ఎండలో ఎక్కువ సేపు ఉంటే ఇన్ని సమస్యలా? ప్రాణాంతక వ్యాధి తప్పదంటోన్న నిపుణులు..

First Published | Dec 21, 2024, 3:06 PM IST

మానవుడి జీవితం సజావుగా సాగుతోందంటే దానికి సూర్యుడు కూడా కారణమని తెలిసిందే. సూర్యుడు లేని భూమిని ఊహించుకోవడం కష్టం. అయితే మనుషులు సూర్యకాంతికి ఎక్కువ సేపు ఎక్స్‌పోజ్‌ అయితే ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎక్కువ సమయంలో సూర్యకాంతి పడితే వచ్చే ఆ ఇబ్బందులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

కిరణజన్య సంయోగ క్రియకు సూర్యూడే కారణమని మనం చిన్నప్పుడే చదువుకున్నాం. మన తింటున్న ప్రతీ వస్తువుకు సూర్యుడితో సంబంధం ఉందని తెలిసిందే. అంతెందుకు శరీరంలో కీలక పాత్ర పోషించే విటమిన్‌ డీకి కూడా సూర్యుడు అవసరమని తెలిసిందే. మనిషికి సహజంగా విటమిన్‌ డీ లభించాలంటే కచ్చితంగా కాసేపు ఎండలో నిలబడాలని సూచిస్తుంటారు. అయితే మంచి చేసే ఈ ఎండ ఇబ్బందులకు కూడా కారణమవుతుందని మీకు తెలుసా.? 

సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చర్మ కణజాలంపై నష్టం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఇది క్యాన్సర్‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఎక్కువ సమయం ఎండలో ఉండే వారిలో చర్మ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న వారిలో కుటుంబంలో చర్మ క్యాన్సర్ వచ్చిన వారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 


అంతేకాకుండా ఎండలో ఎక్కువ సేపు ఉండే వారిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎండకు చర్మం కందిపోవడం వల్ల ముడతలు ఏర్పడుతాయని చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఎండలో గంటలతరబడి ఉండేవారిలో చర్మ కణ జాలంలోని డీఎన్‌ఏకు హాని జరుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. కాలక్రమేణ ఇది మ్యూటేషన్‌కు దారి తీసి, క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 
 

ఎండలో ఎక్కువసేపు పనిచేసే వారు కచ్చితంగా పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి వాటిలో మెలినోమా అనే చర్మ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బేసల్ సెల్‌ కార్సినోమా అనే చర్మ క్యాన్స్‌ బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ క్యాన్సర్‌ ముఖ్యంగా పెదవి, ముక్కు, చెవి భుజాలు, చేతులు వంటి ప్రదేశాల్లో ప్రభావం చూపుతుంది. అందుకే ఎండలో ఎక్కువసేపు పనిచేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. సన్‌ లోషన్స్‌తో పాటు స్కార్ఫ్‌లను ఉపయోగించాలని సూచిస్తున్నారు. 

తక్కువైనా ప్రమాదమే..

ఎండలో ఎక్కువగా ఉండడమే కాదు.. తక్కువ ఉన్నా ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు. సహజంగా ఎండకు తగలకుండా ఉంటే శరీరంలో విటమిన్‌ డీ స్థాయి తగ్గుతుందని తెలిసిందే. అయితే విటమిన్‌ డీ లోపం కారణంగా కూడా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని అధ్యయనాలు చబుతున్నాయి. డెన్మార్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించిన తర్వాత ఈ విషయాన్ని తెలిపారు. సుమారు 15 లక్షల మంది నుంచి డేటా సేకరించిన తర్వాత ఈ విషయాన్ని పరిశోధకులు దృవీకరించారు. విటమిన్‌ డీ సమృద్ధిగా ఉండే క్యాన్సర్ రోగులు రోగనిరోధక శక్తి చికిత్సలకు మెరుగ్గా స్పందించే అవకాశం ఉందని మరో పరిశోధనలో తేలింది. ఈ లెక్కన క్యాన్సర్‌ నుంచి త్వరగా కోలుకోవాలంటే కూడా శరీరానికి విటమిన్‌ డి లభించాలన్నమాట. 
 

Latest Videos

click me!