ఎవరైనా సరే ఏదైనా కొత్త వ్యాయామం మొదలుపెట్టిన వెంటనే దాని ఫలితాలు రావాలని కోరుకుంటారు. రిజల్ట్స్ కనబడకపోతే నిరాశకు గురవుతారు. అసలు వ్యాయామం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు రిజల్ట్స్ కనబడతాయో ఇక్కడ తెలుసుకుందాం.
ఎప్పుడు తెలుస్తుంది?
కొత్త వ్యాయామం వల్ల ఎంత త్వరగా మార్పులు తెలుస్తాయనేది వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. వ్యాయామం రకం, ఎంత రెగ్యులర్‌గా చేస్తారనే దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ప్రధానంగా ఇందులో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. వ్యాయామం చేసేవాళ్లు కనీసం 2 నుంచి 4 వారాల వరకు కంటిన్యూగా చేస్తే మార్పులు తెలుస్తాయి. కొంతమందికి 6 నుంచి 12 వారాల తర్వాత మార్పులు కనిపిస్తాయి. మధ్యలో ప్రయత్నం ఆపకూడదు. కంటిన్యూగా చేస్తేనే అనుకున్న ఫలితం వస్తుంది.
లేట్ అవ్వడానికి కారణం
ఒక వ్యక్తి వయస్సు, జెండర్, జీవక్రియ లాంటి చాలా కారణాలు వ్యాయామం ఫలితాలను నిర్ణయించడంలో పాత్ర పోషిస్తాయి. ఆడవాళ్లలో మగవాళ్ల కంటే జీవక్రియ తక్కువగా ఉంటుంది. అందుకే మగవాళ్లలో తొందరగా మార్పులు వస్తాయి. మగవాళ్ల బాడీకి ఒక రోజుకి కావల్సిన శక్తి ఆడవాళ్ల కంటే ఎక్కువ. మగవాళ్ల బాడీ స్ట్రక్చర్ ఆడవాళ్ల కంటే వేరుగా ఉంటుంది. వాళ్లలో కండరాలు ఎక్కువ. బలమైన కండరాలకు ఎక్కువ కేలరీలు కావాలి.
నిపుణుల సలహా
కష్టపడి చేసే వ్యాయామం ఫలితాలు చూడటానికి ఒక నెల లేదా రెండు నెలలు పట్టడం కొంచెం విసుగ్గా అనిపించవచ్చు. కానీ వ్యాయామం చేయడం వల్ల కంటికి కనిపించని చాలా మార్పులు బాడీలో జరుగుతాయి. అందుకే ప్రయత్నం ఆపకుండా రోజు వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతుంటారు.