
మనిషికి ఉన్న అతి పెద్ద,ఘోరమైన జబ్బు ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా ఒంటరి తనమే. ఈ ఒంటరి తనం మనల్ని డిప్రెషన్ లోకి తీసుకుపోతుంది. కానీ ఇప్పుడు ఒక తాజా అంతర్జాతీయ అధ్యయనం ఏకంగా దీని ప్రభావం ఆరోగ్యం మీద కూడా తీవ్ర ప్రభావితం చేస్తుందని వివరించింది. మధుమేహం అనేది మనిషి ఒంటరి తనం వల్ల బాగా పెరుగుతుందని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
వెస్ట్రన్ అంటారియో యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొందరు ఒంటరిగా నివసించే వారి మీద పరిశోధనలు చేపట్టారు. ఇందులో 50 ఏళ్లు పైబడిన దాదాపు 4000 మంది అమెరికన్లపై పలు సంవత్సరాలపాటు అధ్యయనం చేశారు.ఈ అధ్యయనంలో ఏం తెలిసిందంటే...
ఒంటరితనాన్ని ఎక్కువగా అనుభవించే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం సాధారణంగా ఉండే వారితో పోలిస్తే సగటున 34 శాతం ఎక్కువగా ఉంది. ఇంకా, ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారిలో ఒంటరితనంతో బాధపడేవారు తమ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో 75 శాతం ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా పరిశోధనలో తెలిసింది.
ఇది చిన్న విషయంగా తీసుకోవడం సరికాదు. మన దేశం ఇప్పటికే ‘డయాబెటిస్ రాజధాని’గా పేరుగాంచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరితనం వల్ల కూడా ఈ వ్యాధి బలపడుతోందంటే ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి మన శరీర ఆరోగ్యానికి మానసిక స్థితి ప్రభావం చాలా ఉంటుంది. ఒంటరితనంలో ఉండే వారు తరచూ మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఇది నిద్రలేమి, భోజన అలవాట్లలో మార్పులు, జీర్ణకోశం మీద ఒత్తిడి, రోగనిరోధక శక్తి తగ్గింపు వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ సమష్టి ప్రభావం రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో పెట్టడం కష్టంగా చేస్తుంది.
సమాజంతో లేదా కుటుంబంతో మన సంబంధాలు బలంగా ఉంటే, మన ఆరోగ్యం కూడా అంతే బలంగా ఉంటుంది. ఉదాహరణకు, ఎవరికైనా రోజుకి కనీసం ఒకసారి అయినా ఇతరులతో కలిసి తినే అవకాశం ఉంటే, ఒంటరితనం తగ్గిపోతుంది. ఇది తినే అలవాట్లపైనా, ఎమోషనల్ హెల్త్ పైన కూడా ప్రభావం చూపుతుంది.
ఇంకా, ఇంట్లో పెంపుడు జంతువులు పెంచుకోవడం కూడా ఒంటరితనాన్ని గణనీయంగా తగ్గించగలదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటి తోడు మనకు మానసికంగా తృప్తిగా అనిస్తుంది. వాటితో ఆడటం, వాటిని చూసుకోవడం వల్ల మనకు ఒంటరితనం అనే భావన నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
ఒక వ్యక్తిగా మనకు ఇష్టమైన వ్యక్తులతో రోజులో కొన్ని నిమిషాలు మాట్లాడే అలవాటు ఉంటే, అది మన బీపీకి మందులా పనిచేస్తుంది. మానసిక స్థితి మెరుగై ఆరోగ్యానికి ఉపకరిస్తుంది.ఒంటరితనాన్ని దూరం పెట్టడంలో మరో బెస్ట్ వే ఏమైనా ఉంది అంటే అది కొత్తగా ఏదైనా నేర్చుకోవడం. అది వంటకమే అయినా సరే, కొత్తగా నేర్చుకోవడం మన మెదడును చురుగ్గా ఉంచుతుంది. ముఖ్యంగా, కొత్త నైపుణ్యాలు నేర్చుకునే సందర్భాల్లో ఇతరులతో మానవ సంబంధాలు ఏర్పడతాయి. ఇది ఒంటరితనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ అధ్యయనం చివరగా చెప్పిన విషయం మరింత ఆందోళన కలిగించేదిగా ఉంది. తరచూ ఒంటరిగా ఉంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు 36 శాతం ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఇది ఒక రెండు గంటల వాక్ చేయడం కంటే గణనీయమైన ఆరోగ్య మార్పు అని చెప్పవచ్చు.ఒంటరితనాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. మానవ సంబంధాలు, ఎమోషనల్ కనెక్షన్లు కూడా మన ఆరోగ్యంలో భాగమే. మనం కేవలం ఫిజికల్ హెల్త్‌కే ఫోకస్ కాకుండా, మన మానసిక ఆరోగ్యాన్ని సైతం సమానంగా గౌరవించాలి
ఈ అధ్యయనం ఒక స్పష్టమైన హెచ్చరిక. ఒంటరితనం కేవలం మనసుకు కాదు, మన శరీరానికి కూడా ముప్పుగా మారుతోంది. మానవ సంబంధాల్ని గౌరవించడం, సమాజంతో అనుబంధం పెంచుకోవడం — ఇవే డయాబెటిస్ లాంటి వ్యాధుల నుంచి మనల్ని కాపాడగల అత్యుత్తమ మందులు కావచ్చు