
కాలమిలా... ఆగి పోవాలా ?
కల నిజమై పోవాలా ?
వందేళ్లు !
అదేంటో .. పుట్టినప్పుడే మనిషికి కౌంట్ డౌన్ మొదలై పోతుంది !
వయసు ..
ముందుగా... పెరుగుతుంది .
అటుపై ... మీద పడుతుంది .
కాలం ఆగిపోవడం .. అదేనండి టైం ఫ్రీజ్ అయిపోవడం.. సాధ్యమా ?
సమయం సంకోచం / వ్యాకోచం చెందుతుంది .. అంటే మీరు నమ్ముతారా ?
సైన్స్ లోతుల్లోకి వెళ్లి పాఠాలు చెబితే చాలా మందికి అర్థం కాకపోవచ్చు .
అందుకే అందరికీ అర్థం అయ్యేలా సరళతరం చేసి చెబుతాను .
ఒక వ్యక్తికి 50 ఏళ్ళు .
సమయ వ్యాకోచ పరంగా చూస్తే ఆ వ్యక్తి వయస్సు..
కుజుడుపై .. 26.5 ఏళ్ళు
వరుణుడిపై - కేవలం ఆరు నెలలు
బృహస్పతి పై 4 .2 ఏళ్ళు
శనిగ్రహం పై - 1 .7 ఏళ్ళు .
వినడానికి చిత్రంగా ఉంది కదా !
అవునండీ .. సమయం అనేది విశ్వములో అన్ని చోట్లా ఒకే విధంగా ఉండదు .
అందుకే SPACETIME అనే కాన్సెప్ట్ వచ్చింది.
విశ్వములో కృష్ణ బిలాలు ఉంటాయి.
వాటి సాంద్రత అనంతం .
వాటి గురుత్వాకర్షణ శక్తి కూడా అనంతం .
కృష్ణ బిలాల గుండె భాగాన్ని ఏకత్వం అంటారు.
అక్కడ గురుత్వాకర్షణ ఎంతగా ఉంటుందంటే ఏ వస్తువయినా అక్కడికి వెళితే తిరిగి రాలేదు.
చివరికి కాంతి కూడా అక్కడి నుంచి బయటకు రాలేదు .
ఇక్కడ భౌతిక శాస్త్ర సూత్రాలు వర్తించవు .
దూరం , కాలం అనేవి ఇక్కడ వర్తించవు .
ఉదాహరణకు పైన చెప్పిన ఉదాహరణలో వ్యక్తికి యాభై ఏళ్ళు ..
ఎక్కడ ?
భూమి పైన కదా ?
అదే కృష్ణ బిలం గుండెలో అయితే ?
కృష్ణ బిలంలో ఎంత సమయం గడిస్తే భూమిపై యాభై ఏళ్ళు ?
లక్ష సంవత్సరాలా?
కాదు అంత కన్నా ఎక్కువ .
పోనీ కోటి సంవత్సరాలా?
కాదు అంత కన్నా ఎక్కువ !
మరి ఎన్ని సంవత్సారాలు?
ఆహే.. మనిషి బుద్ధి పోనిచ్చుకొన్నావు కాదు .
ఒకటి రెండు అనే లెక్కలు అక్కడ వర్తించవు .
కోటి.. పదికోట్లు .. కోటి కోట్లు .. ఆలా లెక్కలు వెయ్యొద్దు .
కాలం అక్కడ ఆగిపోయింది.
అక్కడ కోటి కోట్ల సంవత్సరాలు అయినా భూమి పై యాభై సంవత్సరాలకంటే బాగా తక్కువ
అక్కడికి వెళ్ళిపోతే కాలం ఆగిపోయినట్టే ..
మనిషి అమర జీవి అయిపోయినట్టే .
ఎగిరి పొతే ఎంత బాగుంటుంది !!
అమ్మా! .. ఆశ... దోస .. అప్పడం .. మసాలా వడ !
మనిషి అక్కడికి వెళ్ళ లేడు.
ఎందుకు ?
భూమికి అతి దగ్గర లో ఉన్న కృష్ణ బిలం 1560 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది .
పదార్థం కాంతి కంటే వేగంగా పయనించలేదు .
పోనీ కాంతి వేగం తో పయయించినా అక్కడికి చేరుకోవడానికి 1560 సంవత్సరాలు పడుతుంది .
మనిషి జీవిత కాలం వందేళ్లు .
కాబట్టి.. మనిషి అక్కడికి వెళ్లడం సాధ్యం కాదు .
మనకు తెలిసిన సైన్స్ సూత్రాలు కృష్ణ బిలాలకు ముఖ్యంగా వాటి గుండె అనబడే ఏకత్వానికి వర్తించవు అనుకొన్నాము కదా .
కాబట్టి కాసేపు .. సైన్స్ ను పక్కన బెట్టి మతంలోకి పోదాము.
"ఆత్మ నాశనం లేనిది .
నిప్పు కాల్చలేదు .
నీరు తడపలేదు .
అది శాశ్వతం .
పుట్టినవాడు మరణించక తప్పదు .
మరణించినవాడు పుట్టక తప్పదు .
మోక్షం .. అంటే ఆత్మ పరమాత్మ లో ఏకం కావడం .
ఆలా ఏకమయితే అప్పుడు అది అంతం లేని లోకంలోకి పయనం .
సమయం దూరం అనేది అక్కడ వర్తించదు "
ఇది కదా మనం విన్నది .
కాస్త అటు ఇటుగా ఇస్లాం , క్రైస్తవం లో కూడా ఇదే భావన .. స్వర్గం నరకం .. భగవంతునితో ఏకం కావడం .. ఉంది.
కృష్ణ బిలం గుండె ఏకత్వం అంటే... మతాల్లో పేర్కొన్న మోక్ష సాధన అనుకోవచ్చా ?
జన్మ పునర్జన్మ అనే వాటినుంచి విముక్తి పొందిన ఆత్మ కృష్ణ బిలం లోకి పోవడమా?
సైన్స్ ప్రకారం మతాల్లో చెప్పినవి కేవలం ఊహాజనితమయిన అంశాలు .
వాటిని నిరూపించలేము .
కాబట్టి సైంటిఫిక్ అంశం అయిన కృష్ణ బిలాల ఏకత్వాన్ని... మోక్షం స్వర్గం అనే వాటితో పోల్చలేము ,
అది సరే .. "ఇప్పుడున్న సైన్స్ సూత్రాలతో కృష్ణ బిలాల ను అర్థం చేసుకోలేము .. అక్కడ spacetime లాంటి సూత్రాలు వర్తించవు" అన్నారు కదా ?
అవును .
మరెలా?
వాటిని అర్థం చేసుకోవడానికి కొత్త సైన్స్ సూత్రాలు తేవాలి .
"ఏంటో ప్రపంచం . అర్థమయినట్టే ఉంటుంది . తెలుసుకొనే కొద్దీ తికమక ఎక్కువవుతుంది అనుకొంటున్నారా ?"
తెలిసింది గోరంత !
తెలియాల్సింది కొండంత !
కొండ అంటే ఎంత వుంటుంది ?
భూమి పై ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్ .
దాని ఎత్తు- 8848 మీటర్లు .
అదే కుజుడి పై 25 వేల మీటర్లు .
వరుణుడి పై 4 వేల మీటర్లు .
బృహస్పతిపై 10 వేల మీటర్లు .
శని పై 8 వేల మీటర్లు .
మరి ఎవరెస్ట్ కృష్ణ బిలం గుండె అదే ఏకత్వం లో ఉంటే ?
అబ్బా .. ఎన్ని సార్లు చెప్పాలి ?
అక్కడ లెక్కలు .. తొక్కలు వర్తించవు .
అక్కడ ఒక సెంటీమీటర్ ఎత్తు కాదు .. అంత కన్నా బాగా తక్కువ . ఎంత తక్కువ అనేది నేటి సైన్స్ సూత్రాల ప్రకారం చెప్పలేము .