
ప్రస్తుతం ఆధార్ కార్డ్ అనేక డిజిటల్ సేవలకు మూల ఆధారం అవుతోంది. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ ఉన్నప్పుడు మాత్రమే వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) ద్వారా పలు సేవలను ఆన్‌లైన్‌లో పొందడం సాధ్యమవుతుంది. గతంలో ఇచ్చిన మొబైల్ నంబర్ పనిచేయకపోతే, లేదా కొత్త నంబర్‌కు మార్చుకోవాలనుకుంటే, దీనిని అప్‌డేట్ చేయడం తప్పనిసరి.
అయితే, ఆధార్ మొబైల్ నెంబర్ ను పూర్తిగా ఆన్‌లైన్‌లో మార్పు చేయడం సాధ్యం కాదు. బయోమెట్రిక్ ధృవీకరణ అవసరమైందున, మీకు దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాలి లేదా UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.
UIDAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీ ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్ మార్పు కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేయడం ఇలా చేయాలి:
1. ప్రధాన వెబ్‌సైట్ సందర్శించండి: https://uidai.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి.
2. మెను నుంచి ఎంపిక: "My Aadhaar" → "Get Aadhaar" → "Book an Appointment" ఎంపిక చేయండి.
3. నగరం లేదా ప్రాంతం ఎంటర్ చేయండి: మీ నగరాన్ని టైప్ చేసి, 'Proceed to Book Appointment' క్లిక్ చేయండి.
4. మొబైల్ నంబర్ & క్యాప్చా: ప్రస్తుత మొబైల్ నంబర్, చూపిన క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, "Generate OTP" క్లిక్ చేయండి.
5. OTP ధృవీకరణ: మీరు పొందిన OTP ఎంటర్ చేసి "Verify OTP" క్లిక్ చేయండి.
6. వివరాలు ఎంటర్ చేయండి: ఆధార్ నంబర్, పూర్తి పేరు, పుట్టిన తేదీ, అప్లికేషన్ ధృవీకరణ రకం, రాష్ట్రం, నగరం, ఎంపిక చేసిన ఆధార్ సేవా కేంద్రం వివరాలు అందించాలి.
7. అప్‌డేట్ ఎంపిక: "Update Mobile Number" అనే ఎంపికను ఎంచుకోండి.
8. తేదీ, సమయం ఎంపిక: మీకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంచుకోండి.
9. వివరాలు పరిశీలించండి: మీరు ఇచ్చిన సమాచారాన్ని ఓసారి సరిచూసుకుని "Submit" క్లిక్ చేయండి.
10. కేంద్రానికి వెళ్లండి: మీ అపాయింట్‌మెంట్ తేదీ, సమయానికి ఎంపిక చేసిన ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లండి.
11. బయోమెట్రిక్ ధృవీకరణ: అక్కడ అధికారుల ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ జరగుతుంది.
12. సేవా ఛార్జ్ & రసీదు: రూ.50 సేవా ఛార్జ్ చెల్లించి, అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ఉన్న రసీదును పొందండి. దీని ద్వారా మీ అప్‌డేట్ స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చు.
UIDAI 2025 నవంబర్ నుండి ఓ కీలక మార్పును అమలు చేయబోతుంది. మొబైల్ నంబర్, చిరునామా, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను ఇంటి నుంచే అప్డేట్ చేయగలిగే విధంగా కొత్త ప్రోటోకాల్‌ను ప్రవేశపెడుతోంది. అయితే, ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్‌ల కోసం మాత్రమే కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.
UIDAI CEO భువనేశ్ కుమార్ మాట్లాడుతూ.. "మీ ఫింగర్ ప్రింట్, ఐరిస్ తప్ప, మిగిలిన అన్ని అప్డేట్‌లను ఇంటి నుంచే చేయగలుగుతారు" అని తెలిపారు.
UIDAI త్వరలో ఓ కొత్త మొబైల్ యాప్‌ను విడుదల చేయనుంది. దీని ద్వారా వినియోగదారులు తాము కోరిన డేటాను QR కోడ్ ద్వారా పంచుకోవచ్చు. దీనివల్ల ఫోటోకాపీల అవశ్యకత ఉండదు. డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయగలుగుతారు. దీని ప్రధాన లక్ష్యం నకిలీ డాక్యుమెంట్లపై నియంత్రణ, పౌరుల సేవల ప్రక్రియ వేగవంతం చేయడం, డేటాపై వ్యక్తిగత నియంత్రణ పెంచడంగా ఉన్నాయి.
ఈ QR కోడ్ వ్యవస్థను రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో, హోటల్స్, సెక్యూరిటీ సంస్థల్లో ఉపయోగించేందుకు UIDAI సూచిస్తోంది.
ఆధార్ అనేది భారతదేశ పౌరులకు యూఐడీఎఐ జారీ చేసే 12 అంకెల ప్రత్యేక గుర్తింపు నంబర్. ఇది వయసు లేదా లింగానికి సంబంధం లేకుండా అందరికీ ప్రామాణిక గుర్తింపు సూచికగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం అందిచే సేవలకు అధికారిక గుర్తింపుగా ఉంటుంది.