Heart Attack Symptoms: గుండెపోటు.. ఎప్పుడు, ఎవరికీ, ఎలా వస్తుందో ముందుగా చెప్పడం కష్టం. అయితే గుండెపోటు రావడానికి ముందు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఈ చిన్న సంకేతాలే అత్యవసర వైద్యం అవసరం అని సూచించవచ్చు. మరి గుండెపోటు లక్షణాలేంటో తెలుసుకుందామా..
గుండెపోటు అనేది అకస్మాత్తుగా సంభవించే ప్రాణాంతక పరిస్థితి. గుండెకు రక్తాన్ని, ఆక్సిజన్‌ను అందించే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడినప్పుడు గుండె కండరాలకు నష్టం కలగడం మొదలవుతుంది. అయితే గుండెపోటు ఒక్కసారిగా తీవ్రమైన నొప్పితోనే మొదలవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ప్రతి సందర్భంలోనూ అలా ఉండదు. కొందరిలో లక్షణాలు ఒక్కసారిగా తీవ్రంగా కనిపిస్తే, మరికొందరిలో ముందు స్వల్పంగా ప్రారంభమై క్రమంగా పెరగవచ్చు. మరి గుండెపోటు ముందు కనిపించే లక్షణాలేంటో తెలుసుకుందాం.
26
ఛాతీ నొప్పి
గుండెపోటు లక్షణాల్లో ఛాతీ నొప్పి అత్యంత సాధారణమైంది. గుండెపోటు బాధితులపై జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం 68 శాతం మందికి గుండెపోటు రావడానికి ముందే ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఛాతీలో బరువుగా అనిపించడం కూడా గుండెపోటుకు సంకేతమే. శారీరక శ్రమ చేసినప్పుడు ఎక్కువగా ఇలా జరుగుతుంది.
36
గుండె వేగంగా కొట్టుకోవడం
ఒక అధ్యయనం ప్రకారం గుండెపోటు ప్రారంభ లక్షణాలు కనిపించిన వారిలో 42 శాతం మందికి గుండె దడ వచ్చినట్లు తెలుస్తోంది. గుండె చాలా వేగంగా లేదా బలంగా కొట్టుకున్నప్పుడు ఇలా అనిపిస్తుంది. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం కూడా గుండె జబ్బులకు సంకేతం కావచ్చు. నడుస్తున్నప్పుడు, శారీరక శ్రమ చేస్తున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించవచ్చు. ఊపిరితిత్తులకు తగినంత గాలి అందడం లేదనే భావన కలుగుతుంది.
కొన్నిసార్లు తలతిరగడం లేదా తల తేలికైనట్లు అనిపించవచ్చు. గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయకపోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. దానివల్లే తలతిరిగినట్లు అనిపిస్తుంది. ఛాతీలో మంట రావడం కూడా గుండెపోటుకు మరో లక్షణం కావచ్చు. ఇది సేమ్ గ్యాస్ వల్ల వచ్చే మంట లాగే అనిపిస్తుంది. కానీ తరచుగా ఛాతీ నొప్పి లేదా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
56
కడుపులో అసౌకర్యం
కడుపు నొప్పి, అసౌకర్యం, వికారం, వాంతులు కూడా గుండె జబ్బులు లేదా గుండెపోటుకు లక్షణాలు కావచ్చు. ముఖ్యంగా వికారం రావడానికి వేరే స్పష్టమైన కారణం ఏదీ లేనప్పుడు ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఆందోళన(యాంగ్జైటీ) కూడా గుండె జబ్బులు ఉన్నవారిలో తరచుగా కనిపిస్తుంది. ఇది వ్యాధి తీవ్రతను మరింత పెంచుతుంది.
66
సరిగ్గా నిద్ర పట్టకపోవడం
రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడానికి మానసిక ఒత్తిడి లేదా పడుకునే ముందు కెఫిన్ ఉన్న డ్రింక్స్ తాగడం లాంటివి కారణం కావచ్చు. కానీ, ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా నిద్రలేమి సమస్యలు వస్తుంటే అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. అలాగే విపరీతమైన అలసట అనిపించడం మరో ముఖ్యమైన లక్షణం. ఈ తీవ్రమైన అలసట ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్యకు సూచిక కావచ్చు. మీకు ఎప్పుడూ అలసటగా అనిపిస్తూ, దానికి కారణం తెలియకపోతే వెంటనే ఒక డాక్టర్ ని సంప్రదించడం మంచిది.