snoring
ఈ రోజుల్లో చాలా మంది గురక పెడుతున్నారు. ఆడవాళ్లు మగవారు అంటూ తేడా లేకుండా గురక పెడుతుంటారు. ఈ గురక వల్ల పక్కన పడుకున్న వారికి నిద్రే ఉండదు. ఇంకేముంది గురక పెట్టేవారిని తిట్టుకుంటుంటారు. కానీ గురక లైట్ తీసుకోవాల్సిన చిన్న సమస్య అయితే కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిజానికి గురక పెట్టేవారికి వారు గురక పెడుతున్నట్టుగా కూడా తెలియదు. చాలా మంది గాఢనిద్రలోకి వెళ్లిన వెంటనే గురక పెట్టడం మొదలుపెడతారు. అంటే ఇది గాఢంగా నిద్రపోవడం వల్లే వచ్చే సమస్య కాదు. ఇది మీకు ప్రమాదకరమైన సమస్య ఉండటాన్ని సూచిస్తుంది.
ఎవ్వరైనా సరే గట్టి గట్టిగా గురక పెడుతుంటే నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇది మీ శరీరాన్ని చాలా ప్రభావితం చేసే స్లీప్ అప్నియా వంటి సమస్యకు సంకేతం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. గురక పెడుతున్నట్టైతే వెంటనే రెండు రకాల టెస్టులు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
గట్టి గట్టిగా గురక పెట్టేవారు ఖచ్చితంగా పల్మనాలజిస్ట్ ను సంప్రదించాలి. అలాగే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా టెస్ట్ ను చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్లీప్ అప్నియా అంటే నిద్రపోతున్నప్పుడు సడెన్ గా శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. దీనివల్ల మీ శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీంతో మీరు గురక పెడతారు.
అయితే ఈ టెస్ట లో మీ మెదడు తరంగాలు, శ్వాస రేటు, ఆక్సిజన్ లెవెల్, హృదయ స్పందన రేటు వంటి మీ శరీరం వివిధ సంకేతాలను పర్యవేక్షిస్తారు. ఈ టెస్ట్ మీకు స్లీప్ అప్నియా సమస్య ఉందో లేదో చెప్తుంది. ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా చికిత్స తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గురక రావడానికి థైరాయిడ్ కూడా ఒక కారణం కావొచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంటే గట్టి గట్టిగా గురక పెడతారు. థైరాయిడ్ సమస్య పెరిగితే స్లీప్ అప్నియా సమస్య కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం వల్ల థైరాయిడ్ వస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపు ఊబకాయం వల్ల థైరాయిడ్ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.