Nobel Peace Prize: అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ శాంతి బహుమతి 2025 మరియా కొరీనా మచాడోను వరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తనకు నోబెల్ శాంతి పురస్కారం రావాలని విశ్వ ప్రయత్నాలు చేసిన ట్రంప్ ఆశలు గల్లంతలయ్యాయి.
వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం జీవితాంతం పోరాడుతున్న ప్రతిపక్ష నేత మరియా కొరినా మాచాడో 2025 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. ఆమె స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.
25
ప్రజాస్వామ్యం కోసం అంకితమైన జీవిత ప్రయాణం
మరియా కొరినా మాచాడో వెనిజులా ప్రతిపక్షంలో ముఖ్యపాత్ర పోషించారు. నియంతృత్వ పాలన నుంచి ప్రజాస్వామ్య దిశగా దేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా ఆమె వెనుకడుగు వేయలేదు. నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ జోర్గెన్ వాట్నె ఫ్రైడ్నెస్ మాట్లాడుతూ “తీవ్ర పరిస్థితుల్లోనూ స్వేచ్ఛ కోసం నిలబడే వ్యక్తులను గుర్తించడం మానవత్వానికి గౌరవం” అని అన్నారు.
వ్యక్తిగత జీవితం
మరియా కొరినా 1967 అక్టోబర్ 7న వెనిజులా రాజధాని కారకాస్‌లో జన్మించారు. ఆమె తండ్రి హెండ్రిక్ మాచాడో జులోగా వ్యాపారవేత్త, తల్లి కొరినా పారిస్కా ఒక సైకాలజిస్ట్. మరియా ఒక ఇండస్ట్రియల్ ఇంజినీర్, అలాగే మానవ హక్కుల కార్యకర్త. ఆమె ఆండ్రెస్ బెల్లో కాథలిక్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ చదివారు. తరువాత ఇనిస్టిట్యూటో డి ఎస్టూడియోస్ సుపీరియోరెస్ డి అడ్మినిస్ట్రేషన్ (IESA) నుంచి ఫైనాన్స్‌లో మాస్టర్స్ చేశారు.
35
రాజకీయ ప్రయాణం
2002లో మాచాడో “సుమేట్” (Sumate) అనే సంస్థను స్థాపించారు. ఇది ఎన్నికల పర్యవేక్షణ, పౌర హక్కుల పరిరక్షణ కోసం పనిచేసేది. తర్వాత 2013లో ఆమె “వెంటే వెనిజులా” (Vente Venezuela) అనే లిబరల్ రాజకీయ పార్టీని ప్రారంభించి, జాతీయ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. హ్యుగో చావేజ్, నికోలస్ మడురో ప్రభుత్వాల దుర్వినియోగాలను, అవినీతిని ఆమె ధైర్యంగా విమర్శించారు. 2011లో వెనిజులా జాతీయ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె 2014 వరకు పనిచేశారు. కానీ అదే సంవత్సరం జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకు ఆమెను అసెంబ్లీ నుంచి బహిష్కరించారు.
మాచాడో ప్రజాస్వామ్య హక్కుల కోసం చేసిన పోరాటానికి అనేక అంతర్జాతీయ అవార్డులు లభించాయి:
సఖారోవ్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ (2024) – యూరోపియన్ పార్లమెంట్ అందజేసిన ఈ పురస్కారం మాచాడో, ఎడ్ముండో గోంజాలెస్‌లకు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రయత్నాలకు గుర్తింపుగా ఇచ్చారు.
వాక్లావ్ హావెల్ హ్యూమన్ రైట్స్ ప్రైజ్ (2024) – యూరోప్ కౌన్సిల్ అందజేసిన ఈ పురస్కారం అందుకున్న మొదటి లాటిన్ అమెరికన్ నాయకురాలు ఆమె.
55
వెనిజులా అధ్యక్ష ఎన్నికలలో ఆమె పాత్ర
2023లో జరిగిన ప్రతిపక్ష ప్రైమరీ ఎన్నికల్లో మాచాడో 92% ఓట్లతో విజయం సాధించారు. అయితే, 2024 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుండా ప్రభుత్వం ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది. దాంతో ఆమె ఎడ్ముండో గోంజాలెస్ ఉర్రుటియాకు మద్దతు ఇచ్చారు. ఆయన 2024 జూలై 28న జరిగిన ఎన్నికల్లో 70% ఓట్లతో ఘన విజయం సాధించారు. ప్రజాస్వామ్య శక్తులన్నింటినీ ఏకం చేసి విజయానికి నడిపించినందుకు మాచాడోను దేశం లీడర్‌గా చూసింది.