
చాలామందికి నిద్ర సమస్యలు ఎదురవుతున్నాయి. బిజీ లైఫ్‌స్టైల్, మానసిక ఒత్తిడి, స్క్రీన్ టైమ్ అధికంగా కారణంగా రాత్రిపూట బెడ్ మీదకి చేరినప్పటికీ గంటల పాటు నిద్ర రాదు. అలాంటి పరిస్థితుల్లో అమెరికా సైన్యంలో వాడే ప్రత్యేకమైన నిద్ర టెక్నిక్ చాలా మందికి ఉపశమనం ఇస్తోంది. దీనిపేరు 'మిలిటరీ టిక్'. దీని ద్వారా కేవలం రెండు నిమిషాల్లో నిద్రలోకి జారుకోవచ్చని శాస్త్రీయంగా నిరూపించారు.
ఈ టెక్నిక్‌ను మొదటిగా ఉపయోగించింది అమెరికన్ ఆర్మీ. ఫిజికల్, మానసిక ఒత్తిడిలో ఉన్న సైనికులకు ఎలాగైనా త్వరగా నిద్ర రావాలన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ పద్ధతి 1940ల సమయంలో అమెరికన్ నేవీ పైలట్ల కోసం అభివృద్ధి చేశారు.ఈ టెక్నిక్ వర్క్ అవ్వాలంటే కొన్ని రోజులపాటు ప్రాక్టీస్ చేయాలి. 6 వారాలపాటు ప్రతి రోజు దీనిని ప్రాక్టీస్ చేసిన 96 శాతం మందికి ఇది ఫలితాన్నిచ్చింది. ముఖ్యంగా రద్దీగా ఉండే వార్ జోన్‌ల్లో, బహిరంగ ప్రదేశాల్లో కూడా నిద్ర రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని చాలా మంది చెప్పారు.
ఈ టెక్నిక్‌లో నాలుగు ముఖ్యమైన దశలు ఉంటాయి. ఒక్కో దశలో శరీర భాగాలను పూర్తిగా రిలాక్స్ చేయాలి. మానసిక స్థితిని కూడా రిలాక్స్ అయ్యేలా దృష్టి పెట్టాలి.
ముందుగా ముఖాన్ని పూర్తిగా ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. కళ్లు, నాలుక, పెదవులు అన్నీ ఒక సడలింపు స్థితిలోకి తీసుకెళ్లాలి. ముక్కు, నోటి భాగంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
రెండవ దశ:
ఇప్పుడు భుజాలు, చేతులు ప్రశాంతంగా ఉంచాలి. రెండు చేతులను ఫ్రీగా పెట్టి, భుజాలు బెడ్డు కి సమాంతరంగా ఉంచాలి. నెమ్మదిగా మణికట్టల నుంచి వేళ్ల వరకు పూర్తిగా రిలాక్స్ అవ్వాలి.
తర్వాత శరీరంలోని కాళ్లను శాంతపరిచే దశ. తొడల నుంచి వేళ్ల వరకు ఒక్కొక్క భాగాన్ని విడిగా విడిగా రిలాక్స్ చేయాలి. శరీరంపై ఉండే ఒత్తిడి మెల్లగా తొలగిపోతూ ఉంటుంది.
చివరి దశ:
ఇప్పుడు మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా చేయాలి. కొన్ని సెకన్ల పాటు “ఏదైనా వాహనంలో పడుకొని నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్నాం” అన్నట్టుగా ఊహించాలి. లేకపోతే “నాలో ఏ ఆలోచన లేదు... నాలో ఏ ఆలోచన లేదు...” అని పదే పదే తలలో అనుకోవచ్చు. ఈ తరహా మానసిక స్థితిలో 10 సెకన్ల పాటు ఉంటే మైండ్ పూర్తిగా రిలాక్స్ అవుతుంది.
ఈ టెక్నిక్‌ను ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల నిద్రలోకి త్వరగా వెళ్లే సామర్థ్యం మెరుగవుతుంది. మొదటి రోజుల్లో ఇది అంతగా ఫలితం ఇవ్వకపోయినా, క్రమంగా మైండ్ ట్రెయిన్ అవుతుంది. 2 నిమిషాల్లో కళ్లుమూసేంత వరకు ఈ పద్ధతిని ప్రాక్టీస్ చేయాలి.
ఈ టెక్నిక్‌లో శరీర భాగాలను విడిగా రిలాక్స్ చేయడం వల్ల నాడీ వ్యవస్థ శాంతిస్తుంది. అదేవిధంగా, మనసులో ఉండే ఆలోచనల ప్రవాహాన్ని నిలిపివేసే ప్రయత్నం వల్ల బ్రెయిన్ అలర్ట్ మోడ్ నుంచి రిలాక్స్ మోడ్‌కి మారుతుంది. ఇది నిద్రకు అవసరమైన స్థితికి తేలికగా తీసుకెళ్తుంది.
ఈ టెక్నిక్‌ను ఎవరైనా ప్రయత్నించవచ్చా?
ఈ పద్ధతి ఆరోగ్యవంతమైనది. మందులు అవసరం లేకుండా నిద్రకు సహాయం చేయడమే దీని ప్రత్యేకత. కానీ ఎప్పుడూ గాఢ నిద్ర రావడం లేదంటే ఒకసారి నిద్ర నిపుణుడిని సంప్రదించడం మంచిది.