Who is Sushila Karki: భారీ నిరసనల మధ్య సుశీలా కార్కీ నేపాల్ తొలి మహిళా ప్రధానిగా ప్రమాణం చేశారు. ఆమె నేపాల్ మాజీ చీఫ్ జస్టిస్. విద్యార్థులు, జెన్-జడ్ నేతృత్వంలోని ప్రజా నిరసనలు ప్రస్తుతం తగ్గాయి.
నేపాల్‌లో మూడు రోజుల పాటు కొనసాగిన విద్యార్థులు, జెన్-జడ్ నేతృత్వంలోని ప్రజా నిరసనల అనంతరం చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కార్కీను తాత్కాలిక ప్రధానిగా నియమించారు. మాజీ పీఎం కేపీ శర్మ ఓలి రాజీనామా చేసిన తర్వాత అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, సైన్యాధిపతి అశోక్ రాజ్ సిగ్డెల్‌తో జరిగిన సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు సుశీలా కార్కీ ప్రమాణ స్వీకారం జరిగింది. దీంతో ఆమె నేపాల్ తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు.
25
చీఫ్ జస్టిస్ నుంచి ప్రధాని వరకు సాగిన సుశీలా కార్కీ ప్రయాణం
1952 జూన్ 7న బిరాట్‌నగర్‌లో జన్మించిన సుశీలా కార్కీ, న్యాయవాదిగా 1979లో తన కెరీర్‌ను ప్రారంభించారు. 2009లో సుప్రీంకోర్టు అడ్‌హాక్ జడ్జిగా నియమితులై, 2010లో శాశ్వత న్యాయమూర్తిగా కొనసాగారు. 2016లో చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టి నేపాల్ తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా నిలిచారు. 2017లో నేపాలి కాంగ్రెస్ ఆమెపై ఇంపీచ్‌మెంట్ ప్రక్రియ మొదలుపెట్టడంతో కొంతకాలం సస్పెన్షన్‌లో ఉన్నా, ప్రజా ఒత్తిడితో ఆ చర్యను వెనక్కి తీసుకున్నారు.
35
సుశీలా కార్కీ విద్య, రచనలు
సుశీలా కార్కీ విద్యార్హతలు విశిష్టమైనవి. ఆమె 1972లో మహేంద్ర మోరంగ్ కళాశాల నుంచి బీఏ, 1975లో బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి పాలిటికల్ సైన్స్‌లో పీజీ, 1978లో త్రిభువన్ యూనివర్శిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఆమె న్యాయంపై "న్యాయ" (2018లో ప్రచురించిన ఆత్మకథ), "కారా" (2019లో వెలువడిన నవల) పుస్తకాలను రచించారు. ఈ రచనలు ఆమె ఆలోచనలను, సామాజిక న్యాయం పట్ల కట్టుబాటును ప్రతిబింబిస్తాయి.
చీఫ్ జస్టిస్‌గా ఉన్న సమయంలో సుశీలా కార్కీ అవినీతి వ్యతిరేక పోరాటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జయప్రకాశ్ గుప్త అనే మంత్రిని అవినీతి ఆరోపణలపై శిక్ష విధించే తీర్పు ఆమె ధైర్యాన్ని చూపించింది. అలాగే, జయ బహదూర్ చంద్‌ను పోలీసు చీఫ్‌గా నియమించే ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు కూడా సంచలనంగా మారింది. న్యాయ వ్యవస్థపై రాజకీయ జోక్యాన్ని అడ్డుకోవడంలో ఆమె కఠిన వైఖరి చూపారు.
55
జెన్-జడ్ మద్దతుతో తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపించనున్న సుశీలా కార్కీ
సోషల్ మీడియా నిషేధం, అవినీతి ఆరోపణలతో దేశంలో అశాంతి నెలకొనగా, యువత ఆమెను తాత్కాలిక ప్రధానిగా ముందుకు తెచ్చారు. కుల్మాన్ ఘిసింగ్, బలేంద్ర షా పేర్లు చర్చలో ఉన్నప్పటికీ చివరికి జెన్-జడ్ నిరసనకారులు సుశీలా కార్కీకి మద్దతు తెలిపారు. తాత్కాలిక మంత్రివర్గంతో ఆమె మొదటి సమావేశం శుక్రవారం రాత్రి జరగనుంది. ఈ కేబినెట్ ఫెడరల్ పార్లమెంట్‌తో పాటు ఏడు ప్రావిన్షియల్ పార్లమెంట్‌ల రద్దుపై కూడా సిఫారసు చేసే అవకాశం ఉంది.
నేపాల్‌లో రాజకీయ, ఆర్థిక అస్థిరత కొనసాగుతున్న వేళ సుశీలా కార్కీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం దేశ చరిత్రలో ఒక కీలక మలుపుగా చెప్పవచ్చు. మాజీ చీఫ్ జస్టిస్‌గా ఆమె నిష్పాక్షికత, నిజాయితీ, అవినీతి వ్యతిరేక ధోరణి ప్రజలకు నమ్మకం కలిగిస్తోంది. ఈ తాత్కాలిక ప్రభుత్వం నేపాల్‌ను సుస్థిరత దిశగా నడిపిస్తుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.