కూరగాయలు, పండ్లు, ఓట్స్, ధాన్యాలు, పప్పులు వంటి వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఉదయం ఓట్స్‌ను పాలు లేదా పెరుగుతో, కొద్దిగా పండ్లతో కలిపి తీసుకోవచ్చు. అలాగే కూరగాయలతో చేసిన ఉప్మా, వెజిటబుల్ దోశ, సాంబార్ ఇడ్లీ వంటి ఆహారాలను సరైన పరిమాణంలో తీసుకోవచ్చు. బరువు తగ్గాలంటే మనకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లను మానేయాల్సిన అవసరం లేదు. వాటిని ఎలా తయారు చేస్తున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం, వాటితో పాటు ఏం తీసుకుంటున్నాం అనేది ముఖ్యం.
అలాగే పండ్లు తీసుకోవడం వల్ల ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు అందుతాయి. అయితే పండ్ల రసాల కంటే పండును పూర్తిగా తినడం మంచి ఎంపిక. పండును పూర్తిగా తిన్నప్పుడు ఫైబర్ కూడా లభిస్తుంది. అదే విధంగా డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ వాటిలో కేలరీలు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వాటిని మితంగా తీసుకోవడం మంచిది.