సిగరెట్‌లోని విష రసాయనాలు శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని పెంచుతాయి. ఇది రోగనిరోధక శక్తిని క్షీణించేలా చేస్తాయి. దీనివల్ల చిన్న అనారోగ్యం వచ్చినా శరీరం త్వరగా కోలుకోదు. నెలరోజుల పాటు రోజూ రెండు సిగరెట్లు తాగితే అది చర్మంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. రక్త ప్రసరణ తగ్గడం వల్ల చర్మం పేలవంగా, కాంతిహీనంగా మారుతుంది. గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. పంటి చిగుళ్లలో చికాకు లేదా వాపు రావచ్చు.
నెలరోజులు రోజుకు రెండు సిగరెట్లు తాగి పూర్తిగా మానేస్తే శాశ్వత నష్టం ఉండదు. ఎంత త్వరగా మానేస్తే, శరీరం కోలుకోవడానికి అంత సమయం దొరుకుతుంది. కానీ కణ స్థాయిలో నష్టం అప్పటికే జరుగుతుంది. ఊపిరితిత్తులు, రక్తనాళాల్లో సమస్యలు మొదలవుతాయి. ఆస్తమా, గుండె జబ్బులు ఉన్నవారిలో ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి.
లైట్ సిగరెట్లు, బీడీలు అన్నింటిలో నికోటిన్ ఉంటుంది, అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. రోజుకు నాలుగు తాగినా, ఒకటి తాగినా కూడా ధూమపానం తీవ్ర హానికరమైనది. అందుకే ఈ అలవాటును త్వరగా మానుకోవడం మంచిది.