వాకింగ్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం, సాయంత్రం కాసేపు వాకింగ్ చేస్తే.. ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అయితే వాకింగ్ చేసేటప్పుడు సాధారణంగా శరీరం కొంత శక్తిని కోల్పోతుంది. శారీరక శ్రమ వల్ల చెమట కూడా పడుతుంది.
వాకింగ్ తర్వాత వాటర్ ఎందుకు తాగాలి?
నడక పూర్తయిన తర్వాత నీళ్లు తాగమని నిపుణులు చెబుతున్నారు. చెమట ద్వారా శరీరం నుంచి పోయిన నీటిని తిరిగి అందివ్వడానికి వాటర్ తాగాలని వారు సూచిస్తున్నారు.
తగినంత నీళ్లు తాగకపోతే?
శరీర కండరాల పనితీరు, శక్తి స్థాయిలు, సాధారణ పునరుద్ధరణ కోసం తగినంత నీరు అవసరం. ఇందుకోసం నడక తర్వాత నెమ్మదిగా నీళ్లు తాగండి. తగినంత నీళ్లు తాగకపోతే తలనొప్పి, కళ్లు తిరగడం, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
వాకింగ్ తర్వాత ఎన్ని నీళ్లు తాగచ్చు?
నడిచిన తర్వాత నీళ్లు తాగితే శరీరం మళ్లీ శక్తి పొందుతుంది. దానికోసం లీటర్ల కొద్దీ తాగాల్సిన అవసరం లేదు. చెమట ద్వారా పోయినంత నీటిని తిరిగి శరీరానికి అందిస్తే చాలు. నిద్ర లేవగానే నీళ్లు తాగడం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు మంచి మార్గం. నడక నుంచి వచ్చాక 450 నుంచి 500 ml నీళ్లు తాగొచ్చు.
దాహం వేస్తేనే కాదు..
నడక నుంచి వచ్చాక దాహం వేస్తేనే నీళ్లు తాగాలని అనుకోకుండా ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే మెదడు రోజంతా తాజాగా ఉంటుంది. నడిచే సమయంలో గొంతు తడవడానికి కొద్దిగా నీళ్లు తాగొచ్చు.
శరీరం హైడ్రేటెడ్ గా..
నడక పూర్తయిన తర్వాత శరీరానికి అవసరమైన నీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా ముఖ్యం. దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి రోజుకి 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.