ఫిలిప్పీన్స్ దక్షిణ భాగం మిండనావో ద్వీపం శుక్రవారం తెల్లవారుజామున భారీ భూకంపంతో కుదేలైంది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.6గా నమోదైంది. ఈ ప్రకంపనలతో తీర ప్రాంతాల్లో సునామీ ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర గర్భంలో భూకంప కేంద్రం గుర్తించిన అధికారులు, సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
25
సునామీ ప్రమాద హెచ్చరికలు
హవాయిలోని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకారం, భూకంప కేంద్రం నుంచి 186 మైళ్ల పరిధిలో ప్రమాదకరమైన అలలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఫిలిప్పీన్స్ తీరప్రాంతాల్లో 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడవచ్చని అంచనా వేస్తున్నారు. ఇండోనేషియా, పలావ్ తీరాల్లోనూ అదే ప్రభావం కనిపించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. పసిఫిక్ సముద్ర తీరాల వద్ద ఉన్న గ్రామాలు, రిసార్ట్ ప్రాంతాలు తక్షణమే ఖాళీ చేయాలని ప్రభుత్వ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
35
భవనాలు కంపించడంతో ప్రజల్లో భయాందోళన
ప్రకంపనల తీవ్రతతో అనేక ప్రాంతాల్లో భవనాలు బలంగా కంపించాయి. మనయ్ పట్టణం, టాగమ్ సిటీ, దావో ఓరియంటల్ ప్రాంతాల్లో ప్రజలు రాత్రి వేళ ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. దావో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, సిబ్బంది కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది స్థానిక మీడియా సంస్థలు కొన్ని భవనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నాయి.
ఫిలిప్పీన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సెస్మాలజీ (ఫివోల్క్స్) ప్రకారం, ఈ భూకంపం సముద్రం ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ప్రమాద సూచనల నేపథ్యంలో మధ్య, దక్షిణ ఫిలిప్పీన్స్ తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానిక రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రాణనష్టం వివరాలు అధికారికంగా ప్రకటించలేదు.
55
రెండు వారాల్లో రెండో భారీ భూకంపం
ఇది ఫిలిప్పీన్స్‌ను రెండోసారి తాకిన భారీ ప్రకంపన. రెండు వారాల క్రితం సెబు ప్రాంతంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో 72 మంది మృతి చెందగా, వందల మంది గాయపడ్డారు. ఆ దుర్ఘటన జ్ఞాపకాలు ఇంకా మాయమవకముందే మిండనావోలో మరోసారి భూకంపం సంభవించింది.