పిల్లలు చెప్పిన మాట వినడం లేదని చాలామంది పేరెంట్స్ చెబుతుంటారు. ఇది నిజంగా పిల్లల తప్పేనా? లేక పేరెంట్స్ వారి మనసును అర్థం చేసుకోలేకపోతున్నారా? అసలు పిల్లల ప్రవర్తన ఎందుకు అలా ఉంటుంది? అలాంటి పిల్లల గురించి సైకాలజీ ఏం చెబుతోందో ఇక్కడ తెలుసుకుందాం.
చెప్పిన మాట వినని పిల్లలను చూసినప్పుడు చాలామంది తల్లిదండ్రులు “ వీడు చాలా మొండివాడు”, “మన మాటకు విలువ ఇవ్వడు” అని అనుకుంటారు. కానీ సైకాలజీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలు చెప్పిన మాట వినకపోవడం వెనుక వారి మానసిక ఎదుగుదల, భావోద్వేగ స్థితి, పరిసరాల ప్రభావం వంటి అనేక అంశాలు ఉంటాయి. చిన్న వయసులో ఉన్న పిల్లలు తమ స్వతంత్రతను గుర్తించుకునే దశలో ఉంటారు. ఈ దశలో పెద్దల మాటలకు ఎదురు చెప్పడం లేదా వినకపోవడం సహజమైన ప్రవర్తనగా సైకాలజీ చెప్తోంది.
26
12 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్నవారు
సైకాలజీ ప్రకారం పిల్లల మెదడు పూర్తిగా అభివృద్ధి చెందే వరకు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఆత్మ నియంత్రణ పూర్తిగా ఉండవు. ముఖ్యంగా 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారు భావోద్వేగాలకు ఎక్కువగా లోనవుతారు. ఈ సమయంలో తల్లిదండ్రులు చెప్పే సూచనలు వారికి ఆంక్షలుగా, నియంత్రణగా అనిపించవచ్చు. అందుకే వారు వాటిని తిరస్కరించవచ్చు. ఇది తిరుగుబాటు కాదు, వారి వ్యక్తిత్వ నిర్మాణంలో భాగమని నిపుణులు వివరిస్తున్నారు.
36
గుర్తింపు కోసం
కొన్ని సందర్భాల్లో చెప్పిన మాట వినకపోవడానికి ప్రధాన కారణం భావోద్వేగ అవసరాలు తీరకపోవడమే. తల్లిదండ్రుల నుంచి ప్రేమ, అంగీకారం, సమయం లభించనప్పుడు పిల్లలు వారి దృష్టిని ఆకర్షించేందుకు ఇలా ప్రవర్తించవచ్చు. సైకాలజీ నిపుణుల ప్రకారం పిల్లల ప్రవర్తన ఒక సందేశం లాంటిది. అది సమస్య కాదు, సమస్యను తెలియజేసే సంకేతం. ఆ సంకేతాన్ని అర్థం చేసుకోకుండా కేవలం శిక్షలతో స్పందిస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.
తల్లిదండ్రుల పెంపక శైలి కూడా పిల్లలపై ప్రభావం చూపుతుంది. చాలా కఠినంగా పెంచిన పిల్లలు బాహ్యంగా వినయంగా కనిపించినా, లోపల ఒత్తిడిని దాచుకుంటారు. ఆ ఒత్తిడి ఒక దశలో చెప్పిన మాట వినని ప్రవర్తనగా బయటపడుతుంది. మరోవైపు, అతి స్వేచ్ఛ ఇచ్చిన పెంపకం కూడా పిల్లలకు సరిహద్దులు తెలియకుండా చేస్తుంది. సైకాలజీ నిపుణుల ప్రకారం సమతుల్య పెంపకం మంచిది. అంటే ప్రేమతో పాటు స్పష్టమైన నియమాలు ఉండాలి. శిక్షలకంటే కూడా సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
56
కారణాలు చెప్పడం మంచిది
పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆదేశాలు ఇవ్వడం కన్నా కారణాలు చెప్పడం మంచిది. “ఇది చేయొద్దు అనడం కంటే.. ఇలా చేస్తే, ఇలా జరుగుతుంది” అని వివరించడం వల్ల వారి ఆలోచనా శక్తి పెరుగుతుంది. పిల్లలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి అవకాశం లభిస్తుంది. దానివల్ల పెద్దల మాటను గౌరవించడం నేర్చుకుంటారు. సైకాలజీ ప్రకారం ఇది పిల్లల్లో బాధ్యతా భావాన్ని పెంచుతుంది.
66
తల్లిదండ్రుల ప్రవర్తన
మరో ముఖ్యమైన విషయం ఏమింటంటే తల్లిదండ్రుల ప్రవర్తనను పిల్లలు ఆదర్శంగా తీసుకుంటారు. పేరెంట్స్ ఒకరి మాటకు ఒకరు విలువ ఇవ్వకపోతే, లేదా కోపంగా, అసహనంగా వ్యవహరిస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు తమ ప్రవర్తనను పరిశీలించుకోవడం అవసరం. పిల్లల ప్రవర్తన వెనుక ఉన్న భావాలను గుర్తించి, ప్రేమతో, ఓర్పుతో, అవగాహనతో స్పందించినప్పుడు మాత్రమే నిజమైన మార్పు సాధ్యమవుతుందని సైకాలజీ స్పష్టం చేస్తోంది.