వర్షా కాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే జీవన విధానంలో పలు మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో ఒకటి ఇయర్ ఫోన్స్ ఉపయోగించడం. వీటివల్ల చెవి సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
స్మార్ట్ ఫోన్ వినియోగం భారీగా పెరిగింది. గేమింగ్, సినిమాలు చూడడం, పాటలు వినడం ఇలా అన్ని రకాల పనులకు ఫోన్‌నే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారి సంఖ్య సైతం పెరిగింది. ఈ క్రమంలో ఇయర్‌బడ్‌లు, ఇయర్‌ఫోన్‌లు రోజంతా చెవుల్లో పెట్టుకోవడం అలవాటుగా మారింది. కానీ నిపుణుల హెచ్చరిక ఏమిటంటే, వర్షాకాలంలో ఇది చెవులకు తీవ్రమైన హాని కలిగించవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వినికిడి సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
25
తేమ, ధూళి ఇన్ఫెక్షన్‌కు ప్రధాన కారణాలు
వర్షాకాలంలో వాతావరణం తడిగా ఉంటుంది. ఈ తేమ, చెవి లోపల చిక్కుకుని బయటకు రాకపోతే బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా పెరుగుతాయి. వీటికి తోడు వర్షాకాలంలో కాలుష్యంతో కూడిన ధూళి కూడా చెవిలో ఇరుక్కుంటుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్‌లకు దారి తీస్తుంది. తరచూ జలుబు లేదా అలెర్జీలు వచ్చే వారికి చెవి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
35
ఇయర్‌బడ్‌లు ఎందుకు ప్రమాదకరం?
ఇన్-ఇయర్ టైప్ ఇయర్‌బడ్‌లు చెవిలో గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. చెవిలో తేమ బయటకు వెళ్లకపోవడంతో లోపల వేడి, తడి వాతావరణం ఏర్పడుతుంది. ఇది క్రిములు పెరగడానికి అనుకూలంగా మారుతుంది. మరోవైపు, చెవికి పైభాగంలో పెట్టుకునే హెడ్‌ఫోన్‌లు తక్కువ ముప్పుతో ఉంటాయి, ఎందుకంటే అవి పూర్తిగా చెవిని కవర్ చేయవు కాబట్టి. అలాగే చౌకగా దొరికే, నాణ్యత లేని ఇయర్‌ఫోన్‌లు మరింత ప్రమాదకరం. వాటి ప్లాస్టిక్ లేదా రబ్బర్‌లో విషపదార్థాలు (టాక్సిన్స్) ఉండవచ్చు.