
పాప్ కార్న్ లంగ్ !
పాప్ కార్న్ అంటే మొక్క జొన్న బొరుగులు
తెలుగు రాదు . ఇదొక ఖర్మ
లంగ్స్ అంటే ఊపిరి తిత్తులు!
మరి పాప్ కార్న్ లంగ్స్ అంటే ఏంటి ?
ఇదొక ప్రాణాంతక వ్యాధి .
దీని అసలు పేరు బ్రాంకైటిస్ ఓబిలిటేరన్స్ .
కొన్ని లక్షల మంది పిల్లలు నేడు ఈ వ్యాధితో సతమతమవుతున్నారు .
సినిమా థియేటర్లలో... మాల్స్ లో.. మైక్రోవేవ్ పాప్ కార్న్ కొన్నారా?
దానికి బట్టర్ ఫ్లేవర్ { వెన్నె రుచి } ఉంటే పిల్లలు లొట్టలేస్తూ ఎంజాయ్ చేసివుంటారు.
ఆ వెన్నె రుచి ఎలా వచ్చింది? అని మనం అడగం.
ఎవరూ చెప్పరు.
అదొక కృతిమ రుచి.
ఆ రుచి రావడానికి డిఐసిటిల్ రసాయనాన్ని వాడుతారు .
ఇది ముఖ్యంగా పిల్లల్లో బ్రాంకటైస్ ను కలిగిస్తుంది .
పాప్ కార్న్ తినడం వల్ల వచ్చింది కాబట్టి డాక్టర్స్ దీనికి పాప్ కార్న్ లంగ్స్ అని పేరు పెట్టారు.
లక్షల్లో ఖర్చు .
ప్రాణం పోవచ్చు.
ఫ్లేవర్డ్ కాఫీలో, మరికొన్ని రకాల ప్రొసెస్డ్ ఫుడ్స్ లో ఇదే డిఎసిటైల్ వాడుతారు .
ఇది పెద్దలపై తక్కువ ప్రభావం చూపుతుంది. కానీ పిల్లలు తట్టుకోలేరు.
ప్రకృతి ... ఎన్నో రకాల రంగుల్ని రుచుల్ని మనకు అందించింది. దాన్ని ఎంజాయ్ చెయ్యడం సహజం.. అదే న్యాయం.
కృతిమ రంగులు .. కృతిమ రుచులకు మనం అలవాటు పడి... పిల్లల్ని అలవాటు చేస్తే?
కనీసం ఆ కృత్రిమ రంగు... రుచి ఎలా వచ్చి చచ్చింది? అని తెలుసుకొనే ప్రయత్నం చేయకపోతే ?
కృతిమ రంగు, రుచి... నీ ఆస్తిని కాజెయ్యడానికి ఫార్మసురుడు నీకు ముఖ్యంగా నీ పిల్లలకు వేసే గాలెం.
చిక్కారా .. చచ్చారే !
1 . అస్పర్టమ్ !
డైట్ కోక్.. డైట్ పెప్సీ .. షుగర్ ఫ్రీ గమ్... లో క్యాలోరీ డెసెర్ట్ .. కొన్ని దగ్గు మందులలో వాడుతారు
{ ముందు ఇది చెప్పండి.. కప్ సిరప్ తో దగ్గు తగ్గించుకున్నోళ్ళు ఉన్నారా?}.
అస్పర్టమ్ వల్ల తలనొప్పి, ఫిట్స్, ఎలర్జీ , కాన్సర్ వచ్చే ప్రమాదం.
2. సుక్రాలోస!
బఫెట్ డిన్నర్లలో.. షుగర్ ఫ్రీ ఐస్ క్రీం... షుగర్ ఫ్రీ స్వీట్ అనగానే ఎగబడి తింటారు చాలామంది.
సుక్రాలోస్ వాడడం వల్ల దానికి ఆ తీపి వచ్చింది.
ఇది గట్ హెల్త్ ను దెబ్బ తీస్తుంది.
డయాబెటిస్ వుంది కదా.. షుగర్ ఫ్రీ తింటే ఏమి కాదు అనుకొంటారు
సరిగ్గా అక్కడే ఇది దెబ్బ వేస్తుంది.
బ్లడ్ షుగర్ కంట్రోల్ తప్పేలా చేస్తుంది.
3. టార్ట్రజిన్ !
"మా వాడు మహా చురుకు .. మహా యాక్టివ్" అని కొంతమంది పేరెంట్స్ మురిసి పోతుంటారు.
రోగానికి... తెలివికి.. తేడా తెలియని అజ్ఞానం అది.
నేడు కొన్ని లక్షల మంది పిల్లలలు హైపర్ ఆక్టివిటీతో బాధపడుతున్నారు.
నింపాదిగా 2-3 నిముషాలు కూర్చోలేరు.
ఒకేసారి రెండుమూడు పనులు చేస్తారు.
కారణం టార్ట్రజిన్.
దీన్ని మౌంటెన్ డ్యూ డ్రింక్స్ లో... కొన్ని రకాల కాండీస్ లో... ప్రొసెస్డ్ ఫుడ్స్ లో వాడుతారు.
4. రెడ్ -40 :
ఫాంటా లాంటి సాఫ్ట్ డ్రింక్స్ లో.. అనేక రకాల కాండీస్ లో... కాస్మెటిక్స్ లో వాడుతారు.
ఇది కూడా హైపర్ ఆక్టివిటీకి కారణం కావొచ్చు.
అలాగే కాన్సర్ కు కూడా .
5. సోడియం నైట్రిట్, BHA (Butylated Hydroxyanisole)
ఆహారాన్ని నిల్వ చేయడానికి వాడుతారు .
కాన్సర్ కు ... హార్మోన్ సమస్యల కు ఇవి కారణం కావొచ్చు .
ఈ కాలం పిల్లలు పాపకార్న్, కాండీస్, ఫాస్ట్ ఫుడ్స్ తినకుండా ఎలా బతకాలి?
ముందుగా ఒక విషయం తెలుసుకోండి.
ఈ కాలం పిల్లలు... ఆ కాలం పిల్లలు అంటూ.. వేరువేరుగా ఉండరు. వెయ్యేండ్ల క్రితం పుట్టిన పిల్లయినా…... మరో వెయ్యేళ్ళ తరువాత పుట్టే పిల్లయినా..శరీర ధర్మాలు ఒక్కటే…ఈ సత్యాన్ని మరిస్తే అధోగతే .
ఇంట్లో పాపకార్న్ చేసి తింటే సమస్య ఉండదు.
సమస్య కృత్రిమ రంగులు, రుచులతోనే... ఆహారం చెడిపోకుండా వాడే రసాయనాలతోనే.
రసాయనాలు తింటారా? తింటే బతక గలుగుతారా?
1 . బీట్ రూట్
పింక్/ రెడ్ కలర్ లో ఉంటుంది .
సలాడ్స్ లో, జ్యూసుల్లో, ఐస్ క్రీమ్స్ స్వీట్స్ లో వాడుకోవచ్చు .
2 . పసుపు
పసుపు ఏ రంగు లో ఉంటుంది? అని మీ పిల్లల్ని ఒక సారి అడగండి .
సాంబార్... కర్రీ లలో వాడేవారు.
ఇప్పుడు స్విగ్గి/ జొమాటో కాలం కదా .
ఇంకా ఇంట్లో వంట ఎక్కడ?
అంతా పెంటే!
అన్నట్లు ఇంట్లో వంట అంటే.. ఆడాళ్లే చెయ్యాలా ?
మగమహా రాయిళ్ళు చేయకూడదా ?
చేస్తే తల వేయి ముక్కలు అయిపోతుందా ఏంటి ?
3 . పాలకూర
గ్రీన్ కలర్ .
సలాడ్స్ .. స్మూతీస్ కు గ్రీన్ కలర్ రావడానికి వాడొచ్చు .
4. బ్లూ బెర్రీస్
పురపుల్ కలర్... డెసెర్ట్ .. స్మూతీస్ లో వాడొచ్చు .
5. క్యారెట్స్.
వంటకాలకు ఆరెంజ్ రంగు కోసం .
6. దానిమ్మ
రెడ్డు రెడ్డు... రెడ్డే రెడ్డు .. చిరంజీవి పాట గుర్తుందా ?
సలాడ్స్ జ్యూసులు స్వీట్స్ లో వాడొచ్చు .
పైవన్నీ ఆహారానికి సహజ రంగులు.
ఇప్పుడు సహజ రుచుల పరిచయం ..
కృత్రిమ రసాయన రుచులకు అలవాటు పడిన నాలుకలు … వీటిని ఎంజాయ్ చెయ్యడానికి కాస్త టైం పడుతుంది .
1. అసలు... తేనే
దొరకడం కష్టం .
మార్కెట్ లో దొరికేది దొంగ తేనెలు మాత్రమే .
తేనే ఉంటుంది చూడు..
అర చేతిలో పోసుకొని... సిగ్గుపడకుండా .. సిగ్గులేకుండా... నాకాలి.
నా సామీ రంగా .. తియ్యగా.. తియ్యతియ్యగా ..
2. నిమ్మ
పుల్లగా ..
ఫుల్లుగా సి విటమిన్ ను అందిస్తుంది .
రసాయన రుచులతో నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్ .
అదే సహజ రుచులలో పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ .
ఒకటి ఫుడ్ మాఫియా చేసింది .
రెండు దేవుడు / ప్రకృతి.
అదీ తేడా .
3. మిరియాలు
ఘాటు .. కారం..
జలుబు దగ్గు చేసినప్పుడు కాస్త మిరియాలు అల్లం వేసి కషాయం తాగితే దెబ్బకు దిగిపోతుంది
కప్ సిరప్ తాగితే నిద్ర తప్పించి ఇంకేదైనా ప్రయోజనం ఉంటుందా?
4. పుట్టగొడుగులు
ఎన్నో ఏళ్ళ క్రితమే బతుకు పయనంలో ఊరికి దూరం అయ్యాను .
ఆ టేస్ట్ పోయింది .
వానాకాలంలో రకరకాల పుట్టగొడుగులు .
నేయి పుట్టగొడుగులు అని దొరికేవి .
తింటే స్వచ్చమయిన ఆవునెయ్యి తిన్నట్టే.
ఏవి తల్లి నిరుడు కురిసిన హిమసమూహములు ?
5. చింత కాయ
ఒక రాయి తీసుకొని చింత కాయ ను కొట్టి దాన్ని ఒక బండపై దంచి కాస్త కళ్ళు ఉప్పు వేసి తింటే ఉంటుంది చూడు.
చింత కాయలు .. సీమ చింత కాయలు ..
నేరేడు ..
జామ..
పచ్చి మామిడి ..
అదేంటో చెట్టు నుంచి తెంపి తింటే వుండే టేస్ట్ వేరు .. మార్కెట్ లో కొంటే ఆ టేస్ట్ ఎక్కడ?
చిలక కొట్టిన దోర మామిడి..
దానికి ఎలా తెలుస్తుందో .. చెట్టు పై వంద మామిడి కాయలుంటే శాస్త్రవేత లాగా ఖచ్చితంగా మహా తీయగా వున్నదాన్నే వెదికి పట్టుకొని .. కాస్త తిని .. మిగతా .. "పిల్లలూ .. తినండి ".. అని వదిలిపోతుంది. ఎమ్మా చిలకమ్మా ! నేటి పిల్లలకు ఏవమ్మా.. ఆ రుచులు?
రేగు ..
కళింపళ్ళు ..
తాటి కాయ స్ప్రౌర్ట్స్ ..
సీతాఫలం .. రామ ఫలం ..
చెరుకు ..
పొలం లో బెల్లం పొయ్యి వద్ద వేడి వేడి బెల్లం పాకం ..
పొలాల్లో ఇవన్నీ తిని బతికిన ఆనాటి బాల్యానికి ..
మాల్స్ లో మల్టిఫ్లెక్ లలో..
కృతిమ రుచులు రసాయనాలు తింటూ బతికే
... నేటి బాల్యానికి పోలిక ఎక్కడ?
పెద్దల అజ్ఞానానికి పిల్లలు బలికావాల్సిందేనా?
సున్నుండలు .. గారే ఉండలు .. చిక్కీలు .. మురుకులు .. బొరుగులు .. పుట్నాలు .. తాటి బెల్లం .. కనీసం వీటిని డైనింగ్ టేబుల్ పై పెట్టి పిల్లలకు అసలయిన రుచుల ప్రయాణాన్ని మొదలెట్టలేరా ?
మనసుంటే మార్గమే లేదా ?
ఎవర్ని ఎవరు మోసం చేస్తున్నారు ?
పిల్లల్ని ప్రేమించే ప్రతి తల్లితండ్రి ఆలోచించాలి .
కృతిమ విషం నుండి ..
.. సహజ సిద్ధ రంగులు రుచుల వైపు..
.. నేడే పయనం మొదలు కావాలి .
నేడు కాకపోతే ఇంకెప్పుడు?