Snoring: మీ గురక సమస్యతో పక్కన వారు మీపై చిరాకు పడుతున్నారా, దీర్ఘకాల గురకతో మీకు అవస్థలు తప్పడం లేదా? ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు కూడా. సహజ చిట్కాలు, జీవనశైలి మార్పులతో గురకను ఇట్టే క్యూర్ చేయోచ్చు.
ప్రతీదానికీ మందులు అవసరం లేదు.. సహజ చిట్కాలతో నయం చేయోచ్చు
మనలో చాలామందికి గురక సమస్య ఉంటుంది. గాఢనిద్రలో ఉండగా వారికి తెలియకుండానే గురక పెడుతుంటారు. ఇది సాధారణ సమస్యగా కనిపించినా, కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా గురకతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి వైద్యం చేయించుకోవాలని సూచిస్తున్నారు.
గురక పెట్టే వ్యక్తికి తాను గురక పెడుతున్న సంగతి తెలియదు. కానీ పక్కన పడుకున్న వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిద్రకు ఆటంకం కలుగుతుంది. చిరాకుగా అనిపిస్తుంది. ఆయాసం ఉన్నవారికి చలికాలంలో ముక్కుదిబ్బడ, గొంతుమంట, కఫం పెరగడం వల్ల గురక సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 45 శాతం వయసుపైబడ్డ వారిలో ఈ గురక సమస్య కనిపిస్తుంది.
మార్కెట్లో గురకను తగ్గించేందుకు అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజ పద్ధతులు అనుసరించడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ సమస్యను నియంత్రించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పడుకునే విధానం, లైఫ్ స్టైల్....గురకకు కారణాలుగా చెప్పొచ్చు. గురక అదుపులోకి రావాలంటే ఇవి ఫాలో అవ్వండి.
25
పక్కకు తిరిగి పడుకోండి
గురక తగ్గాలంటే ముందుగా నిద్రపోయే విధానం చూసుకోవాలి. వెల్లకిలా పడుకోవడం వల్ల నాలుక, అంగిలి కలిసిపోవడం వల్ల ఊపిరితీసుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది. దానివల్ల గురక ఎక్కువగా వస్తుంది. అందుకే పక్కకు తిరిగి పడుకోవడం మంచిది. అలాగే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. నిద్రలేమి వల్ల గొంతు కండరాలకు ఇబ్బంది కలిగి గురక పెరిగే అవకాశం ఉంది.
35
దిండ్లు శుభ్రంగా ఉంచుకోవాలి
అన్నింటికన్నా ముందు దిండుల పరిశుభ్రత చాలా ముఖ్యం. ఎంతో మంది దిండుల విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. కానీ అది చాలా డేంజర్. దిండుల్లో పేరుకుపోయే దుమ్ము, ధూళి, మృతకణాలు అలెర్జీలు, ముక్కు దిబ్బడకు కారణమవుతాయి. ప్రతి 2 వారాలకు ఒకసారి దిండును ఎండలో ఆరబెట్టడం, దిండు కవర్లు ఉతకాలి. ఆరు నెలలకు ఒకసారి మార్చడం మంచిది. నిద్రపోయేటప్పుడు తల ఎత్తుగా ఉన్నట్లైతే...తేలిగ్గా ఊపిరి పీల్చుకోవచ్చు. అప్పుడు గురక తగ్గుతుంది.
ఇక ఆల్కహాల్, సిగరెట్, చుట్ట, బీడీ కూడా గురకకు ప్రధాన కారణాలే. తాగుడు మానేస్తే చాలా బెటర్. ఒకవేళ కుదరకపోతే కనీసం పడుకునే 3-4 గంటల ముందే తాగకుండా ఉండేలా చూసుకోవాలి. ధూమపానం వల్ల గొంతు, ముక్కులో మంట ఏర్పడి గురక సమస్య తీవ్రమవుతుంది. అలాగే అధిక బరువు, ముఖ్యంగా మెడ చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల శ్వాసపీల్చుకోవడానికి ఇబ్బందిగా మారి గురక వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
55
సహజ చిట్కాలు పాటిస్తే మీకే మంచిది
ఇవే కాకుండా కొన్ని సహజ చిట్కాలు కూడా పాటిస్తే మీకే మంచిది. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ఏలకుల పొడి కలిపి పడుకునే అరగంట ముందు తాగితే గురక క్రమంగా తగ్గుతుంది. అలాగే గ్లాసు వేడి పాలలో రెండు టీస్పూన్ల పసుపు కలిపి నిద్రకు ముందు తాగడం వల్ల గురక నియంత్రణలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గురక అనేది చిన్న సమస్య అని అనుకోవద్దు. అవసరమైతే వైద్య సలహా తీసుకుంటూ, లైఫ్ స్టైల్ మార్చుకుంటే సమస్యను అదుపులోకి తీసుకురావచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గమనిక: ఈ కథనం మీ అవగాహన కోసం మాత్రమే. మీ సమస్య తీవ్రమైతే వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది