Oil Bath: చలికాలంలో అనేక రకాల వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తిని పెంచేందుకు నూనెతో స్నానం చేయడం మంచిదని చెబుతారు. సిద్ధ వైద్యంలో నువ్వుల నూనెతో చేసే స్నానానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.
కాలం మారుతున్న కొద్దీ శరీరం కూడా మారుతుంది. చలికాలంలో వచ్చే రోగాలను తట్టుకోవడానికి శరీరం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకు ఆహారపరంగా, వ్యాయామపరంగా మనం కూడా శరీరానికి సహకరించాలి. అలాగే సిద్ధ వైద్యంలో నూనె స్నానం రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెబుతోంది. ఇది పురాతన, ప్రభావంతమైన పద్ధతి అని కూడా వివరిస్తుంది. ప్రాచీన కాలంలో స్నానానికి ముందు శరీరానికి నూనెను బాగా పట్టించుకుని.. ఆ తర్వాతే స్నానం చేసేవారు. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాక ఇంద్రియాల్లో కూడా బలోపేతం అవుతాయని అంటారు. భారత ప్రభుత్వ ఆయుష్మాన్ మంత్రిత్వ శాఖ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ఇలా స్నానానికి నూనెను పట్టించి.. ఆ తర్వాత స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరిస్తుంది.
23
సిద్ధవైద్యం అంటే
సిద్ధ వైద్యం అనేది పురాతన సాంప్రదాయ వైద్య విధానం. ఇది ఆయుర్వేదం నుండే ప్రేరణ పొందిందని చెబుతారు. వీటిలోనే నూనెతో చేసే స్నానం కూడా ఒకటి. రోజువారీ జీవితంలో ఈ నూనె స్నానాన్ని కూడా చేర్చుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చు. నూనె స్నానం అంటే ఇంకేదో కాదు నువ్వుల నూనె లేదా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకొని శరీరానికి తలకు బాగా పట్టించాలి. ఒక అరగంట పాటు అలా వదిలేయాలి. అప్పుడు నూనె చర్మంలోకి ఇంకిపోతుంది. అలా ఇంకిపోయాక నూనె చాలా వరకు ఆరిపోతుంది. ఆ తరువాత స్నానం చేయాలి. శరీరానికి పట్టిన నూనె వదలదు కదా అని అనుకోవచ్చు. ఇందుకోసం మీరు పంచకర్పం అనే సాంప్రదాయ మూలికతో తయారు చేసే పొడిని కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ పొడిని చర్మానికి రాసుకుంటే పట్టిన నూనె సులభంగా వదిలేస్తుంది. అలాగే చాలా రిఫ్రెష్ గా కూడా అనిపిస్తుంది.
33
నూనె స్నానంతో లాభాలు
ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ఇలా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో స్నానం చేసేందుకు ప్రయత్నించండి. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అలాగే జలుబు, జ్వరం వంటి అనారోగ్యాలు రాకుండా అడ్డుకుంటుంది. మారుతున్న వాతావరణంలో రోగాలు చాలా త్వరగా వచ్చేస్తాయి. వాటి నుండి రక్షణ పొందాలంటే ఇలాంటి చిట్కాలు పాటించాల్సిందే. ఇలా నూనె స్నానం చేయడం వల్ల కండరాలు, నరాలు కూడా బలంగా మారుతాయి. చర్మం, కళ్ళు వంటి ఇంద్రియాలు ఆరోగ్యంగా ఉంటాయి. నిపుణులు చెబుతున్న ప్రకారం ఆధునిక జీవితంలో ఇలాంటి ఇంటి చిట్కాలను పాటించాల్సిన అవసరం చాలా ఉంది. నాలుగు రోజులకు ఒకసారి మీరు చేయలేకపోతే కనీసం వారానికి ఒక్కసారైనా ఇలా నూనె స్నానం చేయడం అలవాటు చేసుకుంటే మంచిది.
నూనె స్నానం చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. నరాల వ్యవస్థ బలపడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక జీవనశైలిలో ఇలాంటి సంప్రదాయ పద్ధతులను పాటించడం చాలా అవసరం.