ఈ ఆకులను మలేషియా, థాయిలాండ్, శ్రీలంక వంటి దేశాలలో ఆహార పదార్థాలకు ప్రత్యేక రుచిని అందించడం కోసం వాడుతుంటారు. ఈ ఆకులలో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి, అందానికి మంచి ఫలితాలను అందిస్తాయని వైద్యులు అంటున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పాండన్ ఆకులు చక్కటి రంగు (Color), రుచిని (Taste) కలిగి ఉంటాయి. సాధారణ బియ్యానికి.. బాస్మతి తరహా రుచిని, సువాసనను అందించడానికి ఈ ఆకులను వంటల్లో ఉపయోగిస్తుంటారు. భారతదేశంలో కరివేపాకును ఎలాగైతే వంటలలో ఉపయోగిస్తారో అదే తరహాలో ఈ పాండన్ ఆకులను వంటలలో తప్పనిసరిగా వాడుతారు.
ఈ ఆకులను చేపలు, చికెన్ వంటి మాంసాహార వంటలలోనే (Non-vegetarian dishes) కాదు.. వీటిని విభిన్నమైన జ్యూస్ లు, స్వీట్లు, డెజర్ట్ ల వంటి వాటికి ప్రత్యేక రుచిని అందించడానికి ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ ఆకులను అన్నపూర్ణ ఆకులు (Annapurna leaves) అని కూడ పిలుస్తారు. తినే ఏ పదార్థానైనా ఈ ఆకులో చుట్టి ఆవిరి మీద ఉడికిస్తే మంచి రుచి వస్తుందంటారు.
ఈ ఆకులలో యాంటీ ఫంగల్ (Antifungal), యాంటీ ఇన్ఫెక్షన్ (Anti-infection) గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులతో తయారు చేసుకునే టీలోని పోషకాలు, ఔషధ గుణాలు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
కాలిన గాయాలకు, చెమట పొక్కులు, దురద వంటి చర్మ సమస్యలకు (Skin problems) పాండన్ ఆకుల రసం మంచి ఔషధంగా (Medicine) పనిచేస్తుంది. వేసవికాలంలో వడదెబ్బ, అతిదాహం వంటి సమస్యల నుంచి ఉపశమనం కోసం ఈ ఆకుల రసాన్ని వేడినీటిలో కలిపి కాస్త ఉప్పు వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ప్రసవానంతరం సమస్యలను తగ్గడానికి బాలింతల కోసం వండే పదార్థాలలో కొద్దిగా ఈ ఆకులను వేస్తే మంచిది. అలాగే స్త్రీలు పురిటి స్నానం చేసే నీళ్లల్లో ఈ ఆకులను వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఈ ఆకులలో ఉండే గుణాలు కీళ్ల నొప్పులు (Arthritis), తలనొప్పి (Headache) వంటి సమస్యలను తగ్గిస్తాయి.
ఈ ఆకులు ఘాటైన సువాసన కలిగి ఉండడంతో క్రిమిసంహారిణిగా (Disinfectant) కూడా సహాయపడతాయి. ఈ ఆకుల రసాన్ని నీళ్ళల్లో కలిపి ఇంటి మూలల్లో చల్లితే బొద్దింకలు, దోమలు, ఈగలు వంటి హానికారక కీటకాలు రాకుండా ఉంటాయి. ఫేస్ ప్యాక్స్ (Face packs) లలో ఈ ఆకుల రసాన్ని కలిపి వాడితే చర్మ నిగారింపు పెరుగుతుంది.
ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి, ఆ పొడిని కొబ్బరినూనెలో కలిపి కుదుళ్లకు బాగా అప్లై చేసుకుని అరగంట తరువాత తలస్నానం చేస్తే ఒత్తయిన కురుల సౌందర్యం మీ సొంతం అవుతుంది. అలాగే ఈ ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మలబద్ధకం (Constipation), అధిక రక్తపోటు, మధుమేహం (Diabetes), నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.