Saree Store: ఈ షాప్ లో మీరు చీర కొనాలి అంటే ఎన్ని రూల్స్ ఉంటాయో తెలుసా? నచ్చినంతసేపు షాపింగ్ చేయడానికి వీలు లేదు. గంటల తరబడి క్యూలో ఉన్న తర్వాత.. చీర కొనుక్కోవడానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే టైమ్ ఇస్తారు.
షాపింగ్ అనగానే మనకు ఏ గుర్తుకొస్తుంది? మనకు నచ్చిన దుకాణానికి వెళ్లడం, గంటల తరబడి అన్నీ తిరగేయడం, నచ్చినవి ట్రై చేసి మరీ రెండు మూడు జతల చీరలు ఎంపిక చేసుకోవడం. కానీ, బెంగళూరులోని ఫేమస్ KSIC స్టోర్ లో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన సీన్ కనిపిస్తుంది. ఇక్కడ షాపింగ్ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు.. ఏకంగా తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూలో నిలబడాలి. నమ్మశక్యంగా లేకపోయినా ఇది పచ్చి నిజం. సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ఈ స్టోర్ విశేషాలు చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే.
23
అసలు సిసలైన మల్బెరీ పట్టు చీరలు..
ఈ KSIC స్టోర్ స్పెషాలిటీ ఏంటంటే... ఇక్కడ కేవలం స్వచ్ఛమైన, అసలైన మైసూరు మల్బెరీ సిల్క్ చీరలు మాత్రమే అమ్ముతారు. ఎలాంటి కల్తీ లేని స్వచ్ఛమైన పట్టు చీరలు, ఆకర్షణీయమైన జరీ వర్క్‌తో కూడిన మైసూర్ సిల్క్ చీరలను కొనుగోలు చేయడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా మహిళలు ఇక్కడికి తరలివస్తుంటారు.
ఉదయం 3 గంటల నుంచే క్యూ లైన్.. అసలైన మల్బెరీ సిల్క్ చీరలను దక్కించుకోవాలంటే నిద్ర కూడా పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే ఉదయం 9 గంటలకు షాప్ తెరిచే సమయానికే వందలాది మంది మహిళలు అక్కడ బారులు తీరుతారు. క్యూలో నిలబడటం కోసం ఏకంగా తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూలైన్‌లలో ఎదురుచూడటం ఇక్కడ సర్వసాధారణం అయిపోయింది.
33
టోకెన్ సిస్టమ్, కఠినమైన రూల్స్:
ఇక్కడ రద్దీని నియంత్రించడానికి స్టోర్ యాజమాన్యం చాలా కఠినమైన నిబంధనలు పెట్టింది. క్యూలో ఉన్నవారికి టోకెన్లు ఇస్తారు. ఆ టోకెన్ ప్రకారం ఒకరి తర్వాత ఒకరిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అందరూ ఒకేసారి గుంపుగా వెళ్లడానికి అసలు వీలుండదు.
కేవలం 10 నిమిషాలు.. ఒక్కటే చీర! షాప్ లోపలికి వెళ్లిన తర్వాత కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతుంది. షాపింగ్ చేసుకోవడానికి కస్టమర్‌కు ఇచ్చే సమయం కేవలం 10 నిమిషాలు మాత్రమే. ఆ పది నిమిషాల గడువులోపే తనకు నచ్చిన మల్బెరీ సిల్క్ చీరను వేగంగా సెలక్ట్ చేసుకోవాలి. అంతేకాదు, రద్దీని దృష్టిలో ఉంచుకొని ఒక్కో కస్టమర్ కేవలం ఒకటే ఒక చీర కొనుక్కోవడానికి అనుమతిస్తారు. అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి సమయం కూడా ఇవ్వరు.
అన్ని నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ, ఎంతో స్వచ్ఛమైన మల్బెరీ సిల్క్ చీరలు అసలైన నాణ్యతతో దొరుకుతుండటంతో మహిళలు ఇబ్బందులను లెక్కచేయకుండా ఈ KSIC స్టోర్‌కు పోటెత్తుతున్నారు. మరి ఇలాంటి కఠినమైన రూల్స్‌తో కూడిన ఈ షాప్ కి వెళ్లి చీర కొనాలని మీకు అనిపిస్తుందా?