Viral Video: సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా కొన్ని మాత్రం ఇప్పటికీ అలాగే ఉంటున్నాయి. ప్రేమ వివాహాలపై సొసైటీలో నిషేధం కొనసాగుతూనే ఉంది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల ఇష్టం కంటే, కట్టుబాట్లకే విలువ ఇస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని విదిషా పట్టణం చునావాలి గలి ప్రాంతంలో జరిగిన షాకింగ్ సంఘటన యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. కుష్వాహ కుటుంబానికి చెందిన 23 ఏళ్ల కవిత అనే ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కొన్ని ఆ తర్వాత ప్రేమించిన యువకుడితో గోప్యంగా పెళ్లి చేసుకున్నట్టు కుటుంబానికి తెలిసింది. ఈ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించలేకపోయారు.
25
కుటుంబాన్ని కుదిపేసిన వార్త
కవిత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. బంధువులను కూడా సంప్రదించారు. ఎలాంటి సమాచారం దొరకలేదు. కొద్ది రోజుల తరువాత ఆమె ప్రేమికుడితో వెళ్లిపోయి వివాహం చేసుకున్నట్టు తెలిసింది. ఈ వార్త కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ఇంట్లోనే ఉండి బాధలో మునిగిపోయారు.
35
భావోద్వేగ నిర్ణయం
బంధువులు వచ్చి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అయినా ఆ షాక్ నుంచి వారు బయటపడలేకపోయారు. చివరకు కవితను ఇక తమ కుమార్తెగా భావించలేమని నిర్ణయించారు. ఆమెను మృతురాలిగా పరిగణించి అంత్యక్రియలు చేయాలని భావించారు.
అనుకున్నదే తడవుగా.. శుక్రవారం రోజున బంధువులు, పరిచయస్తులను పిలిచారు. పిండితో కవితను పోలినట్లు ఒక ప్రతిమను తయారు చేశారు. అనంతరం ఆ ప్రతమను అలంకరించిన పల్లకీలో ఉంచి ఊరేగింపుగా పట్టణ వీధుల్లో తీసుకెళ్లారు. స్థానిక యువకులు పల్లకీ మోశారు. అనంతరం శ్మశానవాటికకు చేరుకుని సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. చివరకు ప్రతిమను దహనం చేశారు.
55
కుటుంబ సభ్యుల ఆవేదన
కవిత అన్న రాజేష్ కుష్వాహ మాట్లాడుతూ తమ కుటుంబం ఆమెను ఎంతో ప్రేమతో పెంచిందని చెప్పారు. మంచి చదువు చెప్పించామని, ఆశలన్నీ పెట్టుకున్నామని తెలిపారు. ఆమె వెళ్లిపోవడం తమ కలలన్నింటినీ చెదరగొట్టిందన్నారు. తండ్రి రాంబాబు కుష్వాహ కన్నీళ్లతో మాట్లాడుతూ ఇది తన జీవితంలో ఎదురైన అత్యంత బాధాకరమైన క్షణమని చెప్పారు. కుమార్తె తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని పూర్తిగా కుంగదీసిందని ఆవేదనతో చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటనకు సంబంధించి కొందరు తండ్రి చేసిన పనికి మద్ధతు తెలుపుతుంటే మరికొందరు మాత్రం బతికున్న కూతురు అంత్యక్రియలు చేయడం దారుణమంటూ కామెంట్లు చేస్తున్నారు.