Allahabad high court
మహిళ ఛాతిని తాకినా, డ్రస్ లాగినా అది అత్యాచారయత్నం కిందికి రాదని ఓ కేసు తీర్పులో భాగంగా అలహాబాద్ హైకోర్ట్ బడ్జి తీర్పునిచ్చారు. దీంతో ఈ తీర్పుపై యావత్ దేశం తీవ్రంగా స్పందిస్తోంది. ఇలాంటి తీర్పులు సమాజంలో తప్పుడు సంకేతాలను పంపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై వెంటనే సుప్రీం కోర్ట్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ అలహాబాద్ కోర్టు ఈ తీర్పు ఎందుకు ఎప్పుడు ఇచ్చింది.? అసలేం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం.
Allahabad High Court
2021లో ఉత్తరప్రదేశ్‌లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన 11 ఏళ్ల (ఘటన జరిగే నాటికి) కుమార్తెతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తోంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వారి దగ్గరికి వచ్చారు. బాలికను ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి బైక్‌పై ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లగానే యువకులు అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించారు.
Allahabad High Court
ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ తాకకూడని చోట తాకారు. దీంతో బాలిక ఒక్క సారిగా కేకలు వేసింది. దీంతో అక్కడ స్థానికంగా ఉన్న వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. విచారణలో భాగంగా జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన అత్యాచారం కిందకు రాదంటూ నిందితులకు అనుకూలంగా తీర్పునిచ్చారు. దీంతో ఈ అంశం కాస్త దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది.
Allahabad High Court (PhotoANI)
తీవ్ర వ్యతిరేకత:
కోర్టు తీర్పపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ తీర్పును కేంద్రమంత్రులు, నాయకులు, మహిళా కమిషన్లు, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు ఖండించారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఈ తీర్పు ముమ్మాటికీ తప్పు అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి తీర్పులు సమాజానికి మంచివి కావన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద జడ్జ్ నిర్లక్ష్య తీర్పుపై దేశమంతా భగ్గుమంటోంది.