Sleep Habits: ఉదయం లేవగానే ఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉండాలంటే రాత్రిపూట మంచి నిద్ర అవసరం. కానీ, మనం పడుకునే ముందు చేసే కొన్ని తప్పులు మన నిద్రను పాడుచేస్తాయి. మరి పడుకునే ముందు ఏం చేయకూడదు? ఏ పనులు నిద్రకు ఆటంకం కలిగిస్తాయి? వంటి విషయాలు ఇక్కడ చూద్దాం.
రాత్రిపూట పడుకునే ముందు కఠినమైన వ్యాయామాలు చేయడం వల్ల శరీరం ఉత్తేజితమై గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్ర పట్టడం కష్టమవుతుంది. దీంతో విశ్రాంతి సరిగ్గా లభించదు. మంచి నిద్ర కోసం పడుకునే ముందు తేలికపాటి నడక లేదా యోగా చేయడం మంచిది. శరీరం వీలైనంత రిలాక్స్‌గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే హాయిగా నిద్రపడుతుంది.
25
ఫోన్ వాడకం
పడుకునే ముందు ఫోన్ వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కళ్లపై ఒత్తిడిని పెంచి, నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో త్వరగా నిద్ర పట్టదు. ఎక్కువసేపు ఫోన్ చూడడం వల్ల మెదడు చురుకుగా ఉండి విశ్రాంతి లభించదు. మరుసటి రోజు అలసట, ఏకాగ్రత లోపం, చిరాకు వంటి సమస్యలు రావచ్చు. మంచి నిద్ర, మంచి ఆరోగ్యం కోసం పడుకునే కనీసం ఒక గంట ముందు ఫోన్ వాడకాన్ని ఆపాలి. ఆ సమయంలో పుస్తకం చదవడం, ధ్యానం చేయడం లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడడం వంటి మంచి అలవాట్లు పెంచుకోవాలి.
35
మద్యం వద్దు
పడుకునే ముందు ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. కొంతమందికి మద్యం తాగితే వెంటనే నిద్ర వచ్చినట్లు అనిపించినా, అది సహజమైన, నాణ్యమైన నిద్రను దెబ్బతీస్తుంది. రాత్రి మధ్యలో మేల్కొనే అవకాశం పెరుగుతుంది. మరుసటి రోజు అలసట, తలనొప్పి, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా గుండె, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.
పడుకునే ముందు కాఫీ, టీ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగడం మంచిది కాదు. కెఫిన్ మెదడును చురుకుగా ఉంచి నిద్ర పట్టకుండా చేస్తుంది. దీనివల్ల నిద్ర నాణ్యత తగ్గి, రాత్రి మధ్యలో మేల్కొనే అవకాశం పెరుగుతుంది. మరుసటి రోజు అలసట, చిరాకు వంటి సమస్యలు కలగవచ్చు. కెఫిన్ గుండె వేగాన్ని కూడా పెంచవచ్చు. మంచి నిద్ర, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం పడుకునే కనీసం 4 నుంచి 6 గంటల ముందు కెఫిన్ ఉన్న డ్రింక్స్ ని తాగకపోవడం మంచిది.
55
ఆలస్యంగా భోజనం
రాత్రిపూట ఆలస్యంగా లేదా ఎక్కువగా భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహారం సరిగా జీర్ణం కాక అజీర్ణం, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. దీంతో నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. మరుసటి రోజు అసౌకర్యంగా అనిపించవచ్చు. అంతేకాదు బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మంచి జీర్ణక్రియ, ప్రశాంతమైన నిద్ర కోసం పడుకునే కనీసం 2 నుంచి 3 గంటల ముందు రాత్రి భోజనం చేయడం మంచిది. తేలికపాటి, పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.