Potato peel: బంగాళాదుంపలు వండేటప్పుడు చాలా మంది పైన పొట్టును లేదా తొక్కను తీసేసి అప్పుడు వండుతారు. నిజానికి బంగాళాదుంపల తొక్కల్లో ఎన్నో పోషకాలు నిండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్ని లాభాలో.
మనం అధికంగా ఉపయోగించే కూరగాయల్లో బంగాళాదుంప ఒకటి. సాధారణంగా బంగాళాదుంపలను వండే ముందు తొక్కలు తీసేసి పారేస్తారు. కానీ పోషక నిపుణుల చెబుతున్న ప్రకారం ఈ తొక్కల్లోశరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు నిండుగా ఉంటాయి. కాబట్టి వాటిని వృథా చేయకుండా వాడితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం బంగాళాదుంపల తొక్కల్లో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. ముఖ్యంగా తొక్కల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
24
అధికరక్తపోటును తగ్గిస్తుంది
బంగాళాదుంప తొక్కల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మనలో మలబద్ధకాన్ని తగ్గించడంలో ప్రయోజనం చేస్తుంది. ఇది మన పొట్టలోని పేగుల పనితీరును సరిచేసి ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీనితో పాటు, ఈ ఫైబర్ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీనివల్ల తక్కువ ఆహారాలు తింటారు. త్వరగా బరువు తగ్గుతారు. అలాగే తొక్కల్లో ఉండే పొటాషియం అధికంగా ఉంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరగి పోతుంది. ఈ తొక్కల్లో ఉండే పొటాషియం.. సోడియం ప్రభావాన్ని తగ్గించి గుండెను కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
34
చర్మంపై మచ్చలు రావు
బంగాళాదుంప తొక్కల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి రక్షణను అందిస్తుంది. చర్మం ప్రకాశవంతంగా కనిపించేందుకు, మచ్చలు తగ్గేందుకు ఇందులో ఉండే విటమిన్ సి సహాయపడుతుంది. కొంతమంది బంగాళాదుంప తొక్కలను ముఖంపై రుద్దితే చర్మం తాజాగా మారుతుందని చెబుతున్నారు. అంతేకాదు, ఈ తొక్కల్లో కాల్షియం, ఐరన్ వంటి ఎముకలకు ఉపయోగపడే ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. పెద్దలు, పిల్లలు, మహిళలు బంగాళాదుంపలను తొక్కతోనే తినడం ఆరోగ్యకరం.
పర్యావరణ కాలుష్యం, ఒత్తిడి వంటివి శరీరంపై ప్రభావం చూపుతాయి. బంగాళాదుంపల తొక్కల్లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు ఈ హానికర ప్రభావాలను తగ్గించి శరీరాన్ని రక్షిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి గుండె సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. అయితే బంగాళాదుంపలను వాడే ముందు బాగా కడిగి శుభ్రం చేయాలి. కావాలంటే ఆర్గానిక్ బంగాళాదుంపలను తొక్కలతోనే ఉడికించి, కాల్చి, లేదా కూరల్లో ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే తొక్కల్లో ఉన్న పోషకాలు అలాగే శరీరానికి అందుతాయి. ఏదిఏమైనా బంగాళాదుంపల తొక్కలు వృథా చేయాల్సినవి కాదు. వీటిని సరిగా వాడితే ఇవి శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.