగతం పలుకుతున్నాయి. మీరు గ్రాండ్ సెలబ్రేషన్స్ కోరుకుంటున్నారా? లేదా ప్రశాంతమైన వాతావరణం కావాలా? మంచుతో కప్పబడిన కొండలు ఇష్టమా? లేక సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే వేడుకలు కావాలా? ఇలా మీ అభిరుచి ఏదైనా సరే, భారతదేశంలో మీకు నచ్చే అద్భుతమైన ఆప్షన్లు ఉన్నాయి.
పార్టీ హబ్‌ల నుండి ప్రశాంతమైన హిల్ స్టేషన్ల వరకు, 2026 న్యూ ఇయర్ సెలవుల్లో సందర్శించడానికి అత్యంత అనువైన 5 ఉత్తమ ప్రదేశాల వివరాలు గమనిస్తే..
భారతదేశంలో న్యూ ఇయర్ వేడుకలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు గోవా. ఇది దేశంలోనే అత్యంత ప్రసిద్ధ న్యూ ఇయర్ డెస్టినేషన్‌గా కొనసాగుతోంది, దానికి తగిన కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడి బీచ్ పార్టీలు, మ్యూజిక్ ఫెస్టివల్స్, ఆకాశాన్ని తాకే బాణాసంచా వెలుగులు పర్యాటకులకు సరికొత్త జోష్‌ను అందిస్తాయి.
గోవాలోని బాగ (Baga), అంజునా (Anjuna), కాండోలిమ్ (Calangute) వంటి ప్రముఖ బీచ్‌లలో ఎలక్ట్రిఫైయింగ్ ఈవెంట్స్ జరుగుతాయి. ఇక్కడ రాత్రంతా జరిగే సంబరాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక లగ్జరీని కోరుకునే వారి కోసం, అనేక రిసార్ట్‌లు ఎలిగెంట్ న్యూ ఇయర్ గాలా డిన్నర్లను ఏర్పాటు చేస్తాయి. స్నేహితులతో కలిసి వెళ్లడానికి, పార్టీలు ఇష్టపడే వారికి, నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే వారికి గోవా సరైన ఎంపిక.
మీరు వింటర్ అద్భుతాలను ఆస్వాదించాలని కలలు కంటున్నారా? అయితే మనాలి మీకు పర్ఫెక్ట్ డెస్టినేషన్. చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, వెచ్చని కేఫ్‌లు, చలి మంటలు, లైవ్ మ్యూజిక్ ఇక్కడ ఒక మ్యాజికల్ వాతావరణాన్ని సృష్టిస్తాయి.
సాహస ప్రియుల కోసం మనాలిలో స్కైయింగ్, స్నోబోర్డింగ్, వింటర్ ట్రెక్కింగ్ వంటి అవకాశాలు కూడా ఉన్నాయి. జంటలకు, కుటుంబాలకు, సింగిల్స్ కు.. ఇలా మంచును ఇష్టపడే వారికి ఇది స్వర్గధామం లాంటిది. పర్వతాల అందాలను చూస్తూ, కొత్త ఏడాదికి స్వాగతం పలకడం ఒక మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.
రాచరికపు ఠీవి, సంప్రదాయం, ఆధునిక వేడుకల కలయికను మీరు కోరుకుంటే జైపూర్ వెళ్ళాల్సిందే. ఇక్కడి హెరిటేజ్ హోటళ్లు, రాజభవనాల్లో న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. సాంస్కృతిక ప్రదర్శనలు, విలాసవంతమైన విందులు, కనువిందు చేసే బాణాసంచా కాల్పులతో జైపూర్ ఒక రాయల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
శీతాకాలంలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కోటలు, రాజభవనాలు, స్థానిక మార్కెట్‌లను సందర్శించడానికి ఇది సరైన సమయం. లగ్జరీ ట్రావెలర్స్, కుటుంబాలు, సంస్కృతిని ఇష్టపడే వారికి జైపూర్ ఉత్తమ ఎంపిక.
న్యూ ఇయర్ అంటే కేవలం పార్టీలే కాదు.. మనసుకు ప్రశాంతత కూడా కావాలి అనుకునే వారికి రిషికేశ్ బెస్ట్ ఆప్షన్. యోగా, ధ్యానం, ఆధ్యాత్మికతకు నెలవైన ఈ ప్రదేశం, 2026ను సానుకూల దృక్పథంతో ప్రారంభించడానికి వీలు కల్పిస్తుంది.
గంగా నది ఒడ్డున జరిగే ప్రశాంతమైన వేడుకలు, గంగా హారతి, వెల్నెస్ ప్రోగ్రామ్‌లు ఇక్కడి ప్రత్యేకత. ఒంటరిగా ప్రయాణించే వారికి, మానసిక ప్రశాంతత కోరుకునే వారికి, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారికి రిషికేశ్ ఒక అద్భుతమైన గమ్యస్థానం.
షిల్లాంగ్ న్యూ ఇయర్ వేడుకలు చాలా విభిన్నంగా ఉంటాయి. సంగీతం, కమ్యూనిటీ ఈవెంట్స్, ప్రకృతి అందాల మేళవింపుగా ఇక్కడి వేడుకలు జరుగుతాయి. కిక్కిరిసిన పర్యాటక ప్రాంతాలకు దూరంగా, ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్.
ఇక్కడి లైవ్ మ్యూజికల్ కల్చర్, ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం, అందమైన పరిసరాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. చర్చిలు, కేఫ్‌లు, స్థానికంగా జరిగే వేడుకలు చాలా ఉల్లాసంగా ఉంటాయి. సంగీత ప్రియులకు, ప్రకృతి ప్రేమికులకు షిల్లాంగ్ కచ్చితంగా నచ్చుతుంది.
మీరు తెల్లవార్లూ డ్యాన్స్ చేయాలనుకున్నా, మంచు కురుస్తున్న వేళ ఆనందించాలనుకున్నా, రాయల్ లగ్జరీని అనుభవించాలనుకున్నా, లేదా మానసిక ప్రశాంతతను వెతుక్కుంటున్నా.. ఈ ప్రదేశాల్లో ఏదో ఒక ప్రత్యేకత కచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, ముందుగానే బుక్ చేసుకోండి.. మీ న్యూ ఇయర్ 2026 సెలవులను మరింత ఆనందంగా మార్చుకోండి.