Goa: గోవా అంటే వెంటనే గుర్తొచ్చేది బీచ్ లు, పబ్ కల్చర్, పార్టీలే. కానీ గోవా బ్యూటీ అది మాత్రమే కాదు. ప్రశాంతమైన ప్రకృతి, వందల ఏళ్ల చరిత్ర, కట్టడాలు..ఇలా చాలానే ఉన్నాయి. అందుకే ఈసారి గోవా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు వీటిని మిస్ అవ్వకండి.
గోవా అంటే వెంటనే గుర్తొచ్చేది బీచ్ లు, పార్టీలే, కానీ గోవా బ్యూటీ అది మాత్రమే కాదు. ప్రశాంతమైన ప్రకృతి, వందల ఏళ్ల చరిత్ర, కట్టడాలు, మసాలా తోటలు, పక్షుల అభయారణ్యాలు..ఇలా బీచే కాకుండా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అందుకే ఈసారి గోవా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు వీటిని మిస్ చేసుకోకండి. అవేంటో ఇక్కడ చూద్దాం.
28
దూద్ సాగర్ జలపాతం
పశ్చిమ కనుమల పచ్చని అడవుల మధ్య కనిపించే దూద్ సాగర్ జలపాతం గోవాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఎత్తైన కొండపై నుంచి తెల్లని నీరు..పాలధారలా కిందికి జాలువారుతూ కనిపిస్తుంది. అందుకే దీన్ని దూద్ సాగర్ అని పిలుస్తారు. జలపాతం చుట్టూ ఉండే అడవి వాతావరణం, ప్రకృతి ప్రేమికులకు ఆకట్టుకుంటుంది. ఇక్కడ జీప్ సఫారీ, ట్రెక్కింగ్ వంటి అనుభవాలు ప్రత్యేకంగా నిలుస్తాయి.
38
ఓల్డ్ గోవా చారిత్రక కట్టడాలు
చరిత్ర, వాస్తు శిల్పంపై ఆసక్తి ఉన్నవారికి ఓల్డ్ గోవా మంచి ఫీల్ ఇస్తుంది. ఇక్కడి చర్చిలు, కాన్వెంట్ల సముదాయం గోవా పోర్చుగీస్ వారసత్వానికి అద్దం పడతాయి. బసిలికా ఆఫ్ బామ్ జీసస్, సే కేథ్రడాల్ వంటి ప్రసిద్ధ కట్టడాలు ఇక్కడే ఉన్నాయి. ఓల్డ్ గోవాలోని ఈ చారిత్రక ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు కూడా ఉంది.
పనాజీలోని ఫొంటైన్హాస్ ప్రాంతంలో అడుగుపెడితే గోవాలోనే మరో ప్రపంచంలోకి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. పోర్చుగీస్ ప్రభావం కనిపించే పాత ఇళ్లు, రంగురంగుల గోడలు, చిన్న వీధులు ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తాయి. నడుచుకుంటూ వీధులను అన్వేషిస్తూ ఫొటోలూ తీసుకోవడానికి ఇది మంచి ప్రదేశం.
58
మసాలా తోటల సందడి
గోవా పచ్చదనాన్ని మరో కోణంలో చూడాలంటే స్పైస్ ప్లాంటేషన్స్ కు వెళ్లొచ్చు. ముఖ్యంగా పోండా ప్రాంతాలోని మసాలా తోటల్లో మిరియాలు, వనిల్లా, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు ఎలా పండిస్తారో తెలుసుకోవచ్చు. ప్రకృతితో పాటు స్థానికి వ్వవసాయ పద్ధతులు, గోవన్ ఆహార సంస్కృతిని తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. గోవా టూరిజం కూడా స్పైస్ ఫామ్స్ ను ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా చెబుతోంది.
68
చోరావ్ ఐలాండ్..పక్షుల మధ్య బోట్ రైడ్
మండోవి నదిలోని చోరావ్ దీవి ప్రకృతి ప్రేమికులకు మరో మంచి గమ్యం. ఇక్కడి సలీం అలీ పక్షుల సంరక్షణ కేంద్రం చుట్టూ మడ అడవులు, వివిధ రకాల పక్షులు కనిపిస్తాయి. బోట్ రైడ్ చేస్తూ ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించడం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.
78
అగ్వాడా, చపోరా కోటలు
గోవా చరిత్రను తెలుసుకోవాలంటే అక్కడి కోటలను కూడా చూడాలి. సముద్రాన్ని ఆనుకుని ఉన్న అగ్వాడా కోట గోవా చారిత్రక వారసత్వంలో ముఖ్యమైనది. ఇక చపోరా కోట దిల్ చాహ్తా హై సినిమా కారణంగా మరింత ప్రాచుర్యం పొందింది. కొండపై నుంచి చుట్టూ కనిపించే సముద్ర తీరాలు, సుర్యాస్తమయం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గోవాలో అగ్వాడా, చపోరాతో పాటు మరికొన్ని చారిత్రక కోటలు కూడా ఉన్నాయి.
88
గోవా స్టేట్ మ్యూజియం
గోవా చరిత్ర, కళ, సంస్కృతిపై మరింత తెలుసుకోవాలనుకునేవారు పనాజీలోని గోవా స్టేట్ మ్యూజియాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ పురావస్తు వస్తువులు, కళాఖండాలు, చారిత్రక అవశేషాలు వంటి వాటి ద్వారా గోవా వారసత్వాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకే గోవా ట్రిప్ అంటే కేవలం బీచ్ లో గడపడం కాదు. అక్కడి ప్రకృతిని ఆస్వాదించాలంటే ఎన్నో కొత్త అనుభవాలు ఉన్నాయి. సో వాటిని మిస్ అవ్వకండి.