Early Wake Up: 10 రోజులపాటు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే ఏమవుతుందో తెలుసా?

Published : Mar 05, 2026, 03:22 PM IST

ఉదయం త్వరగా నిద్రలేవడం చాలామంచి అలవాటని అందరికీ తెలుసు. కానీ చాలామంది ఉదయాన్నే నిద్రలేవడానికి ఇష్టపడరు. రోజూ ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

PREV
15
Early morning routine benefits

ఉదయం త్వరగా లేవడం ఆరోగ్యానికి మంచిదనే మాట మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, మన మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపే ముఖ్యమైన మార్పు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు లేవడం ద్వారా శరీరంలోని బయోలాజికల్ క్లాక్ సమతుల్యంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇది మన నిద్ర, మేల్కొవడం, హార్మోన్ల విడుదల, మెదడు పనితీరు వంటి అనేక అంశాలను నియంత్రిస్తుంది. ఒక వ్యక్తి 10 రోజుల పాటు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే మెదడులో జరిగే మార్పుల గురించి ఇక్కడ చూద్దాం.

25
మానసిక ఆరోగ్యం

మొదటి రెండు, మూడు రోజులు కొంత అలసటగా అనిపించడం సహజం. ఎందుకంటే మెదడు ఇప్పటివరకు అలవాటైన నిద్ర సమయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే మూడో రోజు నుంచి మెదడు కొత్త రొటీన్‌కు అలవాటు పడడం ప్రారంభిస్తుంది. ఉదయం సూర్యరశ్మి శరీరానికి తగలడం వల్ల మెదడులో సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. 

ఇది మన మానసిక స్థితి మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండే అవకాశం పెరుగుతుంది. అంతేకాదు, తెల్లవారుజామున లేవడం వల్ల మెదడుకు ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది. ఆ సమయంలో ఫోకస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. చదువు, ప్లానింగ్స్, క్రియేటివ్ ఆలోచనలు చేయడానికి ఇది ఉత్తమ సమయం.

35
మెదడు పనితీరు

ఆరోగ్య నిపుణుల ప్రకారం ఉదయం త్వరగా లేవడం వల్ల కార్టిసోల్ హార్మోన్ సహజంగా పెరుగుతుంది. ఇది శరీరాన్ని మేల్కొలిపే హార్మోన్‌గా పనిచేస్తుంది. ఈ హార్మోన్ సక్రమంగా విడుదలైతే మెదడు అప్రమత్తంగా పనిచేస్తుంది. అలాగే మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం చురుకుగా మారుతుంది. ఈ భాగం నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించడం, లక్ష్యాలను ప్రణాళిక చేయడం వంటి పనులు చేస్తుంది. కాబట్టి ఉదయం త్వరగా లేవడం అలవాటు చేసుకున్నవారిలో నిర్ణయ సామర్థ్యం, ప్రోడక్టివిటి ఎక్కువగా ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

45
నిద్ర నాణ్యత

10 రోజుల పాటు ఉదయం 5 గంటలకు లేవడం వల్ల త్వరగా నిద్రపోవాలనే భావన కలుగుతుంది. దానివల్ల మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ సమయానికి విడుదల అవుతుంది. ఇది గాఢమైన నిద్రకు సహాయపడుతుంది. మంచి నిద్ర మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

55
ఒత్తిడి తక్కువ

ఉదయం సమయంలో మెదడు అత్యంత స్పష్టతతో పనిచేస్తుంది. దానివల్ల మన ఆలోచనలు కూడా స్పష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. ఉదయం త్వరగా లేచే వ్యక్తుల్లో ఒత్తిడి స్థాయిలు కూడా తక్కువగా ఉండే అవకాశముందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఉదయం 5 గంటలకు లేవడం కోసం ఒక్కసారిగా నిద్ర సమయాన్ని మార్చుకోవడం మంచిది కాదు. ప్రతి రోజు 15 నుంచి 20 నిమిషాలు ముందుగా నిద్రపోయే అలవాటు చేసుకుంటే శరీరం కొత్త సమయానికి సులభంగా అలవాటు పడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories