Meerut Murder Case
ఇంటిలో వ్యతిరేకించినా ఆమె చేయి పట్టుకున్నాడు. ఏడు జన్మల పాటు కలిసి ఉంటానని ప్రమాణం చేస్తూ నుదుటిన సింధూరం దిద్దాడు. కానీ ఆ పనే ఆయన మరణానికి కారణమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే శత్రువుగా మారింది. మెర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ ది.
వివరాల్లోకి వెళితే.. మార్చి 3, 2025న సౌరభ్ రాజ్‌పుత్‌ను దారుణంగా హత్య చేశారు. అతని శరీరాన్ని 15 ముక్కలు చేసి ఒక డ్రమ్ములో వేసి, పైన సిమెంట్ కాంక్రీటుతో నింపారు. ఇంత దారుణంగా హత్య చేసింది అతని భార్య ముస్కాన్. ఈ దుర్మార్గంలో ఆమెకు సహాయం చేసింది ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా. ఇద్దరూ ఇప్పుడు కటకటాల వెనుక ఉన్నారు, తమ నేరాన్ని అంగీకరించారు.
సౌరభ్ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు:
బ్రహ్మపురి ప్రాంతానికి చెందిన సౌరభ్ రాజ్‌పుత్ 2016లో ముస్కాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల వారు హాజరు కాలేదు. 2019లో ముస్కాన్ ఒక పాపకు జన్మనిచ్చింది. ఇందిరా నగర్‌లో ఇద్దరూ నివసించారు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న సమయంలో ముస్కాన్ జీవితంలోకి సాహిల్ శుక్ అనే వ్యక్తి వచ్చాడు. ఇద్దరూ 8వ తరగతిలో కలిసి చదువుకున్నారు. సాహిల్ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ముస్కాన్‌ను కలిసిన తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది, ఆ తర్వాత ముస్కాన్ కూడా డ్రగ్స్‌కు బానిసైంది.
విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సౌరభ్ ఎందుకు వెనక్కి తీసుకున్నాడు?
సాహిల్, ముస్కాన్‌ల మధ్య సంబంధం గురించి సౌరభ్‌కు తెలిసింది. 2021లో అతను విడాకుల కోసం పిటిషన్ కూడా దాఖలు చేశాడు. కానీ చిన్న పాప ఉండటంతో కుటుంబ సభ్యులు అతనికి నచ్చజెప్పారు. దీంతో అతను విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత సౌరభ్ మళ్లీ మెర్చంట్ నేవీ ఉద్యోగంలో చేరాడు. విధిలో భాగంగా సౌరభ్ లండన్ వెళ్ళాడు. భర్త లండన్ వెళ్లడంతో ముస్కాన్, సాహిల్ మరింత దగ్గరయ్యారు.
అత్యంత దారుణంగా హత్య:
సౌరభ్ పాస్‌పోర్ట్ గడువు ముగియనుండటంతో దానిని పునరుద్ధరించుకోవడానికి ఫిబ్రవరి 24న భారతదేశానికి వచ్చాడు. భర్త వస్తున్నాడని తెలుసుకున్న ముస్కన్ భర్తను లేకుండా చేద్దామని కుట్ర పన్నింది. ఇద్దరూ ముందుగా మత్తు మందులు కొన్నారు, ఒక కత్తి కూడా తీసుకున్నారు. మార్చి 3 రాత్రి ముస్కాన్ సౌరభ్ ఆహారంలో మత్తు మందులు కలిపింది. అతను స్పృహ కోల్పోయిన తర్వాత సాహిల్ అతన్ని పట్టుకున్నాడు, ముస్కాన్ కత్తితో అనేకసార్లు పొడిచింది. అతను చనిపోయిన తర్వాత ఇద్దరూ సౌరబ్ శరీరాన్ని ముక్కలు చేసి డ్రమ్ములో నింపి సిమెంటుతో పూడ్చారు.
ముస్కాన్ ఎలా దారికింది.?
శవాన్ని దాచిన తర్వాత ముస్కాన్ తన కూతురిని తల్లి దగ్గర వదిలి సాహిల్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లింది. మార్చి 17న తిరిగి వచ్చిన తర్వాత 6 సంవత్సరాల కూతురు నాన్న గురించి అడిగినప్పుడు ముస్కాన్ ఒక పథకం ప్రకారం సౌరభ్ హత్య నేరాన్ని అత్తమామలపై వేసింది. ఆ తర్వాత సౌరభ్ బంధువులు ముస్కాన్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో ముస్కాన్ తన నేరాన్ని అంగీకరిస్తూ శవాన్ని ఎక్కడ దాచిందో చెప్పింది.