Holiday Depression: సెలవులు వస్తే చాలు ఎంతో మంది ఆనందపడతారు. కానీ కొంతమందికి నరకమే. సెలవుల్లో వచ్చే డిప్రెషన్ వల్ల ఎంతో నరకాన్ని అనుభవిస్తారు. ఈ వ్యాధి గురించి తెలుసుకోండి.
సెలవులు వస్తున్నాయంటే చాలు ఎంతోమంది ఎగిరిగంతేస్తారు. సెలవుల్లో షాపింగ్, ప్రయాణాలు, ప్రత్యేక వంటలు, విందులు, వినోదాలు వంటి విషయాలు గుర్తుకొస్తాయి. అయితే అందరికీ ఇలా ఆనందంగా సాగదు. అమెరికాలోని ప్రముఖ వైద్య సంస్థ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ తాజా రిపోర్టు ప్రకారం పండుగ సెలవులకు ముందు, ఆ తరువాత కాలంలో హాలిడే డిప్రెషన్ వంటివి వచ్చే అవకాశం ఉంది. ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. దీనికి కుటుంబ సమస్యలు, ఆర్థిక భారం, ఒంటరితనం, చేయాల్సిన పనులు ఎక్కువ కావడం, శారీరక అలసట వంటివి కారణమని వైద్యులు చెబుతారు. ఒకటి లేదా రెండు నెలల పాటు జరిగే ఈ కాలంలో చాలా మంది తమ భావోద్వేగాలు స్థిరంగా ఉండకపోవడం వల్ల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఈ రిపోర్టు చెబుతోంది.
24
ఈ లక్షణాలు కనిపిస్తాయి
వైద్యుల చెబుతున్న ప్రకారం పండుగ సెలవుల సమయంలో వచ్చే ఈ ఒత్తిడిని సాధారణ అలసటగా చాలామంది తీసుకుంటారు. కానీ ఇది డిప్రెషన్‌కు కూడా దారితీస్తుంది. నిరంతరం విసిగిపోయినట్టు అనిపించడం, నిద్రలేమి లేదా అధికంగా నిద్రపోవడం, ఆహారపు అలవాట్లు మారిపోవడం, ఏ పనిపట్ల ఆసక్తి లేకపోవడం, చిన్న విషయాలకు కోపం రావడం, నిరాశగా అనిపించడం, ఒంటరితనం ఎక్కువగా అనిపించడం వంటివన్నీ వీటి లక్షణాలుగా చెప్పుకుంటారు. పండుగల సందడిలో అందరి ముందు నవ్వుతూ కనిపించినా, అంతర్గతంగా బాధతో ఒత్తిడి అనుభవించే వారు చాలా మంది ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు దాదాపు రెండు వారాల పాటు కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వారు సూచిస్తున్నారు. లేకపోతే మానసిక ఆరోగ్యం ఘోరంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
34
ఇలా జాగ్రత్తలు తీసుకోండి
వైద్యులు చెబుతున్న ప్రకారం సెలవుల కాలంలో ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం కొన్ని సులభమైన పనులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మొదటగా మీ భావోద్వేగాలను దాచేసుకోకుండా ఉన్నవి ఉన్నట్టు స్వీకరించడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం బాగాలేదు అనే సంగతిని మీరు అంగీకరించే ధైర్యం కలిగి ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులు, నమ్మిన వ్యక్తులతో మాట్లాడటం ఒంటరితనాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ సరైన నిద్ర, తక్కువ మోతాదులోనైనా వ్యాయామం, శరీరానికి మంచి ఆహారం తీసుకోవడం, అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడం శారీరకంగా, మానసికంగా సమతుల్యం కలిగిస్తుంది. ఖర్చులు, సమావేశాలు, ఆన్‌లైన్ షాపింగ్ వంటి వాటిని ముందే ప్రణాళిక చేసుకుంటే చాలా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
పండుగల సమయంలో వచ్చే ఒత్తిడి, డిప్రెషన్‌ను చిన్న సమస్యగా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే సమస్య. కానీ దీన్ని గుర్తించి పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. భావోద్వేగాలు అదుపులో లేకపోవడం, రోజువారీ పనులు చేయాలనిపించకపోవడం, ఏడుపు రావడం, తప్పుడు అలవాట్లకు అలవాటు పడటం వంటి పరిస్థితులు కనిపిస్తే వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలి. ఆలస్యం చేస్తే సమస్య మరింత లోతుగా వెళ్లి వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పండుగ సెలవులు ఆనందాన్ని పంచడానికి వచ్చినా... మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు.