Afghanistan Pakistan conflict: ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. వైమానిక, సరిహద్దు దాడులతో వందల మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలు ఎందుకు వచ్చాయి? ప్రస్తుత పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం.
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఘర్షణలు అత్యంత తీవ్రమైన దశకు చేరాయి. ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం సరిహద్దు దాడులు, వైమానిక దాడులు, ఉగ్రవాద శిబిరాలపై పరస్పర ఆరోపణలుగా ఉన్నాయి. అయితే, తాజా వివాదానికి మూలాలు మాత్రం సంవత్సరాలుగా కొనసాగుతున్న తాలిబాన్-సంబంధిత ఉద్రిక్తతలతో ముడిపడి ఉన్నాయి. తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) అనే ఉగ్రవాద సంస్థ ఆఫ్ఘనిస్తాన్ లో ఆశ్రయం పొందిందని పాక్ పేర్కొంటోంది. పాక్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది.
తాజాగా పాకిస్తాన్ సరిహద్దు దాటి ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో వైమానిక దాడులు జరిపింది. ఇవి టీటీపీ దాడులకు ప్రతిస్పందనగా జరిగాయని పాకిస్తాన్ చెప్పింది. ఈ దాడుల్లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌పై దాడికి పాల్పడిన మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఈ చర్యను తమ సార్వభౌమత్వం పై దాడిగా పేర్కొంది.
26
ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య హింస ఎలా మొదలైంది?
గురువారం (అక్టోబర్ 9, 2025న) పాకిస్తాన్ కాబూల్ సహా పలు ఆఫ్ఘనిస్తాన్ నగరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో టీటీపీ నాయకుడు నూర్ వాలి మెహ్సుద్ లక్ష్యంగా ఉన్నాడు, కానీ అతను తప్పించుకున్నాడు.
దీనికి ప్రతిగా శనివారం (అక్టోబర్ 11) రాత్రి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దళాలు భారీ స్థాయి సరిహద్దు దాడులు జరిపి, పాకిస్తాన్ సైనిక స్థావరాలపై కాల్పులు ప్రారంభించాయి. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారనీ, పలు పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ఆఫ్ఘనిస్తాన్ అధికారులు తెలిపారు. 2024–2025 కాలంలో ఇరుదేశాల మధ్య పలు ప్రతిదాడులు జరిగి, ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చాయి.
36
ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?
డ్యూరాండ్ లైన్ వెంబడి తీవ్రమైన కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో పలు ప్రధాన సరిహద్దు మార్గాలు మూతపడ్డాయి. తమ దాడుల్లో 58 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారనీ, 25 సైనిక పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ఆఫ్ఘనిస్తాన్ తెలిపింది. అయితే పాకిస్తాన్ ఈ మరణాలను తోసిపుచ్చి, 200 మంది తాలిబాన్ సైనికులను తాము చంపినట్లు పేర్కొంది.
కాగా, ఈ దాడుల్లో ఇరుదేశాల భూభాగాల్లో చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో పాటు భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ పక్షాలు, ముఖ్యంగా ఖతర్, సౌదీ అరేబియా, రెండు దేశాలను శాంతింపజేయడానికి మధ్యవర్తిత్వం చేస్తున్నాయి.
పాకిస్తాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ దాడులను అనవసరమైన రెచ్చగొట్టే చర్యలుగా అభివర్ణించింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి ఒక ప్రకటనలో.. "మేము బలమైన ప్రతిస్పందన ఇచ్చాము, ఆఫ్ఘనిస్తాన్ స్థావరాలను ధ్వంసం చేశాము" అని పేర్కొన్నారు. తాలిబాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందనీ, ఈ కారణంగానే సరిహద్దు సురక్షితంగా లేదని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.
56
ఈ దాడులపై ఆఫ్ఘనిస్తాన్ వైఖరి ఏమిటి?
ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం తమ చర్యలను పాకిస్తాన్ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా పేర్కొంది. పలు పాకిస్తాన్ పోస్టులను స్వాధీనం చేసుకున్నామనీ, వారి సైనికులను హతమార్చామని తెలిపారు. అయితే పౌరులను కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. “శాంతి ప్రయత్నాలు విఫలమైతే, ఇతర మార్గాలు కూడా ఉన్నాయి” అని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి అన్నారు. ఆఫ్ఘన్ నాయకత్వం సరిహద్దు నియంత్రణ తమ చేతిలో ఉందని, భవిష్యత్తులో ఏ ఉల్లంఘనలకైనా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
66
ఆఫ్ఘనిస్తాన్ vs పాకిస్తాన్ : పరస్పర ఆరోపణలు, రాజకీయ ఉద్దేశాలు
పాకిస్తాన్‌లోని కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా అస్థిరత సృష్టిస్తున్నాయని ఆఫ్ఘనిస్తాన్ అధికారులు ఆరోపించారు. పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక చర్యల పేరుతో ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని అక్కడి మీడియా పేర్కొంటోంది. తాజా వివాదం ఆఫ్ఘనిస్తాన్–పాకిస్తాన్ ఘర్షణ పాత సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద మద్దతు ఆరోపణలు, వైమానిక దాడులు, ప్రతిదాడుల ఫలితంగా చోటుచేసుకుంది.