Climate Warning: రక్తంలా మారుతున్న నదులు ! ముంచుకొస్తున్న పెను ముప్పు? అంతమేనా !

Published : Dec 23, 2025, 07:58 PM IST

Climate Warning : ఆర్కిటిక్ ప్రాంతంలోని వందలాది నదులు అకస్మాత్తుగా నారింజ రంగులోకి మారుతున్నాయి. పర్మాఫ్రాస్ట్ కరగడమే దీనికి కారణమని, ఇది ప్రపంచవ్యాప్త విపత్తుకు సంకేతమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు ఏం జరుగుతోందో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
భయపెడుతున్న వాతావరణ మార్పులు: ప్రపంచానికి పెను ముప్పు

ప్రపంచవ్యాప్తంగా అనేక నదులు ప్రవహిస్తుంటాయి. అవి సాధారణంగా నీలం లేదా తేటగా ఉంటాయి. కానీ, భూమిపై అత్యంత శీతల ప్రాంతమైన ఆర్కిటిక్‌లో ఒక వింత, ఆందోళనకరమైన పరిణామం చోటుచేసుకుంది. అక్కడి వందలాది నదుల రంగు ఒక్కసారిగా మారిపోయింది. అవి ఇప్పుడు నారింజ, ఎరుపు రంగులో ప్రవహిస్తున్నాయి. ఇది ఏదో రసాయన కాలుష్యం వల్ల జరిగింది కాదని, దీని వెనుక పెద్ద పర్యావరణ విపత్తు దాగి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు ఆర్కిటిక్‌లో ఏం జరుగుతోంది? శాస్త్రవేత్తలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?

26
ఆందోళన రేపుతున్న NOAA వార్షిక రిపోర్టులు

ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రాంతంగా పిలవబడే ఆర్కిటిక్ ప్రాంతం గురించి 'నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్' (NOAA) కీలక రిపోర్టులను విడుదల చేసింది. 2025 సంవత్సరానికి సంబంధించిన ఈ వార్షిక వాతావరణ రిపోర్టులో పేర్కొన్న అంశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

ఈ రిపోర్టులు ప్రకారం.. ఆర్కిటిక్ ప్రాంతం ఇప్పుడు తీవ్రమైన వాతావరణ సంక్షోభం అంచున ఉంది. అక్కడ జరుగుతున్న మార్పులు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, మొత్తం భూగోళంపై ప్రభావం చూపనున్నాయి. శాస్త్రవేత్తలు ఈ పరిస్థితులను చూసి షాక్ తో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

36
పర్మాఫ్రాస్ట్ కరగడమే అసలు కారణం

ఆర్కిటిక్‌లోని నదులు నారింజ రంగులోకి మారడానికి కారణం ఏమిటనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. సాధారణంగా నదుల రంగు మారితే అది రసాయన కాలుష్యం అని భావిస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. శాస్త్రవేత్తల ప్రకారం, దీనికి ప్రధాన కారణం 'పర్మాఫ్రాస్ట్' (Permafrost) కరగడం.

పర్మాఫ్రాస్ట్ అనేది వేల సంవత్సరాలుగా గడ్డకట్టుకుపోయి ఉన్న భూమి పొర. భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల ఈ పర్మాఫ్రాస్ట్ వేగంగా కరుగుతోంది. ఇలా కరగడం వల్ల భూమిలో దాగి ఉన్న ఖనిజాలు బయటపడుతున్నాయి. ఇదే నదుల రంగు మారడానికి దారితీస్తోంది.

46
కరుగుతున్న ఇనుము.. కలుషితమవుతున్న నీరు

వేల సంవత్సరాలుగా ఆర్కిటిక్ భూగర్భంలో ఘనీభవించి ఉన్న ఇనుము (Iron ore) ఇప్పుడు బయటపడుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మంచు కరిగి, ఆ నీటితో పాటు ఇనుము కూడా నదుల్లోకి చేరుతోంది. ఇనుము నీటితో కలిసినప్పుడు తుప్పు రంగులోకి మారుతుంది. అందుకే నదులు నారింజ రంగులో కనిపిస్తున్నాయి.

దీనివల్ల నీటి నాణ్యత పూర్తిగా దెబ్బతింటోంది. దాదాపు 200కు పైగా నదులు ఈ ప్రభావానికి గురయ్యాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ కలుషిత నీరు అక్కడి పర్యావరణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది. చేపలు, ఇతర జలచరాల మనుగడకు ఇది ముప్పుగా పరిణమిస్తోంది.

56
మహాసముద్రాల్లో మారుతున్న జీవావరణం

కేవలం మంచు కరగడమే కాకుండా, ఆర్కిటిక్ చుట్టూ ఉన్న మహాసముద్రాల వాతావరణం కూడా మారుతోంది. అట్లాంటిక్ మహాసముద్రం నుండి వెచ్చని నీరు ఇప్పుడు ఉత్తర దిశగా ఆర్కిటిక్‌లోకి ప్రవేశిస్తోంది.

ఈ వేడి నీటి ప్రవాహం కారణంగా అక్కడ 'ప్లవకాల' (Plankton) సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అదే సమయంలో, ఆర్కిటిక్ ప్రాంతానికి చెందిన స్థానిక జాతుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. ఇది సముద్ర ఆహార గొలుసులో పెను మార్పులకు కారణమవుతోంది. స్థానిక జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని రిపోర్టు స్పష్టం చేసింది.

66
గ్రీన్లాండ్ మంచు కరిగితే మునిగిపోతాం

గ్రీన్లాండ్ మంచు కరుగుతున్న తీరు అత్యంత ఆందోళనకరంగా ఉంది. కేవలం 2025 సంవత్సరంలోనే గ్రీన్లాండ్ నుండి ఏకంగా 129 బిలియన్ టన్నుల మంచు కరిగిపోయింది. ఇది ప్రపంచ సముద్ర మట్టాలను పెంచుతోంది.

మార్చి 2025లో నమోదైన గణాంకాల ప్రకారం, సముద్రపు మంచు విస్తరణ గత 47 ఏళ్లలో అత్యల్ప స్థాయికి పడిపోయింది. అంతేకాకుండా, గత రెండు దశాబ్దాలలో ఇక్కడి మంచు మందం 28 శాతం తగ్గింది. ఈ గణాంకాలు భవిష్యత్తులో రాబోయే విపత్తుకు అద్దం పడుతున్నాయి.

ప్రపంచం మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సిందే

ఈ పరిణామాలపై ప్రముఖ శాస్త్రవేత్త మాథ్యూ డ్రూకెన్‌మిల్లర్ (Matthew Druckenmiller) తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆర్కిటిక్ మంచు కరగడం అనేది కేవలం ఆ ఒక్క ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదని ఆయన స్పష్టం చేశారు. దీని పర్యవసానాలను ప్రపంచం మొత్తం అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు.

సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీరప్రాంత నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. అడవి జంతువులకు ఆహారం దొరకడం కష్టంగా మారుతుంది. అంతేకాక, అకాల వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. ప్రపంచ దేశాలు తక్షణమే మేల్కొనకపోతే పెను విపత్తు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories