Heart Attack: ఆ జిల్లాలో ఏం జ‌రుగుతోంది.? 40 రోజుల్లో 24 మంది హార్ట్ ఎటాక్‌తో మృతి. రంగంలోకి ముఖ్య‌మంత్రి

Published : Jul 03, 2025, 11:10 AM ISTUpdated : Jul 03, 2025, 02:21 PM IST

మారుతోన్న జీవ‌న‌శైలి, పెరుగుతోన్న ఒత్తిడి, తీసుకునే ఆహారంలో మార్పులు.. కార‌ణం ఏదైనా ఇటీవ‌ల గుండెపోటు బారిన ప‌డుతోన్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా క‌ర్ణాట‌క రాష్ట్రంలోని ఓ జిల్లాలో జ‌రుగుతోన్న మ‌ర‌ణాలు యావ‌త్ దేశం దృష్టిని ఆక‌ర్షించింది. 

PREV
18
క‌ల‌వ‌ర‌పెడుతోన్న గుండెపోటు మర‌ణాలు

కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో గడిచిన 40 రోజుల్లో 24 మంది గుండెపోటుతో మరణించారు. ఈ అంశం దేశవ్యాప్తంగా ఆందోళ‌న‌కు దారి తీసింది. ఈ మరణాల్లో పెద్ద సంఖ్యలో 45 ఏళ్లలోపు యువకులు ఉండటం గ‌మ‌నార్హం. మంగళవారం సంజయ్ (27) అనే యువకుడు పార్టీకి వెళ్లిన సమయంలో ఛాతిలో నొప్పితో కుప్పకూలి మరణించడం, జిల్లాలో ఆకస్మిక మరణాలపై మరింత ఆందోళ‌న పెరిగింది.

28
నిపుణుల కమిటీ ఏర్పాటు

ఈ వరుస మరణాలపై సీఎం సిద్ధరామయ్య రంగంలోకి దిగారు. హసన్‌ జిల్లాలోని పరిస్థితిని సమీక్షించి, గుండెపోటు మరణాలకు గల క‌చ్చితమైన కారణాలను గుర్తించేందుకు డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ పదిరోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. చిన్న వయసు వ్యక్తుల్లో గుండెపోటుకు కోవిడ్ టీకాలు లేదా ఇతర వ్యాధుల సంబంధం ఉందా? అనే అంశాలపై కూడా అధ్యయనం చేయాలని సూచించారు.

38
ఆసుప‌త్రికి క్యూ క‌డుతోన్న ప్ర‌జ‌లు

బెంగళూరులోని శ్రీ జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ కార్డియోవాస్కులర్‌ సైన్సెస్‌కి బుధవారం హసన్‌ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి రోగులు భారీగా తరలివచ్చారు. గతంతో పోలిస్తే 8% ఎక్కువ రోగులు గుండె సంబంధిత ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డానికి వ‌స్తుండ‌డం గమనార్హం. ఇది ప్రజలలో పెరుగుతున్న భయానికి సాక్ష్యంగా నిలుస్తోంది.

48
గ‌ణాంకాలు ఏం చెబుతున్నాయంటే.?

హసన్ జిల్లాలో గుండెపోటుతో మరణించిన 21 మందిలో ఐదుగురు 19-25 ఏళ్ల లోపువారు, ఎనిమిది మంది 25-45 ఏళ్ల మధ్యవారు. జిల్లా ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం గత రెండేళ్లలో నమోదైన 507 గుండెపోటు కేసుల్లో 190 ప్రాణాంతక కేసులుగా నమోదయ్యాయి. యువతలో అధిక రక్తపోటు, మధుమేహం, ఆకస్మిక ఒత్తిడి వంటి కారణాలు ప్రభావం చూపవచ్చునని నిపుణులు అంటున్నారు.

58
కోవిడ్ ప్రభావం ఉందా?

డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే ఫిబ్రవరిలో ఏర్పాటయ్యింది. ఇప్పుడు హసన్ జిల్లాలోని మరణాలపై మరింత లోతుగా అధ్యయనం చేసి, గుండెపోటు, కోవిడ్ టీకాలు, ఆరోగ్యశైలి మధ్య సంబంధాన్ని విశ్లేషిస్తోంది. ఇప్పటి వరకు పరిశీలించిన 18 మరణాల్లో 16 ఇంట్లోనే జరిగాయని, అందులో కొంతమంది ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుండానే మరణించినట్లు వెల్లడైంది. దీనిపై నివేదిక త్వరలోనే ప్రభుత్వానికి అందించనున్నారు.

68
వ్యాక్సిన్‌తో ఎలాంటి సంబంధం లేదు.

ఇదిలా ఉంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేపట్టింది. వ్యాక్సిన్‌కు ఈ మ‌ర‌ణాల‌కు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం బుధవారం స్పష్టం చేసింది. కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో 20 మంది గుండె సంబంధ సమస్యలతో మరణించడానికి కొవిడ్‌ వ్యాక్సినే కారణమంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన క్రమంలో కేంద్రం వివరణ ఇచ్చింది.

78
ఈ జాగ్రత్తలు తప్పనిసరి

గుండె సంబంధిత సమస్యలు ఉండాలంటే తీసుకునే ఆహారంలో క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని చెబుతున్నారు. ముఖ్యంగా పచ్చి కూరగాయలు, పండ్లు, శాకాహారంతో కూడిన డైట్ తీసుకోవాలి. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఉప్పు, చక్కెర త‌గ్గించాలి. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్‌ను తీసుకోవాలి.

88
వ్యాయామం త‌ప్ప‌నిస‌రి

రోజులో క‌నీసం 30 నిమిషాలు వాకింగ్, యోగా, జాగింగ్, సైక్లింగ్ చేయాలి. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. మాన‌సిక ఒత్తిడిని త‌గ్గించుకోవాలి, ఇందుకోసం యోగా, ధ్యానం వంటివి చేయాలి. ధూమపానం, మద్యపానం పూర్తిగా మానేయాలి. క‌చ్చితంగా ప్ర‌తీ రోజూ 8 గంట‌లు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ పరీక్షించుకోవాలి. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్న వారు మ‌రీ ఎక్కువ జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Read more Photos on
click me!

Recommended Stories